సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ అంబాసిడర్‌గా త్రిష
సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) సందడి మొదలవ్వనుంది. ఈ సీసీఎల్‌లో చెన్నై రైనోస్ టీమ్ ప్రచారకర్తగా చెన్నై చిన్నది త్రిష ఎంపికైంది. నటుడు విశాల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్న ఈ టీమ్‌కు త్రిష అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. ఈ టీమ్‌కు నటి తమన్నాతో సహా పలువురు హీరోయిన్ల పేర్లు పరిశీలనకు రాగా చివరికి చెన్నై బ్యూటీ త్రిషను ఎంపిక చేసినట్లు చెన్నై రైనోస్ డెరైక్టర్ శ్రీకాంత్ బాబు వెల్లడించారు. తమ టీమ్ ప్రచారకర్తగా త్రిషను నియమించడం సంతోషకరంగా భావిస్తున్నట్లు ఆయన అన్నారు.
తమిళం, తెలుగు, హిందీ అంటూ చుట్టొచ్చిన త్రిష తాజాగా కన్నడ రంగ ప్రవేశం చేశారు. ప్రస్తుతం ఈ సుందరి పునీత్ రాజ్‌కుమార్ సరసన నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ హూబ్లీ సమీపంలోని సీమాంధ్ర ప్యాలెస్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. సీసీఎల్ ప్రచార కర్తగా ఎంపికైన విషయం గురించి త్రిష మాట్లాడుతూ మూడేళ్లుగా సీసీఎల్ నిర్వాహకులు తనను సంప్రదిస్తూనే ఉన్నారన్నారు. అయితే వేర్వేరు కారణాల వల్ల కుదరలేదన్నారు. ఈ లీగ్‌కు అంబాసిడర్‌గా ఎంపికవ్వడం సంతోషంగా ఉందన్నారు. తాను తొలుత ప్రేమించేది చెన్నైనేనన్నారు. అలాంటి చెన్నై రైనోస్ టీంలో తానూ భాగం కావడం ఆనందంగా ఉందని త్రిష పేర్కొన్నారు.