
నా పరిస్థితిని అర్థం చేసుకోండి: ప్రదీప్ భార్య
హైదరాబాద్ : తన భర్త ప్రదీప్ కుమార్ ఆత్మహత్యపై వస్తున్న ఆరోపణలను అతని భార్య పావనీరెడ్డి ఖండించింది. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, ప్రదీప్ అంటే తనకు చాలా ఇష్టమని తెలిపింది. క్షణికావేశంలోనే ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నాడే తప్ప, మరొకటి కాదని పేర్కొంది. గత రాత్రి తనకు, ప్రదీప్‌కు మధ్య జరిగింది చిన్న గొడవే అని, అయితే ఆత్మహత్య చేసుకునేంత గొడవలు తమ మధ్య లేవని పావనీరెడ్డి స్పష్టం చేసింది. శ్రావణ్ తన అన్నయ్య అని, గతరాత్రి అతడి పుట్టినరోజు వేడుకలు చేసుకున్నామని అంతకుమించి ఏమీలేదని తెలిపింది.
తనపై వస్తున్న వదంతులు ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ...తన పరిస్థితిని అర్ధం చేసుకోవాలని పావనీరెడ్డి విజ్ఞప్తి చేసింది. నిన్న రాత్రి తన అన్నయ్య బర్త్‌డే పార్టీ చేసుకున్నామని, ఆ తర్వాత తన సోదరి కుటుంబం వెళ్లిపోయిందని, అనంతరం ప్రదీప్‌కు తనకు చిన్నపాటి గొడవ జరిగిందని, దాంతో ప్రదీప్ కోపంగా అద్దం పగులగొట్టాడని, ఆ తర్వాత తన బెడ్‌రూమ్‌లోకి వెళ్లి తలుపు వేసుకున్నాడని తెలిపింది. తాను హాల్‌లో డైనింగ్ టేబుల్ వద్ద ఏడ్చుకుంటూ పడుకున్నట్లు చెప్పింది.
అయితే ప్రదీప్‌కు ఉదయం షూటింగ్ ఉండటంతో అయిదుగంటల సమయంలో బెడ్‌రూమ్ తలుపు కొట్టానని, అయితే అటునుంచి ఎలాంటి అలికిడి లేకపోవడంతో తర్వాత తన సోదరుడి సాయంతో తలుపు పగలగొట్టి చూడగా, ప్రదీప్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించాడని తెలిపింది. కిందకు దించి, అంబులెన్స్‌కు కాల్ చేసినట్లు పావనీరెడ్డి చెప్పింది. ఆతర్వాత తన అమ్మవాళ్లకు ఫోన్ చేసి విషయం చెప్పానని, అలాగే చెన్నైలో ఉన్న ప్రదీప్ కుటుంబానికి ఫోన్ చేయగా వాళ్లు ఆన్సర్ చేయలేదని, దాంతో అతడి సోదరుడికి ఫోన్‌లో సమాచారం ఇచ్చినట్లు వెల్లడించింది.
ప్రదీప్ కుటుంబసభ్యులతో తనకు ఎలాంటి ఇబ్బందులు లేవని, కొద్ది నెలలు పాటు అత్తగారు తమతోనే ఉన్నారన్నారు. వాళ్ల కుటుంబసభ్యులు వస్తే అంత్యక్రియలు ఎక్కడ అనేది తెలుస్తుందన్నారు. ప్రదీప్ ఆత్మహత్యపై ఎలాంటి అనుమానాలు లేవని తెలిపింది. అయితే ప్రదీప్ హైపర్ అని, చిన్న చిన్న విషయాలకే ఆవేశం చెందుతాడని పేర్కొంది.