మేలుకో మహిళా.. లేదంటే భద్రత కలే!
నేటి సమాజంలో మహిళలకు భద్రత ఏది? అనే అంశంపై మూడు రోజులుగా చిత్రపరిశ్రమలో చర్చ జరుగుతోంది. హీరోయిన్ భావన కిడ్నాప్ ఉదంతం వెలుగులోకి వచ్చిన తర్వాత అందరూ ఆందోళన వ్యక్తం చేశారు. నటీమణుల పట్ల అనుచితంగా ప్రవర్తించే వ్యక్తులను శిక్షించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తమిళ హీరోయిన్ వరలక్ష్మీ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా బయటపెట్టారు. ఇంతకీ వరలక్ష్మీ ఏం చెప్పారంటే..
ఈ రోజుల్లో సోషల్ మీడియాలో నిజాయితీగా మాట్లాడిన ప్రతి మాటను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అందుకే, నా అనుభవాన్ని బయటపెట్టాలా? వద్దా అని రెండు రోజులు తర్జనభర్జన పడ్డాను. చివరికి నా మానసిక సంఘర్షణను పంచుకోవాలనుకున్నాను. ఓ టీవీ ఛానల్ ప్రోగ్రామింగ్ హెడ్‌తో ఓసారి సమావేశమయ్యాను. సమావేశం ముగుస్తుందనగా ‘‘ఇంకేంటి! మనం బయట ఎప్పుడు కలుస్తున్నాం?’’ అనడిగాడు. నేను ‘‘మరో పని ఏమైనా ఉందా?’’ అనడిగా. కొంటెగా చూస్తూ.. ‘‘నో.. నో.. పనేం లేదు. ఫర్ అదర్ థింగ్స్’’ అన్నాడు.
నా కోపాన్ని అణుచుకుని ‘‘సారీ! మీరు దయ చేయవచ్చు. ప్లీజ్’’ అన్నాను. ‘‘అంతేనా’’ అని నవ్వుతూ బయటకు నడిచాడు.ఇటువంటి ఘటనల గురించి చెప్పినప్పుడు చిత్రసీమలోని వ్యక్తులతో పాటు బయట వ్యక్తుల నుంచి వచ్చే కామన్ రియాక్షన్... ‘‘ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంతే. ఇందులోకి ప్రవేశించేటప్పుడు నీకు ఇవన్నీ తెలుసు. ఇప్పుడెందుకు కంప్లైంట్ చేస్తున్నావ్?’’ అంటుంటారు. అలాంటి వాళ్లకు చెప్పేది ఒక్కటే... ‘‘ఎలాంటి భావోద్వేగాలు లేని ఓ మాంసపు ముక్కలా నన్ను ట్రీట్ చేస్తారనో లేదా ఇక్కడి మహిళలకు ఇలాంటివి కామన్.. అనుసరించిపోవాలనో నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి రాలేదు. ఐ లవ్ యాక్టింగ్. ‘వీలైతే ఎదుర్కొందాం.. లేదా వదిలేద్దాం’ అనుకోవడంలేదు. ( హీరో కూతురికీ తప్పని లైంగిక వేధింపులు )
నా ప్రొఫెషన్‌ని ఎప్పటికీ వదలను.ఓ మహిళగా మగాళ్లకు ఓ సూచన చేస్తున్నా. ‘‘మహిళలను అగౌరవపరచడం మానుకోండి లేదా బయటకు వెళ్లండి’’. నేనో హీరోయిన్. స్క్రీన్‌పై గ్లామరస్‌గా కనిపిస్తా. అంతమాత్రాన నన్ను అగౌరవపరిచే హక్కు మీకు ఎవరిచ్చారు? ఇది నా లైఫ్, నా బాడీ, నా ఇష్టం. ఏ మగాడికీ నన్ను తక్కువగా చూసే హక్కు లేదు. ‘‘నీ లైఫ్‌లో జరిగింది చిన్న ఘటనే కదా. ఎందుకింత రాద్దాంతం చేస్తున్నావ్?’’ అని అడగొచ్చు.
నిజమే, ఘటన చిన్నదే. లక్కీగా, నేను సేఫ్‌గానే బయటపడ్డా. మహిళలు ఎలా మాట్లాడాలో.. ఏ బట్టలు వేసుకోవాలో.. ఎలా ప్రవర్తించాలో చెప్పడం బదులు ఎంత స్ట్రాంగ్‌గా ఉండాలో నేర్పాలి.మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు, అగౌరవంగా చూడడం వంటివి నానాటికీ పెరుగుతున్నాయి. మన విద్యావ్యవస్థ మనల్ని ఫెయిల్ చేస్తోంది. భయంతో ఎవరైతే అమ్మాయిలు మాట్లాడలేకపోతున్నారో వాళ్ల తరఫున మాట్లాడుతున్నా. మగవాళ్లకు భయపడడం కాదు.. ధైర్యంగా బయటకొచ్చి మహిళలు మాట్లాడితేనే వాళ్లకు శిక్ష పడుతుంది.ఇప్పుడు మేలుకోకపోతే.. మహిళలకు భద్రత అనేది కలగానే మిగులుతుంది. ‘రేప్’ అనే పదాన్ని ఈ సమాజం నుంచి ఎప్పటికీ తొలగించలేం.