అయిదు భాషల్లో హంగామా!
హీరో సాయిరామ్ శంకర్‌ను ఇక నుంచి రామ్ శంకర్‌గా పిలవాలి. ఆ పేరుతోనే ఆయన ‘వాడు నేను కాదు’ సినిమా చేస్తున్నారు. ఆరుగురు జాతీయ అవార్డు గ్రహీతలు కలిసి పనిచేస్తున్న ఈ చిత్రాన్ని అయిదు భాషల్లో తీస్తున్నారు. వినోద్ విజయన్ దర్శకత్వంలో రవి పచ్చ ముత్తు, కె. మోహనన్, వినోద్ విజయన్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభ వేడుక గురువారం హైదరాబాద్‌లో జరిగింది. దేశంలోనే ప్రసిద్ధి గాంచిన న్యాయవాది రామ్ జెఠ్మలానీ ఈ సినీవేడుకలో పాల్గొని కెమెరా స్విచాన్ చేయడం విశేషం.
అలాగే ఈ వేడుకలో ప్రపంచలోనే అతిపెద్ద శ్రీచక్రంను ఏర్పాటు చేయడం మరో విశేషం. సరికొత్త కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాతో తనకు బ్రేక్ రావడం ఖాయమని రామ్ శంకర్ నమ్మకం వ్యక్తపరిచారు. ఇందులో రామ్ శంకర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని దర్శకుడు చెప్పారు. కేరళ, హైదరాబాద్, తమిళనాడు, బెంగళూరు తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ చేస్తామని నిర్మాత తెలిపారు. తమిళంలో ఏడు సినిమాలు చేసిన తనకిది తొలి తెలుగు చిత్రమని కథానాయిక మహిమా నంబియార్ చెప్పారు. ఏఎమ్ రత్నం, పూరి జగన్నాథ్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు.