నా కెరీర్‌లో ఇదే బెస్ట్ ఫిల్మ్ - రామ్‌గోపాల్ వర్మ
‘‘వంగవీటితో పరిచయం ఉన్న వ్యక్తులకు ఆయన గురించి ఓ అవగాహన ఉంటుంది. దూరం నుంచి గమనిస్తూ, వింటున్న నాలాంటోళ్ల అవగాహన మరో విధంగా ఉంటుంది. రెండిటిలో ఏది నిజం అనేది ప్రశ్న కాదు. నాకు అర్థమైన, నా అవగాహన దృష్టితో ఈ సినిమా తీశా’’ అని దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అన్నారు. విజయవాడ రాజకీయాలు, రౌడీయిజం నేపథ్యంలో ఆయన తీసిన సినిమా ‘వంగవీటి’. వంగవీటి మోహనరంగా, రాధా పాత్రల్లో సందీప్‌కుమార్, రత్నకుమారిగా నైనా గంగూలీ, దేవినేని మురళిగా ‘హ్యాపీడేస్’ ఫేమ్ వంశీ, దేవినేని గాంధీగా కౌటిల్య, దేవినేని నెహ్రూగా శ్రీతేజ, దేవినేని లక్ష్మిగా ప్రజ్ఞ నటించారు. దాసరి కిరణ్‌కుమార్ నిర్మించిన ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ వేడుక శనివారం రాత్రి విజయవాడలో జరిగింది. కేయల్ యూనివర్సిటీ చైర్మన్ కోనేరు సత్యనారాయణ ఆడియో సీడీలను ఆవిష్కరించి, వర్మకు అందజేశారు.
వర్మ మాట్లాడుతూ - ‘‘వంగవీటి మోహన రంగా ర్యాలీ జరుగుతున్నప్పుడు ఓ సారి నేనూ పాల్గొన్నాను. నేను దర్శకుణ్ణి కాక ముందు నుంచీ ఈ కథ నాకు తెలుసు. అప్పుడు విజయవాడలో జరిగిన పరిస్థితులు, వాతావరణాన్ని స్టడీ చేసి ఆ అవగాహనతో నేనో దర్శకుణ్ణి అయ్యాను. ఈ సినిమాతో నాకున్న ఎమోషనల్ బాండింగ్ మరే సినిమాతోనూ లేదు. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. ఫ్యాక్షన్ కావొచ్చు.. గ్యాంగ్‌స్టర్ కావొచ్చు లేదా హైదరాబాద్ గూండాయిజమ్ మీద తీసినవి కావొచ్చు. ఇరవై ఏడేళ్ల నా కెరీర్‌లో ‘వంగవీటి’ నా బెస్ట్ ఫిల్మ్. నేనే దర్శకుణ్ణి కాబట్టి, ఈ మాట చెప్పడం సరి కాదేమో కానీ చెబుతున్నా! వివాదాస్పదఅంశంతో నిజజీవిత పాత్రల ఆధారంగా ఈ సినిమా తీయడం వల్ల ఎంతోమందికి ఇబ్బంది కలుగుతుందని తెలిసినా కూడా ముందుకొచ్చిన నిర్మాతకు థ్యాంక్స్’’ అన్నారు. దాసరి కిరణ్‌కుమార్ మాట్లాడుతూ - ‘‘క్రియేటివిటీతో పాటు దమ్ము, ధైర్యం, పౌరుషం ఉన్న దర్శకులు వర్మగారు.
ఈ చిత్రాన్ని ప్రేక్షకులు మంచి ఆలోచనతో, స్పోర్టివ్‌గా చూస్తారని ఆశిస్తున్నా’’ అన్నారు. సంగీత దర్శకుడు రవిశంకర్ మాట్లాడుతూ - ‘‘వాస్తవిక కథతో తెరకెక్కిన ఇటువంటి చిత్రాలకు సంగీతం అందించడం చాలా ఇష్టం’’ అన్నారు. మరో సంగీత దర్శకుడు రాజశేఖర్ పన్నాల, పాటల రచయితలు సిరాశ్రీ, చైతన్య ప్రసాద్, హీరో హవీష్, వేదా సీడ్స్ ఎండీ తులసీధరమ్ చరణ్, పారిశ్రామికవేత్త తోటకూర వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.