
ఫెయిల్యూర్ హీరోలకు లక్కీ బ్యానర్
సినీ రంగంలో సెంటిమెంట్ లు చాలా ఎక్కువ. అందుకే ఒక సక్సెస్ ఇస్తే చాలు ఆ కాంబినేషన్ ను రిపీట్ చేయటం.. అదే జానర్ లో సినిమాలు చేయటం చిత్ర పరిశ్రమలో ఎక్కువగా కనిపిస్తుంది. అలాంటి ఓ ఇంట్రస్టింగ్ సెంటిమెంట్ ఇప్పుడు టాలీవుడ్ తెర మీద హల్ చల్ చేస్తుంది. వరుస ఫ్లాప్ లతో కష్టాల్లో ఉన్న హీరోలను భారీ హిట్స్ తో ఒడ్డున పడేస్తుంది ఓ నిర్మాణ సంస్థ..
మిర్చి సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన ప్రొడక్షన్ కంపెనీ 'యువి క్రియేషన్స్'. హీరో ప్రభాస్ మిత్రులు నెలకొల్పిన ఈ బ్యానర్పై తొలి ప్రయత్నంగా ప్రభాస్ హీరోగా 'మిర్చి'ని తెరకెక్కించారు. కొత్త దర్శకుడు కొరటాల శివను డైరెక్టర్గా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లోనే బిగెస్ట్ హిట్గా నిలిచింది. దీంతో తొలి ప్రయత్నంలో మంచి సక్సెస్ సాధించింది యువి క్రియేషన్స్.
అదే జోష్లో శర్వానంద్ హీరోగా షార్ట్ ఫిలిం మేకర్ సుజిత్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ 'రన్ రాజా రన్' సినిమాను తెరకెక్కించారు. యువి బ్యానర్పై చిన్న సినిమాగా తెరకెక్కి అద్భుతమైన విజయాన్ని సాధించింది ఈ మూవీ. ఈ సినిమాతో అప్పటి వరకు ఫ్లాప్లతో బాధ పడుతున్న శర్వానంద్ కూడా హిట్ ట్రాక్లోకి వచ్చాడు.
అలాగే 'భలే భలే మొగాడివోయ్' సినిమా విషయంలో కూడా అదే సెంటిమెంట్ రిపీట్ అయింది. చాలా రోజులుగా హిట్ లేక కష్టాల్లో ఉన్న నాని.. గీతా ఆర్ట్స్, యువి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన భలే భలే మొగాడివోయ్ సినిమాతో సక్సెస్ మూడ్ లోకి వచ్చాడు. ఇలా కష్టాల్లో ఉన్న హీరోలను హిట్ ట్రాక్ ఎక్కిస్తున్న యువి క్రియేషన్స్ బ్యానర్లో సినిమాలు చేయడానికి యంగ్ హీరోలు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.