సాక్షి, ముంబై : భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తత తీవ్రమై యుద్ధమేఘాలు అలుముకున్న సమయంలో బాలీవుడ్ ప్రముఖులు అక్షయ్ కుమార్, కరణ్ జోహార్‌లు సినిమా ప్రచారంలో నిమగ్నమవడంపై సోషల్ మీడియాలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అక్షయ్ కుమార్ త్వరలో విడుదల కానున్న తన మూవీ కేసరిలోని తొలి పాటను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేయగా, ఈ మూవీని నిర్మించిన కరణ్ జోహార్ సైతం ఈ పాటను ట్విటర్‌లో షేర్ చేశారు. ఈ పాటకు మిశ్రమ స్పందన లభించగా, భారత్-పాకిస్తాన్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో వీరు ఇరువురూ సినిమాను ప్రమోట్ చేయడం పట్ల పెద్ద ఎత్తున నెటిజన్లు ట్రోలింగ్ చేశారు.
సినిమా పాటను షేర్ చేసేందుకు ఇది సరైన సమయం కాదని కొందరు కామెంట్ చేయగా, వారు తమ మూవీ ప్రమోషన్స్‌ను ఒక్క రోజు కూడా వాయిదా వేయలేకపోతున్నారని మరికొందరు అక్షయ్, కరణ్‌లను ట్రోల్ చేశారు. దేశమంతా ఉద్వేగంతో ఉన్న సమయంలో ఈ ట్వీట్‌ను తాము స్వాగతించలేమని పలువురు నెటిజన్లు మండిపడ్డారు. అక్షయ్ సరసన పరిణీతి చోప్రా నటించిన కేసరి ఈనెల 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మరోవైపు ఈ ఏడాది అక్షయ్ కుమార్ మిషన్ మంగళ్, గుడ్‌న్యూస్, హౌస్‌ఫుల్ 4, సూర్యవంశి చిత్రాల్లో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment