బెజవాడలోనే..‘వంగవీటి’ పాట
‘నువ్వు లోకల్ స్థాయి నుంచి స్టేట్ లెవల్‌కి ఎదగాలి.. అంటే రాజకీయాల్లోకి రావాలి’, ‘ఎంతపెద్ద రౌడీ అయితే ఏం?కత్తితో పొడిస్తే వాడికీ రక్తం వస్తుంది’... ఇవి ‘వంగవీటి’ చిత్రంలోని మచ్చుకు కొన్ని డైలాగులు. విజయవాడ రౌడీయిజం నేపథ్యంలో స్వర్గీయ వంగవీటి రాధా, రంగా లాంటి నిజజీవిత పాత్రల జీవితాల నేపథ్యంలో రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్‌కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రవిశంకర్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను డిసెంబర్ 3న విజయవాడలో విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ -‘‘విజయవాడలో గతంలో జరిగిన పలు సంఘర్షణలను ప్రత్యక్షంగా చూశా. అక్కడి రౌడీయిజంపై తీసిన ‘వంగవీటి’ నాకు చాలా ప్రత్యేకం. ఇప్పటికే ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది’’ అన్నారు. ‘‘ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. డిసెంబర్ 23న సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని నిర్మాత అన్నారు. ఈ చిత్రానికి కెమేరా: రాహుల్ శ్రీవాత్సవ్, కె.దిలీప్ వర్మ, సూర్య చౌదరి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: విస్సు.