
అమెరికాలో అక్కినేని స్టాంప్
అమెరికా: స్వర్గీయ ప్రముఖ తెలుగు నటుడు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత, నట సామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు(ఏఎన్ఆర్)కు అమెరికాలో అరుదైన ఘనత దక్కింది. అమెరికాలో అక్కినేని పోస్టల్ స్టాంప్ ను విడుదల చేయడానికి యునైటెడ్ స్టేటెడ్ పోస్టల్ సర్వీస్ (యూఎస్పీఎస్) ఆమోద ముద్ర వేసినట్లు అమెరికాలోని అక్కినేని ఫౌండేషన్ తాజాగా ప్రకటించింది. ఈ విషయాన్ని యూఎస్పీఎస్ ధృవీకరించినట్లు ఎఎఫ్ఏ అధ్యక్షుడు డాక్టర్ ప్రసాద్ తోటకూర తెలిపారు. ఒక భారతీయ నటుడికి అమెరికాలో ఈ తరహా ఘనత దక్కడం ఇదే ప్రథమమని అన్నారు. దీనికి సంబంధించి యూఎస్పీఎస్ కు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.
త్వరలోనే అక్కినేని పోస్టల్ స్టాంప్ అమెరికాలో విడుదల చేయనుండటంతో చాలా గర్వంగా ఉందన్నారు. ఇందుకు గాను అక్కినేని జయంతి రోజు (సెప్టెంబర్ 20)న డల్లాస్ లో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని తోటకూర ప్రసాద్ స్పష్టం చేశారు. ఇందుకు గాను అక్కినేని సుదీర్ఘ సినీ ప్రయాణానికి సంబంధించి అవసరమైన డాక్యుమెంట్లను ఆ సంస్థకు అందజేశామన్నారు.