కోతుల్లాగ ప్రవర్తిస్తే ఇలాగే అవుతుంది: నటి
ముంబై: డేరా సచ్ఛా సౌదా చీఫ్, బాబా గుర్మీత్ రాంరహీం సింగ్ దోషీగా తేలడంపై బాలీవుడ్ నటి, రచయిత ట్వింకిల్ ఖన్నా భిన్న శైలిని అనుకరిస్తున్నారు. అసలు మనం కోతుల్లాగా మెదడు వాడితే ఇలాగే ఉంటుందని, బాబాలు ఇలాగే మోసాలకు పాల్పడతారని నటి అభిప్రాయపడ్డారు. ఎంతో తెలివైన వాళ్లు సైతం తమను రక్షిస్తాడంటూ నమ్మి గుర్మిత్ వద్దకు వెళ్లి ఉంటారని, ఇలాంటి పనులు తనను కొన్నిసార్లు ఆందోళనకు గురిచేస్తుంటాయని ఆమె చెప్పారు.
పంచకుల సీబీఐ కోర్టు గుర్మీత్ ను ఇటీవల దోషీగా ప్రకటించిన అనంతరం డేరాలు చెలరేగి చేసిన దాడులలో 36 మంది ప్రాణాలు కోల్పోవడం తనను కలచి వేసిందన్నారు ట్వింకిల్. జనాలు నమ్ముతున్న కొద్దీ ఇలాంటి బాబాలు మంచి కంటే చెడును వ్యాప్తి చేస్తారన్నారు. ఇంకా చెప్పాలంటే.. సూర్యుడి వైపు పొద్దుతిరుగుడు పువ్వు ఎలాగైతే మళ్లి ఉంటుందో, అదే తీరుగా జనాలు దొంగ ప్రజల చుట్టూ తిరుగుతుంటారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇకనైనా మనలో మార్పు వస్తే చెడు పనులు చేసే వారిని, దొంగ స్వామీజీలను కొంతకాలానికే గుర్తుపట్టే అవకాశం ఉందని పిలుపునిచ్చారు.