షూటింగ్ చేయడం.. కొత్త సినిమా కోసం కథలు వినడం... ప్రస్తుతం సీనియర్ స్టార్స్ ఇలా కథలు వినే పని మీద ఉన్నారు. ఫలానా దర్శకుడు చెప్పిన కథను ఫలానా హీరో విన్నారట అనే టాక్ రావడంతో విన్నారా? నిజమేనా? అనే చర్చ మొదలైంది. ఇక వార్తల్లో ఉన్న ప్రకారం ఏయే హీరో ఏయే దర్శకుడు చెప్పిన కథ విన్నారో చూద్దాం.
చిరంజీవి ఖాతాలో ప్రస్తుతం ఉన్న రెండు చిత్రాలు ‘వాల్తేరు వీరయ్య’, ‘బోళా శంకర్’. వీటిలో ‘వాల్తేరు వీరయ్య’ ఈ 13న విడుదల కానుండగా, ‘బోళా శంకర్’ ఏప్రిల్ 14న రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ రెండు చిత్రాల తర్వాత యువ దర్శకుడు వెంకీ కుడుములతో చిరంజీవి హీరోగా నటించే సినిమా తెర కెక్కాల్సింది. కానీ ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం హోల్డ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిరంజీవి తర్వాతి సినిమా ఏ దర్శకుడితో అనే చర్చ మొదలైంది.
అయితే గత ఏడాది వేసవిలో చిరంజీవి హీరోగా తాను నిర్మాతగా ఓ సినిమా చేయనున్నట్లు నటి రాధిక ట్వీట్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. చిరంజీవి నెక్ట్స్ చేయబోయేది ఈ సినిమాయే అని, ఇటీవలే కథా చర్చలు కూడా ఊపందుకున్నాయన్నది ఫిల్మ్‌నగర్ లేటెస్ట్ టాక్. ఆల్రెడీ కొంతమంది దర్శకులు చెప్పిన కథలు విన్నారట చిరంజీవి. ఇటు రాధిక కూడా కొంతమంది రచయితలను సంప్రదించగా, వారు చిరంజీవికి స్టోరీ లైన్ చెప్పారట.
మరోవైపు దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా చిరంజీవి కోసం ఓ కథను రెడీ చేస్తున్నారని తెలిసింది. అలాగే ప్రభుదేవా కూడా ఓ కథ సిద్ధం చేశారట. మరి.. చిరంజీవి ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు? అనే విషయంపై స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. ఇటు ‘వీరసింహారెడ్డి’ సినిమాను ఈ సంక్రాంతి బరిలో ఉంచిన బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.
కాగా బాలకృష్ణకు ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ వంటి సూపర్ హిట్స్ అందించిన బోయపాటి శ్రీను ఇటీవల ఆయనకు ఓ కథ వినిపించారట. అలాగే దర్శకుడు పరశురామ్ కూడా బాలకృష్ణకు కథ చెప్పారట. మరోవైపు ‘ఆదిత్య 369’కు సీక్వెల్‌గా ‘ఆదిత్య మ్యాక్స్ 999’ సినిమా చేయాలని బాలకృష్ణ భావిస్తున్నారు. మరి.. బాలకృష్ణ 109వ దర్శకుడు ఎవరు? అనే విషయంపై క్లారిటీ రావాలంటే కొంత సమయం పడుతుంది.
ఇక మరో ఇద్దరు సీనియర్ హీరోలు వెంకటేశ్, నాగార్జున కూడా ప్రస్తుతం కొన్ని కథలు వింటున్నారు. నాగార్జునకు గతంలో కథలు వినిపించిన వారిలో తమిళ దర్శకుడు మోహన్‌రాజా, రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే ప్రస్తుతానికి ప్రసన్న కుమార్ కథ పట్ల నాగార్జున మొగ్గు చూపారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన సంక్రాంతి సమయంలో రానున్నట్లు తెలిసింది.
కాగా, గత ఏడాది రిలీజైన ‘ఎఫ్ 3’ తర్వాత మరో కొత్త సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లలేదు వెంకటేశ్. ‘జాతిరత్నాలు’ ఫేమ్ దర్శకుడు కేవీ అనుదీప్, దర్శక–రచయిత తరుణ్ భాస్కర్ కథలు వినిపించినప్పటికీ... ఇంకా ఏ ప్రాజెక్ట్‌కీ పచ్చజెండా ఊపలేదు వెంకీ. కాగా వెంకటేశ్‌కి కథ వినిపించిన దర్శకుల జాబితాలో తాజాగా ‘హిట్’ ఫ్రాంచైజీ ఫేమ్ శైలేష్ కొలను పేరు కూడా చేరిందని, శైలేష్ చెప్పిన కథకు వెంకీ ఇంప్రెస్ అయ్యారని టాక్. వెంకటేశ్ నెక్ట్స్ మూవీ శైలేష్ దర్శకత్వంలోనే అనే ప్రచారం ఊపందుకుంది. ఇక ఈ నలుగురి హీరోల నెక్ట్స్ డైరెక్టర్ ఎవరో అధికారిక ప్రకటన వస్తేనే తెలుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment