‘‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ గురించి 3 నెలలుగా చాలా ఇంటర్వ్యూల్లో మాట్లాడాను. కొత్తగా మాట్లాడటానికి ఏమీ లేదు. ఏం మాట్లాడతానని భయపడుతున్నారు మీరు? (ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి) సినిమా చూడమని ప్రెస్‌మీట్ నిర్వహిస్తే అడ్డుకుంటున్నారు. పోలీసులు ఎవరి వల్ల ఇలా చేస్తున్నారన్నది నాకు తెలియదు. వాళ్లకు ఆదేశాలు ఉన్నాయి. ఆ ఆదేశాలు దేవుడు ఇచ్చాడా? ప్రభుత్వం ఇచ్చిందా? కొందరు వ్యక్తులు ఇచ్చారా? అనేది తెలియదు. కానీ ఈ సినిమాను ఆపాలనే ఆలోచన ఎవరికి ఉంటుంది? ఈ సినిమాను ఆపాలనుకుంటున్నారంటే వాళ్లు భయపడుతున్నారనే అనుమానం రాకుండా ఎలా ఉంటుంది’’ అని రామ్‌గోపాల్ వర్మ అన్నారు. విజయ్‌కుమార్, యజ్ఞాశెట్టి, శ్రీతేజ్ ముఖ్యపాత్రల్లో రామ్‌గోపాల్ వర్మ, అగస్త్య మంజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. రాకేశ్ రెడ్డి, దీప్తి బాలగిరి నిర్మించిన ఈ చిత్రం మార్చి 29న ఏపీ మినహా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మే 1న ఏపీలో విడుదల కానుంది. ‘విజయవాడలో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేయాలనుకున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ బృందాన్ని అక్కడి పోలీసు యంత్రాంగం అడ్డుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ – ‘‘నేనింకా షాక్‌లో నుంచి బయటకు రాలేకపోతున్నాను. పోలీస్ వ్యవస్థకు లా అండ్ ఆర్డర్ సమస్యలు ఉంటాయి.
దాన్ని పాటించడం దేశ పౌరులుగా మన బాధ్యత. పోలీసులు ప్రెస్‌మీట్ వీలులేదని చెప్పడం సివిల్ సొసైటీలో ఓ పద్ధతి. కానీ మమ్మల్ని చుట్టుముట్టి బయటకు లాగి విజయవాడలో ఎంట్రీ వీలులేదు అన్నట్టు ప్రవర్తించారు. ఎవరు చేయమన్నారు మిమ్మల్ని అని అక్కడి అధికారులను అడిగితే పేర్లు చెప్పడం లేదు. వాళ్ల పై అధికారులు కావొచ్చు, గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా అయ్యుండొచ్చు. మనం నియంతృత్వ రాజ్యంలో ఉంటున్నామా? ప్రజాస్వామ్య దేశంలో ఉంటున్నామా? నేనో ఆఫీసర్‌ని ‘రోడ్డు మీద కాకుండా ఓ ఫ్రెండ్ ఇంట్లో కొందరు పాత్రికేయులతో మాట్లాడతాను’ అని అడిగాను. ‘మిమ్మల్ని మాట్లాడనివ్వకూడదని పై నుంచి స్ట్రిక్ ఆర్డర్స్ ఉన్నాయి’ అన్నారు. ఆ ఆదేశాలు ఎవరు ఇస్తున్నారో తల బద్దలు కొట్టుకుని ఆలోచించినా నా మనసుకు తట్టడం లేదు. జగన్‌గారి మీద కత్తిదాడి జరిగినప్పుడు ‘మాకు కేవలం ఎయిర్‌పోర్ట్ బయట వరకే అధికారం ఉంటుంది. ఎయిర్‌పోర్ట్ లోపల సెక్యూరిటికి, మాకు సంబంధం ఉండదు’ అని టీడీపీ ప్రభుత్వ నాయకులు చెప్పడం జరిగింది. మొన్న విజయవాడలో మమ్మల్ని అరెస్ట్ చేసిన పోలీసులు ఎయిర్‌పోర్ట్ లోపలకు వచ్చి 7 గంటలు మమ్మల్ని నిర్భందించారు.
వాళ్లు ఎయిర్‌పోర్ట్ లోపలకు ఎలా వచ్చారు? ఈ ప్రశ్నకు సమాధానం నాకు చెబుతారనుకుంటున్నాను. విజయవాడ లోపలికి రానివ్వం, ఉండనివ్వం అంటే అది ఆంధ్రప్రదేశా? నార్త్ కొరియానా? అంటే అక్కడికి వెళ్లాలంటే వీసాలు తీసుకోవాలా? క్రిమినల్ బ్యాగ్రౌండ్ చెక్ చెయించాలా? ప్రెస్‌మీట్లనే ఆపేశారు మరి థియేటర్లలో సినిమాను ఆడనిస్తారా? నన్ను బంధించిన ఆ ఏడు గంటల్లో ‘బిహైండ్ లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనే కథను రాశాను. ఈ సినిమా పార్ట్ 2లో ఆ కథ వస్తుంది. మళ్లీ విజయవాడలో ప్రెస్‌మీట్ పెట్టాలంటే ఆయన దయ కావాలి. మాఫియాను హ్యాండిల్ చేయవచ్చు. గవర్నమెంట్‌లో కూర్చుని మాఫియాలా ప్రవర్తిస్తే హ్యాండిల్ చేయలేం. ఈ ఇష్యూ మీద జగన్‌గారు వైసీపీ పార్టీ మెంబర్‌గా కాదు ఓ నార్మల్ వ్యక్తిగా రియాక్ట్ అయ్యారు. వైసీపీలో చేరే ఉద్దేశమే నాకు లేదు. మీ అందరి మీద ఒట్టు’’ అన్నారు. రాకేశ్ రెడ్డి మాట్లాడుతూ – ‘‘ప్రెస్‌మీటే కాదు మీరు కూడా విజయవాడలో ఉండకూడదు అన్నారు. ఈ సినిమా రిలీజ్‌పై అక్కడున్న ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది? ఆల్రెడీ ఎన్నికలు అయిపోయాయి. అయినా మీ నిజం బయటపడుతుందనా? నిజమైన నాయకులైతే దగ్గరుండి రిలీజ్ చేయించాలి. నిన్న ప్రెస్‌మీట్ సవ్యంగా జరిగుంటే వాళ్లకు మాత్రమే తెలిసేది. ఇప్పుడు ప్రపంచం మొత్తం తెలిసింది. సినిమా చూడండి అని ప్రేక్షకులకు చెప్పాలనే ఉద్దేశంతో ప్రెస్‌మీట్ పెట్టాలనుకున్నాం. లీగల్‌గా పోరాడతాం. త్వరలోనే వాళ్లకు రిటర్న్ గిఫ్ట్ రాబోతోంది. ఆల్రెడీ తెలంగాణ ప్రజలు ఇచ్చారు. ఇప్పుడు ఆంధ్రా వాళ్లు కూడా ఇవ్వబోతున్నారు. మే 23వ తారీఖు వరకూ వెయిట్ చేయండి’’ అన్నారు. ‘‘మన దేశంలో భాగమైన దర్శకుడైనా, సాధారణ వ్యక్తి అయినా విజయవాడ, విశాఖపట్నం, లక్నో, ఢిల్లీ వెళ్లే హక్కు ఉంది. క్రిమినల్ రికార్డ్ ఉంటే తప్ప అడ్డుకునే అధికారం ఎవ్వరికీ లేదు. మన అభిప్రాయాల్ని పంచుకునే హక్కుని అడ్డుకునే అధికారం సీఎం, పీఎం ఎవ్వరికీ ఉండదు. సినిమా విడుదలకు సెన్సార్ బోర్డ్ పర్మిషన్ ఇచ్చింది’’ అన్నారు న్యాయవాది విష్ణువర్థన్.
ఏపీకి వెళ్లాలంటే వీసాలు తీసుకోవాలా? రామ్‌గోపాల్ వర్మ
Published Mon, Apr 29 2019 11:26 PM | Last Updated on Tue, Apr 30 2019 5:19 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment