వారం రోజుల వ్యవధిలో రెండు భారీ త్రీడీ చిత్రాలు
వారం రోజుల వ్యవధిలో రెండు భారీ త్రీడీ చిత్రాలు
Published Sun, Dec 22 2013 12:44 AM | Last Updated on Sat, Sep 2 2017 1:50 AM
ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియుల్ని ఆకట్టుకుంటోన్న టెక్నాలజీ... త్రీడి. ‘అవతార్’
తర్వాత త్రీడీ సినిమాల పట్ల అమితాసక్తి మొదలైంది. అందుకే అన్ని భాషల్లోనూ
త్రీడీ సినిమాలు విరివిగా తయారవుతున్నాయి. ఆనందించదగ్గ పరిణామం
ఏంటంటే - ఓల్డ్ క్లాసిక్స్‌గా పేర్గాంచిన చిత్రాలక్కూడా త్రీడీ హంగులు అద్ది,
ఈ తరానికి కూడా పరిచయం చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్‌లో రెండు త్రీడీ
చిత్రాలు భారీ ఎత్తున విడుదలకు సిద్ధమయ్యాయి. ఒకటేమో యానిమేషన్ చిత్రం
‘మహాభారతం’ కాగా, మరొకటి ఇండియన్ ఎవర్‌గ్రీన్ ఫిల్మ్ ‘షోలే’. ఈ రెండూ
వారం వ్యవధిలో విడుదల కానుండటం విశేషం.
మహామహులతో ‘మహాభారతం’
‘తింటే గారెలే తినాలి.. వింటే భారతమే వినాలి’ అనేది పాత నానుడి. ఇక ముందు... చూస్తే మహాభారతాన్ని త్రీడీలోనే చూడాలని ప్రేక్షకులు అంటారేమో. మహాభారతాన్ని ఎన్నిసార్లు విన్నా.. చూసినా తనవి తీరదనేని కాదనలేది వాస్తవం. గతంలో టెలివిజన్ సీరియల్‌గా వచ్చిన మహాభారతానికి ప్రపంచవ్యాప్తంగా భారతీయ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. మన చరిత్రలో, సంస్కృతిలో మహాభారతానికి ఉన్న ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని.. అధునిక హంగుల్ని జోడించి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించేందుకు త్రీడీ టెక్నాలజీతో మహాభారతాన్ని యానిమేషన్ చిత్రంగా రూపొందించారు త్రీడీటెక్నాలజీ, యానిమేషన్‌తోపాటు బాలీవుడ్ అగ్రతారలను కూడా రంగంలోకి దించారు.
భీష్మ పితామహుడి పాత్రకు సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్, శ్రీకృష్ణుని పాత్రకు శతృఘ్న సిన్హా, భీమునికి సన్నీ డియోల్, అర్జునునికి అజయ్ దేవగన్, కర్ణునికి అనిల్ కపూర్, ఆదిశక్తి దుర్గకు మాధురీ దీక్షిత్, ద్రౌపదికి విద్యాబాలన్, శకునికి అనుపమ్ ఖేర్, ధర్మరాజుకి మనోజ్ బాజ్‌పేయ్, కుంతికి దీప్తి నావల్, ధుర్యోధనునికి జాకీ ష్రాఫ్‌లు డబ్బింగ్ చెప్పారు. తన 44 ఏళ్ల కెరీర్‌లో అమితాబ్ ఓ యానిమేషన్ చిత్రానికి డబ్బింగ్ చెప్పడం ఇదే తొలిసారి. అనిల్ కపూర్ 15 రోజులు, మనోజ్ బాజ్‌పేయ్ నాలుగు రోజులు డబ్బింగ్ చెప్పడం విశేషం. ఈ నెల 27న ‘మహాభారత్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘షోలే’ మాయాజాలం:
1975లో ‘షోలే’ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. మీడియా ప్రభావం అంతగా లేని ఆ రోజుల్లోనే ‘షోలే’ పేరు చిన్న చిన్న పల్లెటూళ్లలో కూడా మార్మోగిపోయింది. ముఖ్యంగా ‘గబ్బర్‌సింగ్’ ఊతపదం ‘అరె ఓ సాంబా’ అందరి నాలుకలపై బాగా నానింది. జీపీ సిప్పి నిర్మాణ సారథ్యంలో రమేశ్ సిప్పీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో వీరుగా ధర్మేంద్ర, జై పాత్రలో అమితాబ్ బచ్చన్‌లు నటించారు. పోలీస్ ఆఫీసర్‌గా సంజీవ్ కపూర్ నటించారు. హేమమాలిని, జయబాధురి తమ నటనతో ఆలరించారు. 2002లో బ్రిటిష్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ నిర్వహించిన సర్వేలో షోలే టాప్ టెన్ భారతీయ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
భారతీయ సినిమా చరిత్రలో ‘షోలే’ ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, ఈకాలపు ప్రేక్షకులను మరోసారి త్రీడీలో ‘గబ్బర్‌సింగ్’ ద్వారా భయపెట్టేందుకు దర్శకుడు కేతన్ మెహతా తన సంస్థ మాయా డిజిటల్ ద్వారా ఓ ప్రయోగం చేస్తున్నారు. సుమారు 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 350 మంది సాంకేతిక నిపుణులతో ‘షోలే’ చిత్రాన్ని త్రీడీ ఫార్మాట్‌లోకి మార్చారు. సరికొత్త టెక్నాలజీతో, గత కాలపు మధురస్మృతులను మరోసారి నెమరు వేసుకోవడానికి ‘షోలే’ చిత్రం జనవరి 3న విడుదల కానుంది.
Advertisement
Advertisement