
భార్య ప్రొఫైల్ ఫోటోపై ప్రదీప్ మనస్తాపం!
హైదరాబాద్ : బుల్లితెర నటుడు ప్రదీప్ ఆత్మహత్య కేసులో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రదీప్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని అతని స్నేహితులు చెబుతున్నారు. భార్య పావనీరెడ్డి వాట్సప్ ప్రొఫైల్ ఫోటోపై భార్యభర్తల మధ్య బుధవారం తెల్లవారుజామున గొడవ జరిగిందని, తెల్లారేసరికి ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. అలాగే ఇంట్లో అద్దాలు చిందరవందరగా పగిలి ఉండటంతో పాటు, భర్త ఆత్మహత్యపై అతడి కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది.
మరోవైపు ప్రదీప్ భార్య పావనీరెడ్డి ...పోలీసులు ప్రశ్నలకు సమాధానాలు దాటవేశారు. ప్రాథమిక ఆధారాల ప్రకారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు పావనీరెడ్డి వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రదీప్ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా గత రెండు నెలలుగా శ్రావణ్ అనే వ్యక్తి వాళ్లింట్లో ఉంటున్నాడని, అతడితో చనువుగా ఉన్న ఫోటోను పావనీ ప్రొఫైల్‌గా పెట్టడంతో ప్రదీప్ మనస్తాపం చెందినట్లు సమాచారం.
ఈ విషయంపై భార్యను ప్రదీప్ నిలదీయగా, అనంతరం ఇద్దరి మధ్య గొడవ జరిగిందని, అంతేకాకుండా భార్యభర్తల మధ్య కొంతకాలంగా తీవ్ర విభేదాలు నెలకొన్నాయని తెలుస్తోంది. అయితే పావనీరెడ్డి తీరుపై ప్రదీప్ కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడలోని తన నివాసంలో ప్రదీప్ ఈరోజు తెల్లవారుజామున ఉరేసుకుని అతను బలవన్మరణానికి పాల్పడ్డాడు.