
ఉదయనిధి స్టాలిన్ , రజనీకాంత్
చెన్నై, పెరంబూరు : నటుడు రజనీకాంత్‌ను రాజకీయాల్లోకి రానీయండి అప్పుడు ఆయన వ్యాఖ్యలకు బదులిస్తానని నటుడు, డీఎంకే యువ నేత ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్నారు. నటుడు రజనీకాంత్ ఇటీవల తుగ్లక్ పత్రిక కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఆ వేదికపై పెరియర్ గురించి చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే పలు చోట్ల రజనీకాంత్‌పై కేసులు నమోదయ్యాయి. కాగా అదే వేదికపై మురసోలి పత్రిక పట్టుకుంటే డీఎంకే వారని, తుగ్లక్ పత్రిక పట్టుకుంటే తెలివైన వారని రజనీ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. మురసోలి పత్రిక చదివే వారు తెలివైన వారు కాదా? అన్న విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంపై డీఎంకే పెద్దలెవరూ స్పందించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో డీఎంకే యువ నేత స్పందించిన తీరును రజనీకాంత్ అభిమానులు ఖండిస్తున్నారు. అసలు ఉదయనిధిస్టాలిన్ ఏమన్నారు? రజనీకాంత్ అభిమానుల ఆగ్రహానికి కారణం ఏమిటి? ఈ వివరాలు చూస్తే నటుడు ఉదయనిధిస్టాలిన్ నటుడు రజనీకాంత్ వ్యాఖ్యలపై స్పందిస్తూ ఒక ట్వీట్ చేశారు.
అందులో ముఖ్యమంత్రి అంటే అన్నాదురై, కళాకారుడంటూ విప్లవ నాయకుడు(ఎంజీఆర్) ధైర్యలక్ష్మి అంటే అమ్మ (జయలలిత) ఇలా శతాబ్దాల కాలంగా కాల్ పట్టుకుని కార్యాలను సాధించుకోవడానికి తలపట్టుకుంటున్న వారి మధ్యలో మురసోలిని చేతబట్టి ఆత్మవిశ్వాసం కలిగిన వారే డీఎంకే వారు అని పేర్కొన్నారు. ఆయన ట్వీట్ సంచలనంగా మారింది. ఉదయనిధిస్టాలిన్ వ్యాఖ్యలు రజనీకాంత్ గురించేనని ఆయన అభిమానులు ఆగ్రహిస్తున్నారు. కాగా నటుడు ఉదయనిధిస్టాలిన్, నటించిన సైకో చిత్రం ఈ నెల 24వ తేదీన తెరపైకి రానుంది. ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఆయన ఒక భేటీలో రజనీకాంత్ అభిమానుల ఆగ్రహం గురించి అడిగిన ప్రశ్నకు తాను రజనీకాంత్ గురించి మాట్లాడానని ఎవరు చెప్పారు? అని ప్రశ్నంచారు. సరే రజనీకాంత్ చేసిన వ్యాఖ్యల గురించి అడగ్గా, ఆయన ఇంకా రాజకీయాల్లోకి రాలేదని, వచ్చిన తరువాత బదులు ఇస్తానని ఉదయనిధిస్టాలిన్ పేర్కొన్నారు.