ప్రజల సంతోషమే నాకు శక్తి | TSR TV9 National Film Awards 2017-2018 at Visakhapatnam | Sakshi
Sakshi News home page

ప్రజల సంతోషమే నాకు శక్తి

Published Mon, Feb 18 2019 12:24 AM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

TSR TV9 National Film Awards 2017-2018 at Visakhapatnam - Sakshi

రకుల్‌ ప్రీత్‌సింగ్, రాశీఖన్నా, సుమంత్, అదితీరావ్, కేథరిన్, టి.సుబ్బరామి రెడ్డి, మోహన్‌బాబు, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ

‘‘ఎన్నో ఏళ్లుగా ఈ వేడుకను కన్నుల పండువగా చేస్తున్నారు సుబ్బరామిరెడ్డిగారు. మీరొక్కరే ఇలాంటి వేడుకలను ఇంత బాగా చేయగల శక్తి ఎక్కడినుంచి వస్తుందని ఆయన్ని అడిగాను. ‘కళాకారులంటే నాకు అమితమైన ఇష్టం. వారిని ప్రోత్సహించాలి. తద్వారా.. వారు పొందే ఆనందం నుంచి నేను శక్తి పుంజుకుంటాను’ అని సుబ్బరామిరెడ్డిగారు చెప్పడం ఆయన కళాత్మక హృదయానికి నిదర్శనం’’ అని హీరో చిరంజీవి అన్నారు. 2017, 2018 సంవత్సరాల ‘టీఎస్‌ఆర్‌ టీవీ9 నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌’ ఫంక్షన్‌ని విశాఖపట్నంలోని పోర్ట్‌ స్టేడియంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు.

2017 మోస్ట్‌ పాపులర్‌ ఫిల్మ్‌ (ఖైదీ నెంబర్‌ 150) నిర్మాతగా, 2018 బెస్ట్‌ హీరో (రంగస్థలం) అవార్డులకు రామ్‌చరణ్‌ ఎంపికయ్యారు. ఈ అవార్డులను స్వీకరించిన చిరంజీవి మాట్లాడుతూ– ‘‘సుబ్బరామిరెడ్డిగారు పిలవగానే నేను, బాలకృష్ణగారు, నాగార్జునగార్లతో పాటుగా మిగతా హీరోహీరోయిన్లు వచ్చారంటే ఏదో మొక్కుబడిగా రాలేదు. మనసుతో వచ్చాం.. ఇష్టంతో వచ్చాం. ఓ వేడుకకు మేం అందరం కలిసి రావడం జరగదు. ఆ ప్రయత్నం ఎవరూ చేయరు. అది ఒక సుబ్బరామిరెడ్డిగారివల్లే అవుతుంది.

మా మ«ధ్య ఒక అన్నదమ్ముల అనుబంధం ఉన్నట్లుగా, మంచి స్నేహితులం అన్నట్లుగా  మీకు (ప్రేక్షకులు) తెలియజేసేందుకు ఇదొక చక్కని సందేశం కూడా. మా అభిమానులందరూ ఎటువంటి భేదాలు లేకుండా కలిసి కట్టుగా ఉండేట్లు ఇది దోహదం చేస్తుంది. ఈ రోజు   బాలకృష్ణగారికి, నాగార్జునగారికి,  మోహన్‌బాబుగారికి అవార్డు వచ్చింది. నాకే ఏ అవార్డు రాలేదు (నవ్వుతూ). రామ్‌చరణ్‌ అవార్డులు అందుకొని, ఆ పుత్రోత్సాహాన్ని అనుభవిస్తున్నా’’ అన్నారు.

మోహన్‌బాబు మాట్లాడుతూ– ‘‘సుబ్బరామిరెడ్డిగారు ఏడాదికి మూడు కార్యక్రమాలు చేస్తారు. ఒకటి శివరాత్రి.. రెండు ఇలాంటి అవార్డుల వేడుక.. మూడు ఆయన పుట్టినరోజు.. ఆయన చేస్తున్న కార్యక్రమాలు ఎన్నని చెప్పగలం. ఎప్పుడెప్పుడు ఆయన వైజాగ్‌కి రమ్మని పిలుస్తారా? వెళ్లి ఆయన చేసిన మంచి పనులు ప్రజలకు చెప్పాలా? అని ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను. గత ఏడాది మా అమ్మగారు చనిపోవడంతో ఇక్కడికి రాలేకపోయాను. వైజాగ్‌ వచ్చి దాదాపు ఏడాది అయింది.

ఒక ఆత్మీయుడు ఇన్ని మంచి పనులు చేస్తున్నాడంటే అందరూ గర్వించాల్సిన విషయం. ఎన్నికల ముందే ఏదైనా చేస్తుంటారు. కానీ, 18 ఏళ్ల నుంచి నాకు ఓట్లు అక్కర్లేదు.. మీ ఆశీస్సులు కావాలి.. మీ హృదయంలో నాకు చోటు కావాలి అన్న ఏకైక వ్యక్తి, మన ఆత్మబంధువు సుబ్బరామిరెడ్డిగారు. ఇంతమంది సినిమా వాళ్లను ఒక వేదికపైకి తీసుకురావడం మామూలు విషయం కాదు. కొంతమంది చేయరు.. ఇతరులు చేస్తే సంతోషించరు. సుబ్బరామిరెడ్డిగారు పాలులాంటి వారు.

పాలల్లో నుంచి పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి వస్తుంది. ఎవరికి ఏది కావాలంటే అది కోరుకునే పాలలాంటి వ్యక్తి ఆయన. నాకు తండ్రి తర్వాత తండ్రిలాంటి వారు నా గురువు దాసరి నారాయణరావుగారు. ఆయన లేని లోటు ఈ పాతికేళ్ల నుంచి ఉన్న ఈ జనరేషన్‌కి తెలియదు. హీ ఈజ్‌ ఓన్లీ ఒన్‌. 1 నుంచి 100 వరకూ ఓన్లీ ఒన్‌ మేన్‌ ఇన్‌ తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీ మా గురువుగారు. ఆయన ఉండరని, ఆయన పేరుతో ఉన్న ‘దాసరి నారాయణరావు మెమోరియల్‌ అవార్డు’ నేను తీసుకుంటానని కలలో కూడా ఊహించలేదు’’ అన్నారు.

హీరో బాలకృష్ణ మాట్లాడుతూ– ‘‘ఇలా అందర్నీ ఒకే వేదికపై తీసుకొచ్చిన ఘనత ఒక్క సుబ్బరామిరెడ్డిగారికే దక్కుతుంది. ఆయన అజాత శత్రువు. మంచి చిత్రాలు తీయాలని మమ్మల్ని వెన్నుతట్టి ప్రోత్సహించేది ఇలాంటి ఉత్సవాలే. ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ చిత్రానికి నన్ను ఉత్తమ కథానాయకుడిగా ఎంపిక చేసిన ప్రేక్షకులకు, జ్యూరీ సభ్యులకు నా కృతజ్ఞతలు. నాన్నగారు (ఎన్టీఆర్‌) చేయనటువంటి పాత్ర అది. ఈ పాత్ర చేయడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. కళల వెలుగులను ప్రపంచ నలుమూలలా ప్రసరింప చేసి దేశ ఔన్నత్యాన్ని చాటి చెబుతున్న ఎందరో మహానుభావులు పుట్టిన మన దేశం.. నిజంగా కళాఖండదేశం అని గర్వపడాలి. కళలకు చావులేదు’’ అన్నారు.

హీరో నాగార్జున మాట్లాడుతూ– ‘‘నా అన్నయ్యలందరూ ఇక్కడే ఉన్నారు. ప్రత్యేకించి నా పెద్దన్నయ్య మోహన్‌బాబుగారు (నవ్వుతూ). నాకు ఇష్టమైన ‘రంగస్థలం, మహానటి, గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాలకు అవార్డులు రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. ప్రతిసారీ మమ్మల్ని ఇలా పిలుస్తున్నందుకు, మా అన్నయ్యలందరితో కల్పిస్తున్నందుకు సుబ్బరామిరెడ్డిగారికి థ్యాంక్స్‌.. నాదీ, ఆయన వయసు ఒక్కటే.. కేవలం 30ఏళ్లు (నవ్వుతూ).. ఓంకారంతో ఆయన మొదలు పెట్టే శక్తిని మేము పుచ్చుకుంటాం’’ అన్నారు.

కళాబంధు, ‘టీఎస్‌ఆర్‌ టీవీ9 నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌’ చైర్మన్‌ టి.సుబ్బరామి రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఇంతమంది స్టార్స్‌ని తీసుకురావడం మామూలు విషయం కాదు. ఇందుకు ఎంతో కృషి చేశాను. ఎందుకు అంత కష్టపడ్డానంటే మీ సంతోషం కోసం (ప్రజలు).. మీ సంతోషమే నాకు శక్తి. నాకు పొగడ్త కానీ, ఓటు కానీ ఏదీ అవసరం లేదు. 20ఏళ్ల నుంచి ఆధ్యాత్మికంగా, సామాజికంగా, కళాత్మకంగా ఎన్నో కార్యక్రమాలు చేశాను. మిమ్మల్ని ఏ సహకారం అడగకుండా నిస్వార్థంగా ఈ కార్యక్రమం చేస్తున్నా. మీరు సంతోషంగా ఉండటమే నాకు ఇచ్చే సహాయం, శక్తి. ప్రజలే ఈ అవార్డు విజేతలను ఎన్నుకున్నారు.  భారతదేశ చరిత్రలో సినిమా ఫంక్షన్స్‌ అంటే పబ్లిక్‌గా చేయరు. 1000 నుంచి 1500 మందితో ఆడిటోరియంలో చేస్తారు.

కానీ నేను చాలెంజ్‌గా తీసుకుని అందరి సహకారంతో రేయింబవళ్లు కష్టపడి ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తున్నా. మీ కేరింతలు, ఆనందం నాకు టానిక్‌ లాంటిది. రఘురామకృష్ణరాజు, ఉమేశ్‌ ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా కోఆర్డినేట్‌ చేశారు’’ అన్నారు. ‘సిరివెన్నెల’ సీతరామశాస్త్రి మాట్లాడుతూ– ‘‘సుబ్బరామిరెడ్డిగారి జాతీయ అవార్డుల వేడుక ఎంత అద్భుతంగా జరుగుతుందో మా తారాలోకంలో చెప్పుకుంటున్నప్పుడు విన్నాను.. ఈ రోజు ప్రత్యక్షంగా చూస్తున్నాను. దేశంలోని భిన్న ప్రాంతాలు, భిన్న భాషల కళాకారులు ఇక్కడ ఉన్నారు. ఈ వేడుకలో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు సుబ్బరామిరెడ్డిగారికి ప్రత్యేక ధన్యవాదాలు’’ అన్నారు.

నటుడు రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ– ‘‘దాదాపు తెలుగు సినిమా రాజులందరూ ఒకే వేదికపై ఇక్కడే ఉన్నారు. నాలాంటి కళాకారులు ఇంకా అవార్డులు తీసుకోవడానికి కారణం మాత్రం ఈ జనరేషన్‌ రచయితలు, డైరెక్టర్స్‌ రాయడం వల్ల. ‘మహానటి’ నాకు చాలా ఇష్టమైన సినిమా అని ఇందాక నాగ్‌ (నాగార్జున) చెప్పారు. సో.. నటులకే నచ్చే నటుల సినిమాల్ని రచించి, తీసినటువంటి ఆ దర్శకులకే ఈ  క్రెడిట్‌ చెందుతుంది. నేను, నా మనవరాలు ఒకే వేదికపై ఒకేసారి అవార్డు అందుకోవడం.. మరీ ముఖ్యంగా నా తోటి తాతలందరితో కలిసి (నవ్వుతూ) మనవరాలు అవార్డు తీసుకుంటున్న సందర్భంకంటే ఇంతకంటే ఆనందం ఇంకేం కావాలి.

ఇంత అద్భుతమైన ఫంక్షన్‌ చేస్తేనే కళలకి, కళాకారులకి గౌరవం ఉంటుంది’’ అన్నారు. ఈ వేదికపై పలువురు కళాకారులకు అవార్డులు ప్రదానం చేశారు.  ఈ అవార్డు వేడుకలో మంత్రి గంటా శ్రీనివాసరావు, నిర్మాతలు అంబికా కృష్ణ, బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్, చెరుకూరి మోహన్, నిర్మాత బోనీకపూర్, హీరోలు విశాల్,  సుమంత్, ఆది పినిశెట్టి, కల్యాణ్‌ దేవ్, నటులు అలీ, నరేశ్, హీరోయిన్లు విద్యాబాలన్, ఖుష్బూ, రకుల్‌ ప్రీత్‌సింగ్, పూజా హెగ్డే, కీర్తీ సురేశ్, కేథరిన్‌ థెరిస్సా, అదితీరావ్‌ హైదరీ, షాలినీ పాండే, ప్రగ్యా జైస్వాల్, రాశీఖన్నా, రితికా సింగ్, ప్రియాంకా జవాల్కర్, దర్శకులు వెంకీ అట్లూరి, పరశురామ్, అవార్డు కమిటీ జ్యూరీ మెంబర్లు పరుచూరి గోపాలకృష్ణ, రఘురామకృష్ణ రాజు, పింకీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement