బాలచందర్ స్ఫూర్తితో దర్శకుడినయ్యా ..
ద్వారకాతిరుమల : సినీ దర్శక దిగ్గజం బాలచందర్‌ను చూసి స్ఫూర్తి పొంది సినీ రంగంలోకి ప్రవేశించానని దర్శకుడు, నటుడు కాశీవిశ్వనాథ్ అన్నారు. ద్వారకాతిరుమల చినవెంకన్నను మంగళవారం ఆయన కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తనది తూర్పుగోదావరి జిల్లా పురుషోత్తపట్నం అని, రైతు కుటుంబంలో జన్మించానని చెప్పారు. ఇంటర్ చదువుతున్న రోజుల్లో తమ గ్రామంలో దర్శకుడు బాలచందర్ చిత్రీకరణలో తొలి కూడి కోసింది చిత్రం షూటింగ్ జరిగిందని, బాలచందర్‌ను చూసి దర్శకుడు కావాలని అప్పుడే నిర్ణయించుకున్నానన్నారు.
15 ఏళ్ల నుంచి తాను సినీ పరిశ్రమలో ఉన్నానని, నువ్వులేక నేనులేను చిత్రంతో దర్శకుడిగా, నచ్చావులే చిత్రంతో నటుడిగా పరిచయమయ్యానన్నారు. ప్రస్తుతం వయసుకు తగ్గ పాత్రలు పోషిస్తున్నానని చెప్పారు. విభిన్న పాత్రలు పోషించేందుకు ప్రయత్నిస్తున్నానని విశ్వనాథ్ అన్నారు.