రాజమౌళి, క్రిష్, నాగ్ అశ్విన్, హరీష్ శంకర్, సందీప్, సుకుమార్, అనిల్, కొరటాల శివ, వంశీ పైడిపల్లి
ఎఫ్ ఫర్ ఫ్రెండ్‌షిప్. ఎఫ్ ఫర్ ఫన్... ఎఫ్ ఫర్ ఫుడ్. ఎఫ్ ఫర్ ఫిల్మ్ ఇండస్ట్రీ. సినిమా పరిశ్రమలో ఉన్నవాళ్లంతా కలసికట్టుగా ఉంటే చూడ్డానికి బాగుంటుంది. ఇండస్ట్రీలో ఆరోగ్యకరమైన వాతావరణం ఉందని స్పష్టం చేస్తుంది. ఇక్కడున్న ఫొటో చూస్తుంటే డైరెక్టర్స్ మధ్య ఆ అట్మాస్పియర్ ఉన్నట్లనిపిస్తోంది కదూ. వీళ్లందరూ ఎఫ్ అండ్ ఎఫ్ (ఫన్ అండ్ ఫుడ్)తో మస్తీ చేశారు. సీనియర్ డైరెక్టర్ రాజమౌళి (ఫొటోలో ఉన్న డైరెక్టర్స్ అందరిలోకల్లా రాజమౌళి ముందు (2001) డైరెక్టర్ అయిన విషయం తెలిసిందే) టు యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి... మొత్తం తొమ్మిది మంది దర్శకులు సోమవారం సాయంత్రం కలిశారు. ఈ గెట్ టు గెదర్‌కి వేదిక డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఇల్లు. ఈ పార్టీ ప్లాన్ వంశీ పైడిపల్లి, సుకుమార్‌లది. అప్పుడప్పుడూ ఇలా కలిస్తే, ఒకరి థాట్స్ మరొకరు షేర్ చేసుకోవడంతో పాటు సాన్నిహిత్యం కూడా పెరుగుతుందన్న ఆలోచనతో ఈ పార్టీని ప్లాన్ చేశారు. వంశీ పైడిపల్లి అతిథి మర్యాదలు చేయడంలో బెస్ట్ అని ఆయన ఆతిథ్యం తీసుకున్నవాళ్లు అంటుంటారు. పసందైన విందు భోజనం ఏర్పాటు చేశారట. ‘‘నేను హలీమ్‌ని ఎంజాయ్ చేశాను. జనరల్‌గా నేను తక్కువ మాట్లాడతా. పార్టీలో కూడా అంతే. బట్.. అందర్నీ కలుసుకోవడం, వాళ్ల అనుభవాలు వినడం చాలా బాగా అనిపించింది’’ అని నాగ్ అశ్విన్ అన్నారు. కొంతమంది దర్శకులు సోషల్ మీడియా ద్వారా ఒపీనియన్స్ షేర్ చేసుకున్నారు.
నాన్‌స్టాప్ నవ్వులు – రాజమౌళి
‘‘వంశీ (వంశీ పైడిపల్లి), సుక్కు(సుకుమార్) కలిసి ఇనిషియేట్ తీసుకున్నారు. వంశీ ఇంట్లో అందరం కలిశాం. బాగా ఎంజాయ్ చేశాం. శివ (కొరటాల శివ), హరీష్ శంకర్ చెప్పిన స్టోరీలను మర్చిపోలేను. అలాగే వన్ లైనర్స్ కూడా. సోమవారం రాత్రి కలిసిన అందరం నెక్ట్స్ డే మార్నింగ్ (మంగళవారం) నాలుగు గంటల వరకు నవ్వుతూనే ఉన్నాం’’ అన్నారు రాజమౌళి. ‘‘మీరు (రాజమౌళిని ఉద్దేశించి) మాతో ఉండటం మాకు హ్యాపీ. థ్యాంక్స్ ఫర్ ది వండ్రఫుల్ ఈవెనింగ్. కాదు. కాదు. నిజానికి మార్నింగ్’’ అన్నారు హరీష్ శంకర్. ఈ డైరెక్టర్స్ మీట్ గురించి అల్లు అర్జున్ అభిప్రాయం ఇలా ఉంది. ‘‘సుకుమార్, వంశీ లవ్లీ ఇనిషియేట్ తీసుకున్నారు. బిగ్ డైరెక్టర్స్ అందర్నీ ఒక ఫ్రేమ్‌లో చూడటం హ్యాపీగా ఉంది’’ అన్నారు. దర్శకుడు వంశీ పైడిపల్లిని, ఇతర దర్శకులను అడపా దడపా కలిసిన ‘అర్జున్‌రెడ్డి’ ఫేమ్ సందీప్‌రెడ్డి ఈ మీట్ ద్వారానే తొలిసారి రాజమౌళిని కలిశారట. దర్శకులందరూ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారట.
Comments
Please login to add a commentAdd a comment