గన్నవరంలో రామ్ గోపాల్ వర్మ హంగామా
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వ్యాఖ్యలు హంగామా సృష్టించాయి. ఓ దశలో వర్మను పోలీసులు అరెస్ట్ చేస్తారంటూ వార్తలు వచ్చాయి. శుక్రవారం సాయంత్రం ఆయన గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ముందుగా ట్విట్టర్ లో ప్రకటించిన విధంగానే.. వంగవీటి సినిమాకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకునేందుకు కొందరు వ్యక్తులను కలిసేందుకు ఆయన విజయవాడ పయనమయ్యారు. అయితే 'విజయవాడకు రావద్దంటూ కొందరి నుంచి బెదిరింపులు వస్తున్నాయని.. ఆనాటి రౌడీలతో తిరిగిన నేనే అసలు సిసలైన రౌడీనని, దమ్ముంటే నన్ను అడ్డుకోండంటూ' ప్రయాణం వివరాలను ట్విట్టర్ లో పోస్టు చేసిన విషయం తెలిసిందే.
దాంతో శుక్రవారం సాయంత్రం పెద్ద ఎత్తున అభిమానులు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు భారీగా మోహరించారు. పోలీసులు వర్మను అదుపులోకి తీసుకుంటారంటూ ప్రచారం ఊపందుకుంది. అయితే ఊహాగానాలన్నిటికి తెరదించుతూ రామూ ఎంచక్కా కారెక్కి హోటల్ కి బయలుదేరారు. మొత్తానికి రామూ 'వంగవీటి' సినిమాకి కావలసినంత ప్రచారం పొందటంలో సఫలమయ్యారు. ఆ వాహనంలో వర్మతో పాటు దేవనేని నెహ్రు, వంగవీటి చిత్ర నిర్మాత దాసరి కిరణ్ కుమార్ కూడా ఉన్నారు. మూడు రోజులపాటు విజయవాడలోనే ఉంటానని.. రంగా, నెహ్రూ కుటుంబసభ్యులను కలవనున్నట్లు వర్మ మీడియాతో చెప్పారు.