ట్వింకిల్ ఖన్నా (ఫైల్ ఫోటో)
‘నా సినిమాలన్నింటిని బ్యాన్ చేయండి.. అప్పుడు ఎవరూ వాటిని చూడలేరు.. దాంతో వాటిని రీమేడ్ చేయాలనే ఆలోచన కూడా ఎవరికి రాదు’ అంటూ చమత్కరించారు నటి, నిర్మాత, రచయిత ట్వింకిల్ ఖన్నా. తన పుస్తకం ‘పైజమాస్ ఆర్ ఫర్‌గివింగ్’ పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా ట్వింకిల్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా విలేకరులు ‘మీరు నటించిన ఏ చిత్రాన్ని రీమేడ్ చేస్తే బాగుంటుందని భావిస్తున్నారు’ అని అడగ్గా ట్వింకిల్ కాస్తా భిన్నంగా స్పందించారు. ‘నేను ఒక్క హిట్ కూడా ఇవ్వలేదు. అందువల్ల నేను నటించిన సినిమాలన్నింటిని బ్యాన్ చేస్తే మంచిది. అప్పుడు ఎవరూ వాటిని చూడలేరు.. రీమేడ్ చేయాలనే ఆలోచన కూడా రాదం’టూ ట్వికిల్ జోక్ చేశారు.
‘బర్సాత్’ చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ట్వింకిల్ ఖన్నా.. ఆపై వరుసగా ‘ఇతిహాస్’, ‘జుల్మి’, ‘మేలా’ వంటి చిత్రాల్లో నటించారు. తెలుగులో వెంకటేష్ సరసన ‘శీను’ చిత్రంలో నటించారు. ఆపై వరుస వైఫల్యాలు రావడంతో సినిమాలకు స్వస్తి చెప్పి 2001లో బాలీవుడ్ ఖిలాడి అక్షయ్ కుమార్‌ని వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ట్వింకిల్ ఖన్నా రచయిత్రిగా బిజీ అయ్యారు. గతంలో ట్వింకిల్ షార్ట్ స్టోరీస్ సమాహారంగా రచించిన ‘ద లెజెండ్ ఆఫ్ లక్ష్మీ ప్రసాద్’ పుస్తకంలోని ఓ కథ ఆధారంగా అక్షయ్ కుమార్ ‘ప్యాడ్ మాన్’ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ట్వింకిల్ నిర్మాతగా వ్యవహరించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment