హాస్య నటుడు గుండు హనుమంతరావు (ఫైల్ ఫొటో)
సాక్షి, వెబ్ డెస్క్ : వెండితెరపై తన హావభావాలతో తెలుగువాడికి కితకితలు పెట్టిన గుండు హనుమంతరావు సోమవారం తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన భౌతికంగా మనందరికీ దూరమైనా వెండితెరపై పూయించిన నవ్వులతో మన హృదయాల్లోనే ఉంటారు. 1956 అక్టోబర్ 10న విజయవాడ నగరంలో హనుమంతరావు జన్మించారు. చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిక ముందు మిఠాయిల వ్యాపారం చేశారు. ‘అహ నా పెళ్లంట’ చిత్రంతో తెరంగేట్రం చేశారు. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు రావడంతో ఆయన వెనుదిరిగి చూసుకోవాల్సిన పని లేకుండా పోయింది.
కెరీర్‌లో 400లకు పైగా చిత్రాల్లో హస్యానికి ప్రాణం పోశారు. బాబాయ్ హోటల్, కొబ్బరి బోండా, యమలీల, చినబాబు, ప్రేమ చిత్రం పెళ్లి విచిత్రం, తప్పుచేసి పప్పుకూడు, పెళ్లి కాని ప్రసాద్, అన్నమయ్య, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, మృగరాజు, రిక్షావోడు, కలిసుందాం రా, జగదేక వీరుడు అతిలోక సుందరి, ఘటోత్కచుడు, మాయలోడు, శుభలగ్నం, పాపారావు, మావిచిగురు, ఆలస్యం అమృతం, క్రిమినల్, పెళ్లా ఊరెళితే, బాలు తదితర చిత్రాల్లో హనుమంతరావు నటనకు మంచి గుర్తింపు లభించింది.
గుండు హనుమంతరావు బుల్లితెర ధారావాహికల్లో నటించిన గుండు హనుమంతరావుకు అమృతం సీరియల్ ఎంత పేరు తెచ్చిపెట్టిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నేటికీ అమృతం సీరియల్ రీ-టెలికాస్ట్ అవుతోంది. బుల్లితెరలో అద్భుత నటనకు గాను హనుమంతరాదు మూడు నంది అవార్డులు అందుకున్నారు. గుండు హనుమంత రావుకు భార్య, ఇద్దరు పిల్లలుండగా ఇదివరకే కూతురు, భార్య చనిపోయారు. మూత్ర సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన కొద్ది రోజులుగా సినిమాలకు దూరంగా ఉన్నారు.
ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న హనుమంతరావుకి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ. 5 లక్షలు సాయం చేసింది. ప్రముఖ సినీ నటుడు చిరంజీవి కూడా హనుమంతరావుకి రూ. 2 లక్షల ఆర్థిక సాయం చేశారు. ఎస్‌ఆర్ నగర్‌లోని నివాసంలో సోమవారం తెల్లవారుజామున 03.30 గంటలకు హనుమంతరావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
సెయింట్ థెరిస్సా ఆసుపత్రికి తరలిస్తుండగా తనువు చాలించారు. హనుమంతరావు హఠాన్మరణం తమను కలివేసిందని పలువురు సినీ ప్రముఖులు అన్నారు. ఆయనకు నివాళులు అర్పించారు. గోకుల్ థియేటర్ ఎదురుగా ఉన్న జెట్ కాలనీలో గల హనుమంతరావు నివాసంలో భౌతికకాయాన్ని ఉంచారు.
Comments
Please login to add a commentAdd a comment