సూపర్‌స్టార్‌తో జతకట్టే చాన్స్‌ మిస్‌ అయ్యా! | Trisha Grabbed Meera Mithun Opportunity To Pair Rajinikanth | Sakshi
Sakshi News home page

Published Sun, Jan 6 2019 9:26 AM | Last Updated on Sun, Jan 6 2019 1:52 PM

Trisha Grabbed Meera Mithun Opportunity To Pair Rajinikanth - Sakshi

సూపర్‌స్టార్‌తో రొమాన్స్‌ చేసే అవకాశాన్ని కొద్దిలో మిస్‌ అయ్యానంటోంది అందాలభామ మీరామిథున్‌. మోడలింగ్‌ రంగంలో అంతర్జాతీయస్థాయిలో క్రేజ్‌ తెచ్చుకున్న మీరామిథున్‌ ఇటీవలే సినీరంగానికి పరిచయమైంది. నటుడు సూర్య కథానాయకుడిగా నటించిన తానాసేర్నద కూట్టం చిత్రంలో నటుడు కలైయరసన్‌కు జంటగా నటించింది. అదేవిధంగా 8 తూట్టాగళ్‌ చిత్రంలోనూ ముఖ్యపాత్రను పోషించింది. మిస్‌ సౌత్‌ ఇండియా సుందరి కిరీటాన్ని గెలుచుకున్న మీరామిథున్‌ చెన్నై అగ్‌మార్క్‌ చిన్నది.

చదువు, నాట్యంపైనే దృష్టి పెట్టిన మీరామిథున్‌ను ఆమె పొడవు, మేని ఛాయ మోడలింగ్‌ రంగంలోకి అడుగుపెట్టేలా చేశాయట. ఒక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఈ అమ్మడిని చూసిన కొందరు మీరు మోడలా అని అడిగారట. అంతే మీరా మిథున్‌కు మోడలింగ్‌ రంగంపై ఆసక్తి పెరిగిందట. అయితే ఈమె తండ్రి కూడా మిస్టర్‌ మెడ్రాస్, మిస్టర్‌ తమిళనాడు పోటీల్లో గెలుపొందారు. ఆయన కూడా మీరామిథున్‌కు స్ఫూర్తిగా నిలవడంతో కో ఆప్‌టెక్స్‌కు మోడల్‌గా తన పయనానికి శ్రీకారం చుట్టి ఆ తరువాత ప్రముఖ వ్యాపార సంస్థలకు మోడల్‌గా మారిపోయింది.

దీంతో పలువురు ఒత్తడితో నటిగా సినీరంగప్రవేశం చేసింది. అలా మొట్టమొదటి సారిగా గ్రహణం చిత్రంలో మోడల్‌గా ఎంట్రీ ఇచ్చింది. పలు అవకాశాలు మీరామిథున్‌ను వెతుక్కుంటూ వస్తున్నా, అవి సంతృప్తినివ్వకపోవడంతో అంగీకరించడం లేదట. సెలక్టివ్‌ చిత్రాలనే చేస్తున్న మీరామిథున్‌ 2019లో తెరపైకి రానున్న తాను నటించిన చిత్రాలు మంచి పేరు తెచ్చిపెడతాయనే ఆశాభావంతో ఉంది. ఇకపై కూడా హీరోయినా, క్యారెక్టర్‌ ఆర్టిస్టా అన్నది చూడకుండా నటనకు అవకాశం ఉన్న ఏలాంటి పాత్రనైనా చేయడానికి రెడీ అంటున్న మీరామిథుల సమీప కాలంలో చేసిన ఒక వాణిజ్య ప్రకటనలో చాలా గ్లామరస్‌గా నటించడంతో విమర్శలను ఎదుర్కొంది. 

చాలా గ్లామర్‌గా ఉన్నావంటూ ప్రశంసించిన వారు ఉన్నారంటోంది ఈ అమ్మడు. అయితే ఆ ప్రకటనలో ఎందుకు నటించాల్సి వచ్చిందన్న విషయాన్ని మీరామిథున్‌ తెలుపుతూ తనను ఫొటో తీసిన ఒక ప్రముఖ ఫొటోగ్రాఫర్‌ ఒక యాడ్‌ ఉంది నటిస్తావా అని అడిగి నువ్వు చేయకపోతే ఏ నైజీరియాకో, ఆఫ్రికాకో చెందిన మోడల్‌తో నటింపజేస్తానని, అయితే మీరైతే బాగుంటుందని అన్నాడంది. దీంతో ఆ అవకాశాన్ని వదులుకోవడానికి తనకు మనసంగీకరించకపోవడంతో ఒప్పుకున్నానని, అయినా మోడలింగ్‌ అన్నది ఒక కళ అని దాన్ని ఆ దృష్టితోనే చూడాలని పేర్కొంది.

మరో విషయం ఏమిటంటే తనను సినిమాల్లోకి రావాలని చెప్పింది నటుడు విశాలే అని చెప్పింది. పేట చిత్రంలో రజనీకాంత్‌కు జంటగా త్రిష పాత్రలో తానే నటించాల్సిందని, లుక్‌ టెస్ట్, స్క్రీన్‌ టెస్ట్‌ వరకూ వెళ్లిన తరువాత ఏవో కొన్ని కారణాలతో ఆ అవకాశాన్ని మిస్‌ అయ్యానని చెప్పింది. అదేవిధంగా విక్రమ్‌ హీరోగా కమలహాసన్‌ నిర్మిస్తున్న గడారం కొండాన్‌ చిత్రంలోనూ ముఖ్యపాత్రలో నటించడానికి ఒప్పందం చేసినా, అదీ చివరి క్షణంలో మిస్‌ అయ్యిందని చెప్పింది. అయితే మిస్‌ అయిన అవకాశాలు మరో రూపంలో తనను వెతుక్కుంటూ వస్తాయన్న నమ్మకాన్ని నటి మీరామిథున్‌ వ్యక్తం చేసింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement