హీరో, హీరోయిన్ల స్ట్రీట్ ఫైట్
సాధారణంగా ఒక యువతి, యువకుడి మధ్య చిన్న గొడవ జరిగితేనే పెద్ద సీన్‌గా మారుతుంది. అలాంటిది ఒక అందమైన యువతి మంచి వయసులో ఉన్న యువకుడితో నడిరోడ్డులో ఫైట్ చేసిందంటే విషయం సీరియస్ అయ్యే ఉండాలి. ఏదేమైనా ముందు వాగ్వాదంతో మొదలైన వీరి గొడవ చిలికి చిలికి గాలివానగా మారినట్లు ముష్టి యుద్ధానికి దారి తీసింది. శివగంగై జిల్లా, పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉన్న పూలాంగుచ్చి గ్రామంలో జరిగిన ఈ వయసుకు వచ్చిన వారి స్ట్రీట్ ఫైట్ వాతావరణాన్ని వేడేక్కించింది. ముందు అంతగా పట్టించుకోని ఆ గ్రామ ప్రజలు గొడవ హద్దు మీరుతుందని భావించి పోలీసులకు సమాచారం అందించడానికి సమాయత్తం అవుతున్న సమయంలో ఒక మూల నుంచి కట్ అనే మాట వినిపించింది.
దీంతో అది సినిమా షూటింగ్ అని తెలుసుకుని ప్రజలు రిలాక్స్ అయ్యారు. ఈ రసవత్తరమైన సన్నివేశం ఉన్నోడు కా చిత్రం కోసం నవ దర్శకుడు ఆర్కే చిత్రీకరించారు. అభిరామి మెగామాల్ ప్రొడక్షన్స్ పతాకంపై అభిరామి రామనాథన్ నిర్మిస్తున్న చిత్రం ఇది. నెడుంశాలై, మాయ చిత్రాల ఫేమ్ ఆరి కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయనకు జంటగా డార్లింగ్-2 చిత్రం ఫేమ్ డాక్టర్ మాయ కథానాయికిగా నటిస్తున్నారు. ప్రభు, ఊర్వశి, తెన్నవన్, మనోబాలా, మన్సూర్ అలీఖాన్, శివరంజని, సుబ్బు పంజు, బాలశరవణన్, మిషాగోషల్, శామ్స్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సత్య సంగీతాన్ని అందిస్తున్నారు.
ఈ చిత్రం గురించి ఆరి తెలుపుతూ చక్కని పచ్చదనంతో కూడిన పూలాంగురించ్చి గ్రామంలో షూటింగ్ నిర్విహిస్తున్న అభిరామి రామనాథన్‌కు థ్యాంక్ చెప్పుకుంటున్నానన్నారు. ఇది ఆయన సొంత ఊరని తెలిపారు. దీన్ని ఆయన దత్తత తీసుకుని, పలు సేవాకార్యక్రమాలతో అభివృద్ధి చేశారని వివరించారు. ఇందులో తాను యాక్షన్‌తో కూడిన రొమాంటిక్ పాత్రలో నటిస్తున్నానని తెలిపారు. నటి మాయది నటనకు అవకాశం ఉన్న పాత్ర అని చెప్పారు. సీనియర్ నటుడు ప్రభు, ఊర్వశి ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా ప్రభు అందరిని ప్రేమగా పలకరిస్తూ అందరి అభిమాన్ని చూరగొనడం విశేషం అన్నారు.యూనిట్ సభ్యులకు ఆయన మంచి విందును ఇచ్చారని తెలిపారు.చిత్రం జనరంజకంగా తెరకెక్కుతోందని ఆరి వెల్లడించారు.