1635 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించిన సీఎం రేవంత్‌ | CM Revanth Given Job Appointment Letters At Shilpakala Vedika | Sakshi
Sakshi News home page

ఈటల అంగి మారింది కానీ.. వాసన మారలేదు: సీఎం రేవంత్‌

Published Sun, Oct 6 2024 6:09 PM | Last Updated on Sun, Oct 6 2024 6:20 PM

CM Revanth Given Job Appointment Letters At Shilpakala Vedika

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ పాలనలో 90 రోజుల్లో 31వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. గత ప్రభుత్వం ఉద్యోగ నియామకాలను పట్టించుకోలేదన్నారు. 1635 మందికి ఇవాళ ఉద్యోగ నియామక పత్రాలు అందించడం సంతోషంగా ఉందంటూ కామెంట్స్‌ చేశారు.

శిల్పకళావేదికలో ‘కొలువుల పండుగ’ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. నిరుద్యోగ జంగ్ సైరన్ మోగించిన నాడు.. వాళ్ల ఉద్యోగాలు ఊడితేనే మీకు ఉద్యోగాలు వస్తాయని నేను చెప్పాను. మా మాటపై నమ్మకం ఉంచి కాంగ్రెస్‌ను గెలిపించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడగానే 90 రోజుల్లోనే మేం ప్రమాణ స్వీకారం చేసిన చోటే 30వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించాం. దసరా పండగ నేపథ్యంలో తెలంగాణలో ప్రతీ కుటుంబంలో ఆనందం చూడాలని ఇవాళ మరిన్ని నియామక పత్రాలు అందిస్తున్నాం. 1635 మందికి ఇవాళ ఉద్యోగ నియామక పత్రాలు అందించడం సంతోషంగా ఉంది.

మీ చప్పట్లలో మీ సంతోషం, మీ కుటుంబ సభ్యుల ఆనందం కనిపిస్తుంది. ఏళ్లుగా నిరీక్షించిన మీ కల ఇవాళ సాకారమవుతోంది. వందలాది మంది ఆత్మ బలిదానాలతో తెలంగాణ ఏర్పడింది. అలాంటి తెలంగాణ పునర్నిర్మాణంలో మీరు భాగస్వాములు కాబోతున్నారు. ఇది కేవలం ఉద్యోగం మాత్రమే కాదు.. ఇది భావోద్వేగం. ఉద్యోగ నిర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరించండి. లక్షలాది మంది హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య లాంటి ఇంజనీర్లను మీరు ఆదర్శంగా తీసుకోవాలి.

హైదరాబాద్‌లో వందల ఏళ్ల క్రితం నిర్మించిన అద్భుత కట్టడాలున్నాయి. వందేళ్ల అనుభవం ఒకవైపు.. పదేళ్ల దుర్మార్గం మరోవైపు. కాళేశ్వరం కట్టినవారిని ఆదర్శంగా తీసుకుంటారో.. నాగార్జున సాగర్ కట్టిన వారిని ఆదర్శంగా తీసుకుంటారో ఆలోచించుకోండి. ఉద్యోగంలో చేరిన నాటి నుంచి పదవీ విరమణ వరకు ఒకే విధంగా వ్యవహరించండి. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే బాధ్యత మీ అందరిపై ఉంది. తన కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచుకున్న కేసీఆర్.. 2015లో నోటిఫికేషన్లు ఇచ్చిన వాళ్ళకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు?. తెలంగాణ ఉద్యమం గొప్పతనాన్ని.. విద్యార్థి నిరుద్యోగుల త్యాగాలను కేసీఆర్ కవచంగా మార్చుకున్నారు. ఇవాళ ముసుగు తొలగిపోవడంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అక్టోబర్ 9న 11,063 ఉపాధ్యాయ నియామక పత్రాలు అందించబోతున్నాం. ఇది మా చిత్తశుద్ధి.. ఇది మా బాధ్యత.

మూసీ మురికిని ప్రక్షాళన చేయాలని మేం నిర్ణయం తీసుకున్నాం. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మీ చేతుల మీదుగా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ జరుగబోతుంది. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు మూసీ కంపులోనే బ్రతకాలా?. మూసీ పరివాహక  ప్రజలకు ఇండ్లు కట్టించి వారికి మంచి భవిష్యత్తును అందిద్దాం. ప్రతీ దానికి అడ్డుపడటం కాదు.. మూసీ బాధితులను ఎలా ఆదుకుందామో సలహాలు ఇవ్వండి. ఈటల అంగి మారింది కానీ.. వాసన మారలేదు. హరీష్, కేటీఆర్ మాట్లాడిందే ఈటల మాట్లాడుతున్నారు. ఆయన ఇప్పటికైనా పేదల వైపు నిలబడాలి. ఇలా వచ్చి అలా వెళ్లడం కాదు.. ధైర్యం ఉంటే కేసీఆర్, హరీష్, ఈటల మూసీ పరివాహక నివాసాల్లో వారం రోజులు ఉండండి. వాళ్ల కష్టాలు, బాధలు తెలుస్తాయి అంటూ కామెంట్స్‌ చేశారు.

ఇది కూడా చదవండి: గ్యారెంటీలపై నిలదీయండి: యువతకు హరీశ్‌రావు పిలుపు

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement