మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నా..
ఏలూరు : ‘స్వయంవరం’ చిత్రంతో హీరోగా ప్రేక్షకుల మదిలో చోటు దక్కించుకున్న నటుడు వేణు తొట్టెంపూడి మంగళవారం స్థానిక చిన వెంకన్న ఆలయానికి విచ్చేశారు. ముందుగా శ్రీవారిని, పద్మావతి, ఆండాళ్ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ఆవరణలోకి వచ్చిన ఆయన్ని పలువురు భక్తులు గుర్తించి కరచాలనం చేశారు. తమ అభిమాన నటుడితో ఫొటోలు దిగారు.
మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నా..
ఈ సందర్భంగా వేణు విలేకరులతో మాట్లాడారు. 1999లో తాను స్వయంవరం చిత్రంతో సినీ పరిశ్రమకు పరిచయమైనట్టు చెప్పారు. తాను నటించిన ఎన్నో చిత్రాలు హిట్ అయ్యాయని, దీంతో తనకు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు లభించిందని అన్నారు.
ఇప్పటి వరకు తాను 28 చిత్రాల్లో నటించానని, ఇందులో హీరోగా నటించిన స్వయంవరం, చిరునవ్వుతో, ఖుషిఖుషీగా, యమగోల, రామాచారి వంటి చిత్రాలు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయన్నారు. ప్రస్తుతం తాను మంచి అవకాశాల కోసం వేచి చూస్తున్నట్టు చెప్పారు.