
'కబాలీ'పై టాలీవుడ్ ఏమంటోంది!
హైదరాబాద్: భాగ్యనగరంలో ఎక్కడ చూసిన 'కబాలీ' ఫీవర్ కనిపిస్తుంది. దక్షిణాది రాష్ట్రాల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలీ మూవీ చూసేందుకు ఇన్నాళ్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన అభిమానులు థియేటర్ల వద్ద క్యూ కడుతున్నారు. మూవీ చూసేందుకు థియేటర్లకు ప్రేక్షకులు, సెలబ్రిటీలు పరుగులు పెడుతున్నారు. హైదరాబాద్ లో ఐమాక్స్ థియేటర్ వద్ద టాలీవుడ్ ఇండస్ట్రీ సెలబ్రిటీలు డాన్ 'కబాలీ' తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
'చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూనే పెరిగాను. నా రూములో ఆయన పోస్టర్లు ఉన్నాయి. రజనీకాంత్ అంటే పిచ్చి. గతంలో రజనీ ఏ సినిమా చూసేందుకు ఇలా ఎదురు చూడలేదు. డిఫరెంట్ లుక్, మేజరిజమ్, భాషా లాంటి గెటప్ లో కనిపించడంతో ప్రేక్షకులలో ఆసక్తి రెట్టింపయింది. ఆయన స్టైల్ గురించి చెప్పక్కర్లేదు' అని స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కుమారుడు, యంగ్ హీరో పూరి ఆకాశ్ అన్నాడు.
'రజనీకాంత్ ప్రతి సినిమాకు ఇలాంటి వాతావరణం ఉంటుంది. ఎవరికీ అర్థంకాని అదో విచిత్రమైన ఫినామినా. రజనీ తనను ఏమైనా కొత్తగా ఆవిర్కరించుకున్నారా అనే ఆసక్తి ప్రేక్షకులలో ఉంది. పాపులర్ స్టార్ మాత్రమే కాదు ఆయన ఓ అద్భుతమైన నటుడు. అమితాబ్ 60 ఏళ్ల తర్వాత ఎలాంటి సినిమాలు చేస్తున్నారో చూశాం. అంతకంటే ఎక్కువగా రజనీ గారు తన సినిమాల్లో కనిపిస్తారని అందరూ ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పటివరకూ ఆయనను 100 శాతం తెరమీద ఆవిష్కరించిన సినిమా రాలేదు' అని డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ పేర్కొన్నాడు.
'కథ కోసం రాలేదు. కేవలం ఆయన స్టైల్, మ్యానరిజమ్ కోసం వచ్చాను. దేశం మొత్తం రజనీ ఫివర్ ఉంది. ఈ వయసులోనూ ఆయన సంచలనాలు చేస్తారని , రెండున్నర గంటలు ఆయన ఎంటర్ టైన్ చేస్తానని మూవీ చూసేందుకు వచ్చాను' అని టాలీవుడ్ స్క్రిప్ట్ రైటర్ వక్కంతం వంశీ రజనీపై అభిమానాన్ని చాటుకున్నాడు.
'అంతులేనికథ'లో రజనీకాంత్ చేసిన తాగుబోతు పాత్ర నుంచి ఆయనను అభిమానిస్తున్నాను. ఆయన ఇంకా చాలా సినిమాలు చేయాలని, ఆయన మరింత ఆరోగ్యంతో ఉండాలని ప్రొడ్యూసర్ లగడిపాటి శ్రీదర్ కోరుకున్నాడు.
టాలీవుడ్ లోనే కాదు, హాలీవుడ్ లోనూ ఇంత క్రేజ్ ఉన్న హీరో మరోకరు లేరు. రజనీ సార్ కు వీర ఫ్యాన్ ను. చాలా గ్యాప్ తర్వాత ఈ మూవీ వచ్చింది. డిఫరెంట్ లుక్ ముఖ్యంగా గెడ్డంతో కనిపించడం ఆకట్టుకుంటుంది అంటూ సెలబ్రిటీలు 'కబాలీ' గురించి చెబుతున్నారు.