సల్మాన్ ఖాన్ సినిమాపై అఖిలేశ్ ఔదార్యం
లక్నో: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తాజా హిట్ చిత్రం బజరంగీ భాయిజాన్పై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అశిలేశ్ యాదవ్ ఔదార్యాన్ని ప్రదర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా 'బజరంగీ..' సినిమాకు వినోదం పన్ను మినహాయిపు కల్పిస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. ఇండియాలో తప్పిపోయిన పాక్ బాలికను ఇంటికి చేర్చడమనే కథాంశంతో గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం 300 కోట్లకు పైగా వసూళ్లను రాబడుతుందని సినీవర్గాల అంచనా.
ఈ రోజు ఉదయం బజరంగీ భాయిజాన్ చిత్ర దర్శకుడు కబీర్ ఖాన్.. సీఎం అఖిలేశ్ను కలిసి చిత్ర విశేషాలను వివరించారు. సినీరంగ అభివృద్ధికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న అఖిలేశ్ ఆ మేరకు సల్మాన్ సినిమాకు పన్ను మినహాయిస్తున్నట్లు చెప్పారు. సినిమా షూటింగ్స్కు అనువైన లొకేషన్లు ఉత్తరప్రదేశ్ అంతటా ఉన్నాయని, సినిమా రూపకర్తలు ఇక్కడికి వచ్చి సినిమాలు తీయాలని పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా తన సినిమాను చూడాల్సిందిగా భారత్, పాక్ ప్రధానులు నరేంద్ర మోదీ, నవాజ్ షరీఫ్లను కోరారు హీరో సల్మాన్ ఖాన్.