డూప్ వద్దు బాస్!
అది చాలా రిస్కీ ఫైట్. త్రిషలాంటి సుకుమారితో అలాంటి ఫైట్ చేయించాలంటే ఏ దర్శకుడికైనా మనసు వస్తుందా? అందుకే ఆ ఫైట్‌ని డూప్‌తో కానిచ్చేద్దామని దర్శకుడు సుందర్ బాలు అనుకున్నారు. కానీ, త్రిష ఒప్పుకుంటారా? ‘డూప్ వద్దు బాస్. నేనే చేస్తా’ అంటూ రిస్కీ ఫైట్‌ని ధైర్యంగా చేసేశారు.
‘గర్జనై’ సినిమా కోసం త్రిష ఈ ఫైట్ చేశారు. హిందీ హిట్ మూవీ ‘ఎన్‌హెచ్ 10’కి ఇది తమిళ రీమేక్. ఇందులో మధు అనే వెస్ట్రన్ డ్యాన్సర్ పాత్రను త్రిష చేస్తున్నారు. కొడైకెనాల్‌లో జరిగే ఓ కార్యక్రమానికి మధు హాజరు కావాలనుకుంటుంది. మార్గమధ్యంలో ఎవరో ఆమెను బంధిస్తారు. అందులోంచి మధు ఎలా బయటపడుతుంది? అనేది కథ. సినిమా మొత్తం త్రిష పాత్ర చుట్టూ తిరుగుతుంది. ‘‘త్రిషది పవర్‌ఫుల్ రోల్. మధు పాత్రకు ఆమె పూర్తి న్యాయం చేస్తున్నారు. డూప్ లేకుండా ఆమె ఫైట్స్ చేస్తున్న తీరు చూస్తుంటే, త్రిష ఎందుకింత సక్సెస్ అయ్యారో అర్థమవుతోంది’’ అని దర్శకుడు అన్నారు.