ఐటమ్ సాంగులా...? నో!
త్రిష హవా తగ్గినా... నటిగా ఆమెను ఇప్పటికీ అందరూ ఇష్టపడుతూనే ఉంటారు. ఎందుకంటే... ఈ తరం కథానాయికల్లో నటన పరంగా త్రిష బెస్ట్. అందులో ఏ మాత్రం సందేహం లేదు. అందుకే... తనకున్న మంచి పేరును చెడగొట్టుకోలేనని ఇటీవల ఓ సందర్భంలో కరాఖండిగా చెప్పేసింది త్రిష. వివరాల్లోకి వెళితే -‘నేను దర్శకత్వం వహిస్తున్న ‘తారై తప్పటై ్ట’ సినిమాలో ఓ ఐటమ్‌సాంగ్ ఉంది. చేస్తారా’ అని త్రిషను దర్శకుడు బాల ఇటీవల అడిగారట. దానికి త్రిష ఆలోచించకుండా ‘నో’ చెప్పేసిందట. ‘‘నాకు పరిశ్రమలో మంచి పేరుంది. దాన్ని చెడగొట్టుకోలేను. పాత్ర మంచిదైతే... సెకండ్ హీరోయిన్‌గా చేయడానికి కూడా నేను సిద్ధమే కానీ, ఐటమ్‌సాంగుల స్థాయికి మాత్రం నన్ను నేను దిగజార్చుకోలేను’’ అని నిర్మొహమాటంగా త్రిష చెప్పేసిందని తెలిసింది.
గతంలో షారుక్ ఖాన్ ‘చెన్నయ్ ఎక్స్‌ప్రెస్’, సూర్య ‘సింగమ్-2’ చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్ చేయమని త్రిషకు ఆఫర్లు వచ్చినా, వాటికి ఆమె ‘నో’ చెప్పేసింది. ఇప్పుడు బాల సినిమా వంతు వచ్చిందన్నమాట. ఇదిలావుంటే... ప్రస్తుతం తమిళంలో ఓ చిత్రం, కన్నడంలో ఓ చిత్రం చేస్తున్న త్రిషకు... తెలుగులో ఓ బంపర్ ఆఫర్ తలుపుతట్టిందని సమాచారం. బాలకృష్ణ కథానాయకునిగా సత్యదేవ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కథానాయికగా త్రిషను అడిగినట్లు తెలిసింది. త్రిష కూడా ఈ సినిమా విషయంలో సానుకూలంగానే స్పందించినట్లు సమాచారం. అంటే త్వరలో బాలయ్య, త్రిషల జోడీని ప్రేక్షకులు చూడనున్నారన్నమాట.