రెండు నెలల బాక్సాఫీస్ మేళా | two months big movie releases in tollywood and bollywood | Sakshi
Sakshi News home page

రెండు నెలల బాక్సాఫీస్ మేళా

Published Mon, Nov 24 2014 11:04 PM | Last Updated on Sat, Sep 2 2017 5:03 PM

రెండు నెలల బాక్సాఫీస్ మేళా

రెండు నెలల బాక్సాఫీస్ మేళా

*ఒక పక్క అటెన్షన్..! మరోపక్క టెన్షన్!!

అయితే అతివృష్టి - లేకుంటే అనావృష్టి. ఈ ఏడాది తెలుగు సినిమా రిలీజుల ప్రస్థానాన్ని పరికిస్తే అదే అనిపిస్తుంది. ముఖ్యంగా ఆగస్టు మొదలుకుని, ప్రతి వారం కనీసం రెండు సినిమాలు విడుదల అవుతున్నాయి. ఇలా ఒక సినిమా మీద మరో సినిమా వచ్చిపడటం వల్ల ఎవరు లాభపడుతున్నారో, ఎవరు నష్టపోతున్నారో అర్థం కాని పరిస్థితి. అంతెందుకు... రేపు శుక్రవారం (28వ తేదీ)న 9 తెలుగు సినిమాలు, 2 హిందీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి.
 
 డిసెంబరు 5న కూడా ఏడెనిమిది చిత్రాలు విడుదలకు సమాయత్తమయ్యాయి. డిసెంబరు, జనవరి నెలలు... తెలుగు సినిమా పరిశ్రమకు చాలా కీలకం. ఎందుకంటే అతిరథ మహారథుల సినిమాలు బరిలోకి దిగుతున్నాయి. దేన్నీ తక్కువ అంచనా వేయలేం. స్టార్ వేల్యూ, కథాకథనాలు, కాంబినేషన్, నిర్మాణ వ్యయం, నిర్మాణ విలువలు... వీటన్నిటి దృష్ట్యా అన్నీ క్రేజీ ప్రాజెక్టులే. ఇవన్నీ వారం విరామంలో వరుసగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వెరసి రానున్న సంక్రాంతికి కోళ్ల పందం ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర జరగనుందన్న మాట!
 
 డిసెంబర్ 12 నుంచి ఈ బాక్సాఫీస్ పోరాటానికి తెర లేవనుంది. ఎందుకంటే... సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘లింగా’ విడుదలయ్యేది ఆ రోజే. ‘కొచ్చాడయాన్’ తర్వాత రజనీ నటించిన చిత్రమిది. ‘కొచ్చాడయాన్’లో యానిమేషన్ రజనీని చూసి డీలా పడిపోయిన అభిమానుల్లో కొత్త ఉత్తేజాన్ని నింపడానికి ఛాలెంజ్‌గా తీసుకొని మరీ రజనీ ఈ సినిమా చేశారు. వయసుని, ఆరోగ్యాన్నీ ఖాతరు చేయకుండా... యుద్ధ ప్రాతిపదికన సూపర్‌స్టార్ శరవేగంతో పూర్తి చేసిన సినిమా ఇది.
 
 ‘ముత్తు’, ‘నరసింహా’ విజయాల తర్వాత రజనీతో కె.ఎస్.రవికుమార్ చేసిన సినిమా ఇదే కావడం విశేషం. ఇందులో రజనీ ద్విపాత్రాభినయం చేశారు. ఇప్పటికే ఈ సినిమా ప్రచార చిత్రాలు అభిమానుల్లో అంచనాలు రెట్టింపు చేశాయి. ఇక ఇదే నెల 19న ‘చిన్నదాన నీ కోసం’ అంటూ నితిన్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘హార్ట్ ఎటాక్’ విజయాల తర్వాత నితిన్ నుంచి వస్తున్న ప్రేమకథాచిత్రం కావడంతో ఈ సినిమాపై కూడా అంచనాలు బాగానే ఉన్నాయి.
 
 ఈ ‘డిసెంబర్ 25’ మెగా ఫ్యామిలీకీ, మెగా అభిమానులకూ కీలకమైన రోజు. ఎందుకంటే, మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్ కథానాయకుడిగా నటించిన తొలి చిత్రం ‘ముకుంద’ విడుదలయ్యేది ఆ రోజే. ‘కొత్త బంగారులోకం’, ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు’ చిత్రాల తర్వాత శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇదే కావడంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇక సంక్రాంతి కానుకగా జనవరి 11న రానున్న ‘గోపాల గోపాల’ చిత్రం ప్రేక్షకులకు ఓ డబుల్ ధమాకా. ఎందుకంటే... రానున్న భారీ చిత్రాల నడుమ ఏకైక మల్టీస్టారర్ ఇదే. వెంకటేశ్, పవన్‌కల్యాణ్ కలిసి నటిస్తున్న ఈ చిత్రం దాదాపు పూర్తి కావచ్చింది.
 
 రషెస్ చూసిన యూనిట్ సభ్యులు సినిమా విజయంపై పూర్తి నమ్మకంతో ఉన్నారని సమాచారం. కిశోర్‌కుమార్ పార్థసాని ఈ చిత్రానికి దర్శకుడు. ఇక పూరీజగన్నాథ్-ఎన్టీఆర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ‘టెంపర్’(పేరు అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది) చిత్రాన్ని కూడా సంక్రాంతి కానుకగానే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. పూరీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఈ సంక్రాంతి పోటీలో ఈ రెండు చిత్రాలకూ పోటీగా ఓ అనువాద చిత్రం కూడా రానుంది. అదే శంకర్ ‘ఐ’. విక్రమ్ హీరోగా రూపొందిన ఈ చిత్రంపై ఇప్పటికే దేశవ్యాప్తంగా అంచనాలున్నాయి.
 
 అనుష్క ప్రధాన పాత్రలో గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘రుద్రమదేవి’ చిత్రం కూడా జనవరిలోనే విడుదల కానున్నట్లు తెలిసింది. అగ్ర కథానాయకుల భారీ చిత్రాల నడుమ రానున్న ఏకైక లేడీ ఓరియంటెడ్, చారిత్రక కథా చిత్రం ‘రుద్రమదేవి’ మాత్రమే కావడం విశేషం. ఇదిలావుంటే... మిస్టర్ పర్‌ఫెక్ట్ ఆమిర్‌ఖాన్ ‘పీకే’ చిత్రం డిసెంబర్ 19న విడుదల కానుంది. విడుదల కాకముందే.. సంచలనాలకు తెరలేపిన సినిమా ఇది. ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’, ‘లగేరహో మున్నాభాయ్’, ‘త్రీ ఇడియట్స్’ చిత్రాల దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ ఈ చిత్రానికి దర్శకుడవడం ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాపై అంచనాలు పెరగడానికి ఓ కారణం.
 
 తెలుగునాట కూడా ఈ సినిమాకు ప్రారంభ వసూళ్లు కనివినీ ఎరుగని రీతిలో ఉంటాయని పరిశీలకుల అంచనా. వీటితో పాటు నాగచైతన్య- సుధీర్‌వర్మల చిత్రం, కల్యాణ్‌రామ్ ‘పటాస్’, శర్వానంద్ ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ సహా మరికొన్ని కూడా ఈ రెండు నెలల వెండితెర విందులో భాగం కానున్నాయి.రానున్న ఈ చిత్రాలపై దర్శక, నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు. అయితే... ఎక్కడో ఓ మూల వీరిలో టెన్షన్ లేకపోలేదు. దానికి కారణం ఒకటే. అనుకున్న తేదీల్లో ఈ చిత్రాలన్నీ విడుదలైతే... ఎవరికీ సమస్యలు తలెత్తవు. పెపైచ్చు రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లు కళకళలాడతాయి.
 
  బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగుతుంది. కానీ... విడుదల తేదీలు అటూ ఇటూ అయితే మాత్రం చిక్కుల్లో పడాల్సి వస్తుంది. థియేటర్ల విషయాల్లో కూడా సమస్యలు తలెత్తడం ఖాయం. ముఖ్యంగా రజనీకాంత్ ‘లింగా’, శంకర్ ‘ఐ’ చిత్రాలు మన నిర్మాతలను టెన్షన్‌కు గురి చేస్తున్నాయి. వాటి విడుదల తేదీల్లో మార్పు సంభవిస్తే... స్ట్రయిట్ చిత్రాలకు సమస్యలు ఎదురవుతాయి. ‘లింగా’ డిసెంబర్ 12న కాకుండా, 25కు వెళుతుందని అనధికారిక వార్త. అదే జరిగితే కన్‌ఫ్యూ జన్ మొదలు. ఈ టెన్షన్, అటెన్షన్‌ల మధ్య బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి హంగామా జరుగుతుందో, 2014 వెళ్తూ వెళ్తూ... 2015 వస్తూ వస్తూ ఎన్నెన్ని సంచలనాలు సృష్టిస్తాయో... లెటజ్ వెయిట్ అండ్ సీ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement