
‘‘బయటికి వెళ్తున్నప్పుడు మీరు ప్రయాణించ బోతున్న రవాణా వాహనాల రద్దీకి అనుగుణంగా మీరు మీ బట్టల్ని ఎంపిక చేసుకుని ధరిస్తారా?’’ అని త్రిషా షెట్టి అడిగినప్పుడు చాలామంది అమ్మాయిలు ‘అవును’ అనే సమాధానం చెప్పారు. అదే ప్రశ్నను ఆమె కొద్దిగా మార్చి, ‘‘మీరు ఆటోలో ప్రయాణిస్తున్నప్పుడు ఎవరైనా మీ కాళ్లను చూస్తారేమోనన్న బిడియంతో మీరు షార్ట్ వేసుకోకుండా ఉంటారా?’’ అని అబ్బాయిలను అడిగినప్పుడు వాళ్లంతా పెద్ద పెట్టున నవ్వారు! అప్పుడే అనిపించింది త్రిషకు.. సమాజంలో ‘లైంగిక సమానత్వం’ కోసం, లైంగిక వేధింపుల నివారణ కోసం ఏదైనా చేయాలి అని. ఆ ఆలోచన నుంచి ఆవిర్భవించిందే ‘షీ సేస్’ ఫౌండేషన్. స్వేచ్ఛ, భద్రత, ఇష్టమైన వస్త్రధారణ అనేవి ఆడపిల్లలకు హక్కులు అవ్వాలే గానీ, పోరాటం కాకూడదని త్రిష అంటారు.
త్రిష షెట్టి.. మహిళలకు సంబంధించిన ఏ సమస్యల మీదైనా చాలా చురుకుగా స్పందిస్తారు. ఆమె గళం కూడా అంతే గట్టిగా వినిపిస్తుంది! మొన్నటికి మొన్న జరిగిన ఉన్నావ్, కథువా అత్యాచార ఘాతుకాలనూ అంతే ధైర్యంగా ఎండగట్టింది. టీవీ చానళ్లలో అన్ని పార్టీల ప్రతినిధులను కడిగిపారేసింది. గత యేడాది యూఎన్ ఎంపిక చేసిన పదిహేడు మంది యంగ్ లీడర్స్‌లో త్రిష షెట్టి కూడా ఒకరు.
ముంబై అమ్మాయి
త్రిష షెట్టి ముంబైలో పుట్టి, పెరిగారు. చిన్నప్పటి నుంచీ చదువులో ఫస్ట్. లాయర్ కావాలనేది ఆమె లక్ష్యం. ముంబైలోని జైహింద్ కాలేజ్‌లో పొలిటికల్ సైన్స్, సైకాలజీ ఆప్షనల్స్‌గా బీఏ పూర్తి చేశారు. ఆ తర్వాత ఆమె అనుకున్నట్టుగా ‘లా’ కూడా చదివారు. లాయర్‌గా ప్రాక్టీసూ మొదలుపెట్టారు.
షీ సేస్
లాయర్‌గా మంచి పేరు, కీర్తి, డబ్బు వస్తున్న తరుణంలో త్రిషను నిర్భయ çఘటన మార్చేసింది! పేరు ప్రతిష్టల కోసం కాదు.. లైంగిక వేధింపులు, లైంగిక దాడులకు బలైన మహిళల కోసం నిలబడాలని నిర్ణయించుకున్నారు. లైంగిక దాడికి బలైన మహిళలను ఆ గాయం కన్నా కూడా వాళ్లను అర్థం చేసుకోలేని, మళ్లీ వాళ్లను మామూలు మనుషులుగా మార్చలేని సామాజిక పరిస్థితులే ఎక్కువగా బాధిస్తాయని తెలుసుకున్నారు. అందుకే అలాంటి వాళ్లకు నైతిక స్థయిర్యం, న్యాయపరమైన సహాయం అందించే ప్లాట్‌ఫామ్ ఒకటి ఏర్పాటు చేయాలని నిశ్చయించుకున్నారు. తన సోదరి నేహా షెట్టితో కలిసి ‘షీ సేస్’ అనే ఆన్‌లైన్ పోర్టల్‌ను ప్రారంభించారు.
మీడియా కన్నా వేగంగా
‘షీ సేస్’ ద్వారా మహిళల్లో చైతన్యం తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు త్రిష. మహిళలకున్న న్యాయపరమైన హక్కులు, వాటిని ఎలా సాధించుకోవచ్చో పోర్టల్‌లో వివరంగా ఉంటాయి. ‘షీ సేస్’ మొదలైన కొద్ది రోజుల్లోనే ఈ పనిలో తాము సైతం భాగస్వామ్యం అవుతామని వేలమంది వలంటీర్లు చేరారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అందులో 60 వేల మంది పనిచేస్తున్నారు. 2016, డిసెంబర్ 31, బెంగళూరు డార్క్‌నైట్ సంఘటన (ఆ రోజు రాత్రి ఓ అమ్మాయిని కొంతమంది అబ్బాయిలు నడి రోడ్డు మీద వేధించారు) గుర్తుంది కదా. త్రిషానే ఆ ఘటనను తన పోర్టల్ ద్వారా వెలుగులోకి తెచ్చారు.
లింగ వివక్ష మీద
‘షీ సేస్’ పోర్టల్ ద్వారా ఇంకా అన్ని రకాల లింగ వివక్షల మీద త్రిష పోరాడుతున్నారు. లింగ వివక్ష సమసిపోవాలంటే క్షేత్రస్థాయిలో మార్పు రావాలని ఆమె అంటారు. అందుకే ముందుగా కుటుంబాలను విద్యావంతులను చేయాలని అంటారు. స్థిరమైన మార్పే తన లక్ష్యం అని త్రిష చెబుతున్నారు.
స్ఫూర్తి ప్రదాతలు
అమెరికన్ మహిళా న్యాయమూర్తి రుత్ బేడర్ గిన్స్‌బర్గ్, ఫ్రెంచి మహిళా న్యాయవాది క్రిస్టీన్ లాగార్డ్ త్రిషకు స్ఫూర్తి. బరాక్ ఒబామా నాయకత్వ లక్షణాలు ఆమెకు ప్రేరణ. మానవ హక్కుల కోసం నిలబడ్డమే ఆమె జీవిత లక్ష్యం. ఒబామాను కలవడం, స్కై డైవింగ్ ఆమె కలలు.వినాలనుకునే మాట.. శానిటరీ నాప్కిన్స్ మీద ట్యాక్స్ ఎత్తేస్తున్నాం! సాకారం కావలసినవి.. షీ సేస్ లాంటి సంస్థల అవసరంలేకుండా పోవాలి. అంటే సమాజంలో అంతగా మార్పు రావాలి. లైంగిక సమానత సాధించాలి.
– శరాది
Comments
Please login to add a commentAdd a comment