ఒక్కరు కాదు... ఇద్దరు కాదు.. దాదాపు వంద మంది కళాకారులు... ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఏడు భాషలకు చెందిన కళాకారులు... ఒకే వేడుకలో పాల్గొంటే చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. సినీ ప్రేమికులకైతే అంతకన్నా ఆనందం మరోటి ఉండదు. ఆదివారం అలాంటి అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రముఖ పారిశ్రామికవేత్త, కళాబంధు టి.సుబ్బరామిరెడ్డి తారలందర్నీ ఒకే వేదిక పైకి తీసుకొచ్చారు. ఆయన ఆధ్వర్యంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, బెంగాలీ, పంజాబీ, హిందీ భాషలకు చెందిన తారలకు అవార్డుల ప్రదానం జరిగింది. కళాకారులకు నిజమైన ఆనందం దక్కేదెప్పుడు? తాము నటించిన చిత్రం ఘనవిజయం సాధించినప్పుడు.
మరి.. రెట్టింపు ఆనందం దక్కేదెప్పుడు? ఆ చిత్రాలు అవార్డులు కూడా పొందినప్పుడు. ఆ విధంగా అవార్డులు అందుకున్న తారల ఆనందంతో వేదిక కళకళలాడింది... మిలమిల మెరిసింది. దాదాపు ఐదు గంటల పాటు ఆట, పాటలతో పసందుగా సాగిన ఈ వేడుకలో అవార్డు విజేతల ప్రసంగం వీక్షకులను ఆకట్టుకుంది. అలాగే, పలువురు కథానాయికల నృత్య ప్రదర్శన ఆహూతులను ఆనందపరిచింది.
టి. సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ -‘‘భారతదేశం గర్వించేలా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ... ఇలా ఏడు భాషల కళాకారులను ఒకే వేదిక మీదకు తీసుకొచ్చాను. ఇన్ని భాషల కళాకారులను ఒకే వేడుకలో చూడాలన్న ఏడు కోట్ల తెలుగు ప్రజల కోరికను ఇలా తీర్చాను’’ అన్నారు.
జమున: 1978లో సుబ్బరామిరెడ్డి నాకు ‘సిల్వర్ జూబ్లీ స్టార్’ అవార్డు ఇచ్చారు. ఏకధాటిగా 25ఏళ్లు కథానాయికగా నటించిన సందర్భంగా ఆ అవార్డు ప్రదానం చేశారు. సుబ్బరామిరెడ్డికి సినిమా తారలంటే పిచ్చి అనుకునే దాన్ని కానీ.. ఆయనకు కళలంటే చాలా ఇష్టం.
శత్రుఘ్న సిన్హా: ఎన్టీఆర్, ఏయన్నార్ వంటి మహానుభావులు ఉన్న పరిశ్రమ ఇది (తెలుగు). భారతీయ సినిమా ఖ్యాతిని పెంచిన ‘బాహుబలి’ రూపొందించిన సినిమా పరిశ్రమకు చెందినవాణ్ణి కావడం ఆనందంగా ఉంది. రాజమౌళి ఉన్న పరిశ్రమలో ఉండటం ఆనందంగా ఉందని అమితాబ్ కూడా నాతో అన్నారు.
రిషి కపూర్: కళాకారులకు తమిళ్, హిందీ అనే వ్యత్యాసం లేదు. మేం మాట్లాడేది సినిమా భాష.
చిరంజీవి: కళలను ప్రోత్సహించే దిశగా సుబ్బరామిరెడ్డి కృషి చేస్తున్నారు. అందుకే కాదనుకుండా ఈ వేడుకకు వచ్చాను. మన తెలుగువాడు రాజమౌళి తీసిన ‘బాహుబలి’ హాలీవుడ్ చిత్రాలకు దీటుగా ఉంది.
మోహన్‌బాబు: సుబ్బరామిరెడ్డికి అన్ని భాషలవాళ్లను తీసుకొచ్చి, అవార్డులు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? కళలను పోషించాలనే తపనతో ఇస్తున్నారు.
బాలకృష్ణ: ప్రభు, రిషి కపూర్‌గారు, గుల్షన్ గ్రోవర్ ఇలా చాలా మంది ఇక్కడకు రావడం ఆనందంగా ఉంది. రమేష్ సిప్పి తెరకెక్కించిన ‘షోలే’ చిత్రాన్ని థియేటర్‌లో 32 సార్లు చూశాను.
వెంకటేశ్: కొత్త రకం ఫ్యామిలీఎంటర్‌టైనర్ అయిన ‘దృశ్యం’కి అందుకోవడం ఆనందంగా ఉంది.