‘అనుకున్నదొక్కటీ అయ్యింది ఒక్కటీ బోల్తా కొట్టిందిలే బుల్‌బుల్ పిట్ట’ అన్న పాట గుర్తుకు రాక తప్పదు నటి అమలాపాల్ పరిస్థితి చూస్తే. ఈ కేరళా కుట్టి నీలతామరై అనే మలయాళ చిత్రం ద్వారా నాయకిగా పరిచయం అయ్యారు. ఆ తరువాత తమిళంలో వికటకవితో ప్రవేశించి వీరశేఖరన్, సింధు సమవేళి చిత్రాల్లో నటించారు. ఇవేవీ పెద్దగా తన కేరీర్‌కు ప్లస్ కాలేదు. అయితే సింధు సమవెళి చిత్రంలో మేనమామతో అక్రమ సంబంధం పెట్టుకున్న యువతి పాత్రలో నటించి వివాదాల్లో చిక్కుకున్నారు. అయితే అది ఆమెకు ఓ రకంగా మంచి ఫ్రీ ప్రచారాన్ని తెచ్చిపెట్టిందని చెప్పవచ్చు. ఆ తరువాత ప్రభుసాలమెన్ దర్శకత్వంలో నటించిన మైనా అమలాపాల్‌ను ప్రముఖ హీరోయిన్ల జాబితాలో చేర్చింది.
ఆ తరువాత విక్రమ్, విజయ్ వంటి స్టార్ హీరోలతో రొమాన్స్ చేసే అవకాశాలను అందుకున్నారు. అదే విధంగా తెలుగులోనూ అవకాశాలను అందుకుని బహుభాషా నటిగా గుర్తింపు పొందారు. అలా మంచి ఫామ్‌లో ఉండగానే దర్శకుడు విజయ్‌ను ప్రేమించి పెళ్లాడి నటనకు విరామం ఇచ్చారు. అప్పటి వరకూ అంగీకరించిన చిత్రాలను పూర్తి చేసి నటనకు పుల్‌స్టాప్ పెట్టనున్నారనే ప్రచారం జరిగింది. అలా విజయ్, అమలాపాల్‌ల దాంపత్య జీవితం ఏడాది పాటు అన్యోన్యంగా సాగింది. ఈ తరువాత మనస్పర్థలు, విడిపోవడాలు జరిగిపోయాయి.
తాజాగా విడాకులు కోరుతూ కోర్టుకెక్కారు. దర్శకుడు విజయ్‌తో కలిసున్నప్పుడు అమలాపాల్‌కు పలు అవకాశాలు తలుపుతట్టాయి. వివాహనంతరం సూర్యకు జంటగా పసంగ-2 చిత్రంలో నటించిన అమలాపాల్ తరువాత అమ్మాకణక్కు చిత్రంలో నటించారు. నటుడు ధనుష్ నిర్మించిన ఈ చిత్రంపై అమలాపాల్ చాలా ఆశలు పెట్టుకున్నారు. అయితే తన నమ్మకాన్ని ఆ చిత్రం పెద్దగా నిలబెట్టలేక పోయింది. ప్రస్తుతం ధనుష్‌కు జంటగా వడచెన్నై చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం ఒక్కటే అమలాపాల్ చేతిలో ఉంది.
పలువురు దర్శక నిర్మాతలు అమలాపాల్‌ను తమ చిత్రాల్లో నాయకిగా ఎంపిక చేయాలనుకున్నారు. అయితే ఎప్పుడైతే విజయ్ నుంచి విడాకులు కోరుతూ కోర్టు గుమ్మం ఎక్కారో అప్పటి నుంచి అమలాపాల్‌ను తమ చిత్రాల్లో ఎంపిక చేయడానికి దర్శక నిర్మాతలు సందిగ్ధంలో పడ్డారని సమాచారం. ఇది నిజంగా అమలాపాల్‌ను షాక్‌కు గురి చేసే విషయమే. పెళ్లి అయిన తరువాత హీరోయిన్‌గా రాణించడం సాధారణ విషయం కాదు. అలాంటి హీరోయిన్లకు ఫాలోయింగ్ ఉండదని పరిశ్రమ పక్కన పెట్టేస్తుందనే ప్రచారం ఉంది. అలాంటిది అమలాపాల్ దాన్ని అధిగమిస్తారా? లేదా? అన్నది వేచి చూడాల్సిందే.
అమలాపాల్‌కు షాక్!
Published Thu, Aug 18 2016 3:05 AM | Last Updated on Mon, Sep 4 2017 9:41 AM
Advertisement
Advertisement