ఉదయ్‌కిరణ్ చివరి సినిమా చిత్రం చెప్పిన కథ
చిత్రం, నువ్వు-నేను, మనసంతా నువ్వే, కలుసుకోవాలని, నీ స్నేహం... ఉదయ్‌కిరణ్‌ని నటునిగా ప్రేక్షకులకు చేరువ చేసిన సినిమాలివి. సముద్రపు అలలా ఉవ్వెత్తున పైకిలేచాడు. తోకచుక్క మాదిరి ఒక్కసారిగా నేల రాలాడు. నిజంగా ఉదయ్ జీవితమే ఒక చిత్రం. తను నటించిన చివరి సినిమా ‘చిత్రం చెప్పిన కథ’. మోహన్ ఏఎల్‌ఆర్‌కే దర్శకుడు. సీహెచ్ మున్నా నిర్మాత. ‘నువ్వు-నేను’ ఫేం అనిత ప్రత్యేక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో గరిమ, డింపుల్, మదాలస శర్మ కథానాయికలు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తూ ఉదయ్ మనకు దూరమయ్యారు. తనకు కావల్సినట్టుగా అహర్నిశలూ కష్టపడి ఈ కథను మలుచుకున్నాడు ఉదయ్. ఆయనలోని కొత్తకోణం ఇందులో చూస్తారు. ఒక ప్రత్యేకగీతం, చిన్నప్పటి సన్నివేశాల చిత్రీకరణ మినహా షూటింగ్ పూర్తయింది. త్వరలోనే వాటిని పూర్తి చేస్తాం. ఈ నెలాఖరున పాటల్ని, ఏప్రిల్‌లో సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు.
ఉదయ్‌కిరణ్‌లో ఇప్పటివరకూ చూడని కొత్తకోణం ఇందులో కనిపిస్తుందని, ఆయన అభిమానులకు ఇది గొప్ప కానుకని దర్శకుడు చెప్పారు. ఇది థ్రిల్లర్ చిత్రం కాబట్టి నేపథ్య సంగీతం విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోమని ఉదయ్ సూచించారని సంగీత దర్శకుడు మున్నా కాశీ గుర్తు చేసుకున్నారు. ఇంకా మల్టీడైమన్షన్స్ వాసు, టి.ప్రసన్నకుమార్, కొడాలి వెంకటేశ్వరరావు, కాదంబరి కిరణ్, మాటల రచయిత నరేష్ అమరనేని తదితరులు మాట్లాడారు.