చెన్నై : స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఆ ఇద్దరు స్టార్స్ నటించబోతున్నారా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానమే వస్తోంది. భారీ చిత్రాలకు చిరునామా శంకర్. తొలి చిత్రం జెంటిల్‌మెన్ నుంచి ఇటీవల విడుదలైన 2.ఓ చిత్రం వరకూ ఆయన ఎంచుకున్న కథా నేపథ్యాలు భిన్నమైనవే. అంతే కాదు అవన్నీ భారీ చిత్రాలే. రజనీకాంత్ నటించిన 2.ఓ ఇండియన్ స్క్రీన్‌పై ఓ అద్భుతం. అలాంటి చిత్రాన్ని మరో ఇండియన్ దర్శకుడు చేసే సాహసం చేయగరలని చెప్పడం కష్టమే. కాగా ప్రస్తుతం శంకర్ సోషల్ కాస్‌తో కూడిన ఇండియన్ 2 చిత్రాన్ని చెక్కడానికి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. విశ్వనటుడు కమలహాసన్ అవినీతిపై పంజా విసరడానికి రెడీ అవుతున్న చిత్రం ఇండియన్ 2. అన్నీ సరిగా ఉంటే ఈ పాటికి ఇండియన్ 2 చిత్రం తెరపైకే వచ్చి ఉండేదని చెప్పవచ్చు. అయితే కమలహాసన్ రాజకీయాల్లోకి రావడం, నిర్మాణ సంస్థ మారడం వంటి కారణాల వల్ల చిత్ర షూటింగ్ ఆలస్యంగా ప్రారంభం అవుతోంది. వచ్చే నెలలో ఇండియన్ 2 చిత్ర షూటింగ్ సెట్‌పైకి వెళ్లనుంది. నటి కాజల్‌అగర్వాల్, ప్రియాభవానీశంకర్, ఐశ్వర్యారాజేశ్ తదితర నలుగురు హీరోయిన్లు ఇందులో నటించబోతున్నట్లు సమాచారం. లైకా సంస్థ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తోంది. కాగా ఈ చిత్రం తరువాత శంకర్ తెరకెక్కించనున్న రెండు చిత్రాలకు హీరోలు రెడీ అయ్యారన్నది తాజా సమాచారం. అందులో ఒకరు దళపతి విజయ్. ఇంతకు ముందు శంకర్, విజయ్ కాంబినేషన్‌లో నన్బన్ అనే చిత్రం తెరకెక్కిన్న విషయం తెలిసిందే. ఇది హింది చిత్రం 3 ఇడియట్స్‌కు రీమేక్. శంకర్ సినీ జీవితంలో దర్శకత్వం వహించిన తోలి రీమేక్ చిత్రం ఇదే. కాగా నన్బన్ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేదన్నది వాస్తవం. కాగా మరోసారి శంకర్, విజయ్ కాంబినేషన్‌లో చిత్రం రూపొందనుంది. ఇండియన్ 2 చిత్రం తరువాత ప్రారంభం అయ్యే చిత్రం ఇదే అవుతుంది. ఆ తరువాత విక్రమ్ హీరోగా శంకర్ చిత్రం చేయనున్నారు. వీరిదీ హిట్ కాంబినేషన్‌నే. అన్నియన్, ఐ చిత్రాలను విక్రమ్‌తో చేసిన శంకర్ మరోసారి ఆయన హీరోగా చిత్రం చేయనున్నారు. ఇంత కరెక్ట్‌గా చెప్పడానికి కారణం నటుడు విక్రమ్‌నే. ఆయనే ఇటీవల ఈ విషయాన్ని ఒక మీడియాకిచ్చిన భేటీలో వెల్లడించారు.
శంకర్ దర్శకత్వంతో విజయ్, తానూ నటించబోతున్నామని చెప్పారు. అయితే ముందు విజయ్ హీరోగా శంకర్ చిత్రం చేయనున్నారని, మరో రెండేళ్ల తరువాత తాను నటించే చిత్రం ఉంటుందని విక్రమ్ చెప్పారు. దీంతో ఇండియన్ 2 చిత్రం తరువాత శంకర్‌కు ఇద్దరు స్టార్ హీరోలు రెడీగా ఉన్నారన్నమాట. అయితే ఈ రెండు చిత్రాలకు సంబంధించిన వివరాలు తెలియాలంటే మరి కొద్ది కాలం ఆగాల్సిందే. కాగా ప్రస్తుతం నటుడు విజయ్ అట్లీ దర్శకత్వంలో బిగిల్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. తరువాత లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో నటించనున్నారు. ఆ తరువాత శంకర్‌తో చిత్రం ఉండే అవకాశం ఉంది. ఇకపోతే నటుడు విక్రమ్ ఇమైకా నొడిగళ్ చిత్రం ఫేమ్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారు. ఆ తరువాత మణిరత్నం దర్శకత్వంలో పొన్నియన్ సెల్వన్, అదే విధంగా మలయాళంలో తెరకెక్కినున్న పురాణ ఇతిహాసం కర్ణ చిత్రంలోనూ నటించనున్నారు. ఆ తరువాత శంకర్‌తో చిత్రం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment