నాటి సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న కాశీ విశ్వనాథ్
ఆయన కలం బలం ఎంత గొప్పదో చెప్పడానికి ‘పట్నం వచ్చిన పతివ్రతలు’ చిత్రంలో నటుడు నూతన ప్రసాద్ చేత పలికించిన ‘దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందిప్పుడు ... లెఫ్ట్ నుంచి చైనా, రైట్ నుంచి పాకిస్తాన్, బ్యాక్ నుంచి వరదలు, ఫ్రంట్ నుంచి కరువులు మన దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి’ అనే డైలాగు ఒక్కటి చాలు. ఇది మచ్చుతునక మాత్రమే. ఇవి కేవలం డైలాగులు కావు. అవధుల్లేని జలధి వంటి జీవితంలో మునిగితేలిన ఓ మేటి నావికుడు బతుకు లోతుల్లో నుంచి వెలికి తీసి పదిమందికి పంచిన ఆణిముత్యాలు.
విశాఖపట్నం : జీవితాన్ని భిన్న కోణాల్లో దర్శించి, ఎంతో మధనపడి, ఆలోచించి, ఆవేశపడి, అనుభవాల అక్షయతూణీరంలో నుంచి సంధించిన అక్షరాస్త్రాలు, హాస్య తుషారాలు కాశీవిశ్వనాథ్ రచనలు. సినీ రచయిత కాశీవిశ్వనాథ్ లేకపోయినా ఆయన రచనలు పెదాలపై నవ్వులను విరబూయిస్తూనే ఉంటాయి. ఆయన ఆలోచనలు రంగస్థలంపై రసావిష్కరణకు తెర తీశాయి. వెండి తెరపై తళుక్కున మెరిశాయి. రంగస్థల రచయితగా, నటుడుగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు ప్రఖ్యాతి పొందిన కాశీవిశ్వనాథ్ జీవితమే అక్షరమై వెలిగింది.
వన్‌టౌన్ ఏరియాలో పుట్టి పెరిగిన కాశీ విశ్వనాథ్‌కు విశాఖ అంటే ఎంతో ప్రేమ. తెలుగు సినిమా రంగంలో చీఫ్ టెక్నీషియన్ హోదాలో హైదరాబాద్‌లో సదుపాయాలు పొందే అవకాశం ఉన్నా ఆయన విశాఖనే శాశ్వత చిరునామాగా చేసుకొన్నారు. చదువుకొన్న ఏవీఎన్ కశాశాల అన్నా, ఉద్యోగం ఇచ్చిన పోర్టు అన్నా ఎంతో మమకారమని చెప్పే అయన విశాఖ మీద ప్రేమతో ఇసాపట్నం పేరిట 20 కథల సంకలనాన్ని ప్రచరించారు. సినీ రచనపై రైటర్స్ వర్క్‌షాపును కూడా ఆయన విశాఖలోనే నాలుగేళ్ల క్రితం నిర్వహించి 56 మందికి శిక్షణ ఇచ్చారు.
కాశీవిశ్వనాథ్ రచనలకు స్ఫూర్తి రావిశాస్త్రి. పోర్టులో అకౌంటెంట్‌గా ఉద్యోగం చేస్తూ క్రీడాకారుడిగా గుర్తింపు పొందిన విశ్వనాథ్ రావిశాస్త్రికి ఏకలవ్య శిష్యుడుగా ప్రాచుర్యం పొందారు. ఒక దీపం వెలిగింది నాటికకు రావిశాస్త్రి ముందుమాట రాసి విశ్వనాథ్‌ను ప్రోత్సహించారు. తన జీవిత కాలంలో 131 సినిమాలకు కథ, మాటలు రాసి 52 సినిమాల్లో నటించిన కాశీవిశ్వనాథ్ బుల్లితెరపైనా తన ముద్ర వేశారు.
నాటకాలే నిచ్చెనగా సినీ ప్రస్థానం :
కాశీ విశ్వనాథ్‌కు నాటికలే ఎంతో ఆత్మ సంతృప్తినిచ్చాయి. నాటకం నా మనస్సును నింపితే..సినిమా నా కడుపు నింపిందనేవారు. కదిలిపోతున్న కాలంలో గాలికి ఎగిరిపోకుండా నిలబడిన నాటికలు, నాటకాలు సుమారు 35 వరకు రాశారు. హాస్యనటుడు రాజుబాబు 70వ దశకంలో మద్రాసు వాణిమహల్లో తన జన్మదినోత్సవాన్ని వైభవంగా జరుపుకొన్నారు. ఆ ఉత్సవాల్లో నవోదయ కళానికేతన్ తరుపున ఒక దీపం వెలిగింది, మనస్సున్న మనిషి అనే నాటకాల్ని విజయవంతంగా ప్రదర్శించడంతో సినిమా ప్రముఖల దృష్టిని ఆకర్షించారు.
రచనలే కాదు ఆటల్లోను యోధుడే :
కాశీ విశ్వనాథ్ కేవలం రచనలు, మాటల మనిషి కాదు..ఆటల యోధుడు కూడా. మూడు పర్యాయాలు వెయిట్ లిప్టింగ్‌లో ఆలిండియా ఇంటర్ యూనివర్శిటీ చాంపియన్ ఆయన. 1964లో సిలోన్‌లో, 68లో కలకత్తాలో, 69లో హైదరాబాద్‌లో జరిగిన పోటీల్లో ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థిగా ఛాంపియన్‌షిప్ సాధించిన విశ్వనాథ్ 72లో జూనియర్ నేషనల్ చాంపియన్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన విశాఖ పోర్టులో జిమ్నాజియమ్ ఏర్పాటుకు బీజాలు వేసి అందులో పార్ట్‌టైమ్ కోచ్‌గా చాలా మందికి శిక్షణ ఇచ్చారు. ఒలింపిక్స్‌లో పాల్గొన్నారు.
రచనలు :
కథా రచన వల్ల క్లుప్తత, నవల వల్ల చిత్రానువాదం, నాటకాల వల్ల పాత్రోచిత సంభాషణ రాయడంలో కాశీవిశ్వనాథ్ దిట్ట. ఆయన సాహిత్య నేపథ్యంలో రేలంగి నరసింహారావు దర్శకత్వంలో (నేనూ మా ఆవిడ), విజయబాపినీడు(మగమహారాజు), మౌళి (పట్నం వచ్చిన పతివ్రతలు) వంటి దర్శకుల మొదటి చిత్రాలకు కాశీ విశ్వనాథ్ రచనలు చేయడం ఆ సినిమాలు ఘన విజయం సాధించడం ఆయనకు ఒక అనుభూతినిచ్చాయి.
కాశీవ్వినాథ్ కలం ఎంతో బలం. రావిశాస్త్రి పొత్సహంతో ఇంకా తెలవారలేదు, మార్పు, వెలగని దీపం వెలిగింది, గెజిటెడ్ ఆఫీసర్ పద్మశ్రీ, భయం, ఎండ లాంటి కథలెన్నో రాశారు. కాల గమనంలో సుమారు ఓ వంద కథలు రాశారు. అందులో ఓ ఏడెనిమిది కథలు ఇతర భాషల్లోకి అనువదమయ్యాయి. ఓ వర్షం రాత్రి, పద్మశ్రీ అనే రెండు కథా సంకలనాలు వెలువరించాయి. రావిశాస్త్రి స్కూల్ ఆఫ్ రైటింగ్‌లో రాసే కథకుల్లో కాశీవిశ్వనాథ్‌కి ఓ ప్రముఖస్థానం ఉంటుందని పురాణం సుబ్రహ్మణ్యశర్మ ఓ వర్షం రాత్రి కథా సంకలనం ముందుమాటలో రాశారు.
కన్నీటికి నీరొచ్చింది, నలిగిపోయిన డైరీలో చినిగిపోయిన పేజీ, పూజకు పనికిరాని పువ్వు...లాంటి ఎన్నో నవలలు, మీరైతే ఏం చేస్తారు?, గరీబీహఠావో లాంటి నాటికలు బాగా ప్రాచుర్యంలో వచ్చాయి. కాశీవిశ్వనాథ్ రాసిన కథాసాగర్ సంపుటి గ్రూప్ 1 మెయిన్స్ సిలబస్‌లో చేర్చడం విశేషం. ఎల్లప్పుడూ నవ్వుతూ జీవించడం..సీరియస్‌గా ఆలోచించడం, చిత్తశుద్ధితో కృషి చేయడమే ఆయన లక్ష్యంగా ఎదిగారు.
కలిసొచ్చిన అదృష్టం :
ఒక దీపం వెలిగింది నాటికకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి అవార్డును అందుకున్న కాశీ విశ్వనాథ్‌కు వేదిక దిగుతుండగానే సినిమా రచన చేసే అవకాశాలొచ్చాయి. మరో ఇద్దరు నిర్మాతలతో కలసి వేదిక వద్దకు వచ్చిన ప్రఖ్యాత నిర్మాత డాక్టర్ చటర్జీ సినిమా రచన చేయాల్సిందిగా కోరారు. అలా ‘రామాయణంలో పిడకల వేట’సినిమాకు రాసిన కాశీవిశ్వనాథ్‌ను ఒకేసారి ఐదు సినిమా అవకాశాలు వెతుక్కొంటూ వచ్చాయి.
ఆ దశలో రావు గోపాలరావు, రాజుబాబు, నూతనప్రసాద్ అండగా నిలిచి ప్రోత్సహించారు. 1980 నుంచి ఇప్పటి వరకు 131 సినిమాలకు కథలు, మాటలు, స్క్రీన్‌ప్లే సమకూర్చిన కాశీ విశ్వనాథ్ 52 చిత్రాల్లో నటించారు. ఆయన రచనలు సమాజంలోని సమస్యలను బలంగా ఆవిష్కరింప చేశాయి. సమస్యలకు పరిష్కారాలను కూడా సమగ్రంగా ప్రతిఫలించాయి. సందేశాలిచ్చిన ఆయన నాటకాలు వినోదానికి కూడా అగ్రాసనం వేశాయి.
జీవనచిత్రం
జన్మదినం : 05.07.1946
జన్మస్థలం : వన్‌టౌన్, విశాఖపట్నం
తల్లిదండ్రులు: బుచ్చమ్మ, అప్పలస్వామి
భార్య : మహాలక్ష్మి(అమ్మాజీ)
కుమార్తె : పుష్పలత
కుమారులు : కళ్యాణ చక్రవర్తి, ఇంజినీర్, శ్రీధర్, పోర్టు ఉద్యోగి
విద్యార్హత : బి.ఏ
అవార్డులు :
1980లో ఒక దీపం వెలిగింది నాటికకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డ్
2005, 2006 సంవత్సరంలో మానవత్వానికి మరో కోణం నాటిక, ట్రెండ్ మారిన నాటకం, సినిమా రచన కొన్ని మౌలికాంశాలు పుస్తకాలకు వరసగా 3 నంది అవార్డులు
2007లో ఉత్తమ నాటక రచయితగా తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం.
2010లో రంగస్థల నటుడిగా ఎన్‌టీఆర్ స్మారక అవార్డు
కథాసంకలనాలు : ఓ వర్షం రాత్రి, పద్మశ్రీ
పుస్తకాలు : నాటక నవరత్నాలు, సినిమా రచన-కొన్ని మౌలిక అంశాలు
మంచి హాస్య రచయిత
కాశీ విశ్వనాథ్ చాలా మంచి హాస్య రచయిత. నేను ఆయన సినిమాల్లో కలిసి నటించాం. నాకు బావమర్దిగా నటించారు. నా కోసం చాలా సినిమాలు రాశారు. చాలా మంచి మిత్రుడు. ఆయన నాటకాలకు నేను మంచి ఉపోద్ఘాతాలు రాశాను. ఈ మధ్యనే ఆయన మనవడు పుట్టిన రోజు వేడుకలకు వెళ్లాను అదే చివరి చూపు. ముఖ్యంగా సినీ పరిశ్రమలో నాకోసం ప్రత్యేకమైన పాత్రలకు సంభాషణలు రాశారు. సహచర నటుడిని కోల్పోయానన్న బాధ చాలా ఉంది. సినీ పరిశ్రమ మంచి హాస్య రచయితను కోల్పోయింది. ముఖ్యంగా ఆయన లేని లోటు సినీ పరిశ్రమకే కాకుండా విశాఖ కళా, సాహితీ రంగాలకు తీరని లోటు. ఈ లోటును పూడ్చడం కష్టం.
-గొల్లపూడి మారుతీరావు, సినీ రచయిత, నటుడు
విశాఖ సాహితికి స్ఫూర్తిదాయక సేవలు
విశాఖ సాహితి సంస్థ కు కాశీ విశ్వనాథ్ అందించిన సేవలు స్ఫూర్తిదాయకం. ఆయన అప్పట్లో రాసిన వెలగని దీపం వెలిగింది అనే కథకు కథల పోటీలలో బహుమతి లభించింది. కథా రచయితగా వారి ప్రస్థానం విశాఖ సాహితి ద్వారానే జరిగిం ది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షిస్తున్నాను.
- ఆచార్య మలయవాసిని, అధ్యక్షురాలు, విశాఖ సాహితి
ఆయన కామెడీ అమోఘం
కామెడీ స్కిట్స్ రచన, నటనలకు మార్గదర్శకుడు కాశీవిశ్వనాథ్. కామెడీ క్లబ్‌లో భాగస్వామిగా ఉంటూ సభ్యులు నటించలేని కష్టమైన పాత్రలను ఆయన చేసేవారు. కామెడీ స్కిట్స్ ఎలా ఏ రూపంలో ఉంటే ప్రేక్షకులు నవ్వుతారో ఆయన వద్దనే నేర్చుకున్నాం. తాము ప్రదర్శించడానికి వేదికలు లభించని తరుణంలో కాశీవిశ్వనాథ్‌గారు మా క్లబ్‌లో ప్రదర్శించడం ప్రారంభించిన తర్వాత నగరంలో వేదికలు మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాయి. వుడా నిర్వహణలో ఉన్న గురజాడ కళాక్షేత్రం తమ క్లబ్‌కు ఆయన దయతోనే ఉచితంగా చాలా రోజులు ఇచ్చారు. ఆయన స్కిట్ రచిస్తే నవ్వులే పువ్వులు.
-మస్తాన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి
క్రియేటివ్ కామెడీ క్లబ్
ఆయన ప్రసంగంలో అన్నీ నవ్వులే..!
ఆయన నవ్వుల రసజ్ఞతను పంచే మహా హాస్యరచయిత. ఎక్కడ ప్రసంగిస్తే అక్కడే నవ్వులు జల్లుమంటాయి. అంగర సూర్యారావుగారు రచించిన తండ్రీకొడుకులు నాటకంలో కాశీవిశ్వనాథ్ గురువు, నేను బాల నటుడుగా నటించాను. ఆయన రచించిన అడ్రస్ లేని మనుష్యులు, ఓటున్న ప్రజలకు కోటి దండాలు, మనస్సున్న మనిషి, పూజకు పనికిరాని పువ్వు వంటి అద్భుతమైన నాటికలకు దర్శకత్వం వహించే భాగ్యం దక్కింది.
కామెడీ నాటకాలు రాయడంలో చాలా దిట్ట. వాటిలో ఆయనకు ఓ ప్రత్యేకమైన స్టయిల్. మగమహారాజు చిత్రానికి కథ రచయితగా కీర్తిప్రతిష్టలు పొందారు. కాశీ విశ్వనాథ్‌లాంటి స్నేహశీలిని కోల్పోవడం ఇటు సాహిత్యానికి, నాటక, కథ రచయితలకు, సినిమా పరిశ్రమకు తీరని లోటు. కాశీవిశ్వనాథ్ గారు మోస్ట్ సక్సెస్‌ఫుల్ రైటర్.
-ఎల్.సత్యానంద్, స్టార్ మేకర్