
త్రిష రియల్ గర్జన
నటి త్రిష నటిస్తున్న తాజా చిత్రం గర్జన. సెంచరీ ఇంటర్నేషనల్ ఫిలింస్ పతాకంపై నిర్మాత జోన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు సుందర్‌బాలు తెరకెక్కిస్తున్నారు. వంశీకృష్ణ, వడివుక్కరిసి, తవసి, ఆర్యన్, అమిత్, లొల్లుసభ స్వామినాథన్, శ్రీరంజిని, మదురైముత్తు, జాంగిరి మధుమిత, శరత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి అమ్రిష్ సంగీతాన్ని, చిట్టిబాబు ఛాయాగ్రహణం అందిస్తున్నారు. చిత్రం గురించి దర్శకుడు తె లుపుతూ గర్జన కథానాయకి చుట్టూ తిరిగే కమర్శియల్ అంచనాలతో కూడిన విభిన్న కథా చిత్రం అని చెప్పారు.
చిత్ర కథ, కథనాలు నచ్చడంతో ఇందులో నటించడానికి నటి త్రిష వెంటనే అంగీకరించారన్నారు. ఐదుగురు స్నేహితులు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడం వాటిని సెల్‌ఫోన్ లో చిత్రీకరించి సోషల్‌మీడియాలో పోస్ట్ చేసి వా రిని బ్లాక్ మెయిల్ చేయడం లాం టి అకృత్యాలకు పాల్పడతారన్నారు. అదే విధంగా తమ ప్రేమను తిరస్కరించిన అమ్మాయిలపై అత్యాచారాలకు పాల్పడి వారిని హత్య చేస్తారన్నారు. ఈ గ్యాంగ్ వెనుక కొందరు పెద్ద మనుషులు ఉంటారన్నారు. ఒక నృత్య కళాకారిణి అయిన త్రిష వారి దుర్మార్గాలకు అడ్డుకట్ట వేసి ఎలా శిక్షించిందన్న పలు ఆసక్తికరమైన అంశాలతో కూడిన చిత్రం గర్జన అని తెలిపారు.
ఇందులో పోరాటం లాంటి చాలా రిస్కీ సన్నివేశాల్లోనూ త్రిష ఎలాంటి డూప్ లేకుండా నటించారని చెప్పారు. చిత్ర షూటింగ్ అధిక శాతం అడవుల్లో చిత్రీకరించినట్లు తెలిపారు. పొదలు, ముళ్లు లెక్క చేయకుండా నటించారని, దీంతో కాళ్లకు ముళ్లు గుచ్చుకుని రక్తసిక్తం కావడంతో ఒక రోజు విరామం తీసుకుని షూటింగ్ చేద్దామని చెప్పినా, ఆ తరువాత అయినా ఈ ముళ్ల బారిన పడక తప్పదని, అందువల్ల రక్తం కారుతున్న దృశ్యాలను చిత్రీకరించండి అప్పుడే రియల్‌గా ఉంటుందని చెప్పి బాధను లెక్క చేయకుండా త్రిష నటించారని దర్శకుడు వెల్లడించారు.