150 ఏళ్ల క్రితం మనిషినని వర్మ నన్ను విమర్శించారు! | varma critizied me as human before 150 years | Sakshi
Sakshi News home page

150 ఏళ్ల క్రితం మనిషినని వర్మ నన్ను విమర్శించారు!

Published Wed, Sep 10 2014 12:20 AM | Last Updated on Sat, Sep 2 2017 1:07 PM

150 ఏళ్ల క్రితం మనిషినని వర్మ నన్ను విమర్శించారు!

150 ఏళ్ల క్రితం మనిషినని వర్మ నన్ను విమర్శించారు!

మంచు విష్ణు ఆలోచనా సరళి భిన్నంగా ఉంటుంది. స్టార్‌గా ఎదగడం కంటే,  నటునిగా ఎదగడమే గొప్ప అంటారాయన. తెరపై ఎంత ధాటిగా హీరోయిజం పలికిస్తారో, అంతే ధాటిగా సమాజంలో జరిగే చెడుపై కూడా స్పందిస్తారు. పెద్దలను గౌరవించడం, ప్రతిభను ప్రోత్సహించడం, కొత్త దారుల్ని అన్వేషించడం... ఇలా అభినందించదగ్గ అంశాలు విష్ణులో చాలానే కనిపిస్తాయి. రామ్‌గోపాల్‌వర్మ
 దర్శకత్వంలో ఆయన నటించిన ‘అనుక్షణం’ చిత్రం ఈ నెల 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘సాక్షి’తో విష్ణు ప్రత్యేకంగా ముచ్చటించారు.

 
‘అనుక్షణం ప్రచార చిత్రాల్లో ‘అమ్మాయిలూ జాగ్రత్త!’ అని క్యాప్షన్ పెట్టారు. ఇంతకూ ఈ సినిమాలో ఏం చెప్పబోతున్నారు? 
 నాకు తెలిసి భారతీయ తెరపై ఇలాంటి కాన్సెప్ట్‌తో సినిమా రాలేదు. పాటల కోసం, కామెడీ కోసం ఈ సినిమాకు రావొద్దు. ఇదొక మంచి ప్రయత్నం. దాని కోసమే రండి. సినిమా కేవలం గంటన్నర మాత్రమే ఉంటుంది. ఇక కథ విషయానికొస్తే... సిటీలో ఓ సైకో కిల్లర్ తిరుగుతుంటాడు. వాణ్ణి పట్టుకోవడమే సినిమా కాన్సెప్ట్. ఇందులో నేను డీజీపీ గౌతమ్ పాత్ర చేశా. స్టార్‌గా కాకుండా, ఒక నటునిగా నాకు గౌరవాన్ని పెంచే సినిమా అవుతుంది.

 ‘సమాజంలో నేరాలు పెరగడానికి కారణం సినిమాలే’ అని ఈ మధ్య ఓ సర్వే తేల్చింది. ఇలాంటి క్రైమ్ సినిమాల ప్రభావం జనాలపై పడే అవకాశం ఉంది కదా?
 పనికిమాలిన సర్వేల గురించి నేను అస్సలు మాట్లాడను. వాళ్లెవరండీ సినిమాలను విమర్శించడానికి. ఇంటర్నెట్‌లో విచ్చలవిడిగా కనిపిస్తున్న పోర్న్ ఫిలిమ్స్‌ని ముందు నిషేధించమనండి. అది చేతకాదు కానీ, సినిమాల గురించి మాట్లాడతారు. నా ఇద్దరు కూతుళ్లు, నా మేనకోడల్ని కలుపుకొని నాకిప్పుడు ముగ్గురు కూతుళ్లు. ముగ్గురు పిల్లల తండ్రిగా చెబుతున్నాను. నా పిల్లలు గర్వపడేలా సినిమాలుంటాయి. ఎదుటివారిపై దుష్ర్పభావాన్ని చూపించే సినిమాలు నా నుంచి రావు. దట్సాల్.

 మాస్ ఇమేజ్ ఉన్న మీరు ఇలా ప్రయోగాల జోలికి వెళ్లడం కరెక్టేనా?
 నాకు స్టార్‌గా ఎదగడం కంటే, నటుడిగా ఎదగడమే ఇష్టం. ఒక్కసారి ఆలోచించండి. మా ముందు తరంలో ఎంతమంది హీరోలున్నా... మా నాన్నగారిని, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్  గార్లను మాత్రమే జనాలు గుర్తు పెట్టుకున్నారు. కారణం... నటులుగా వాళ్లు చేసిన ప్రయోగాలు అలాంటివి. నేనూ వారి దారిలోనే వెళ్లాలనుకుంటున్నా.

 వర్మపై అభిమానంతోనా వరుసగా సినిమాలు చేస్తున్నారు?
 ఒక క్రియేటర్‌గా వర్మగారికి అభిమానులు కానివారెవరు?. మూసలో కొట్టుకుపోతున్న భారతీయ సినిమాకు ఓ దిశను నిర్దేశించిన దర్శకుడాయన. దేశం గర్వించదగ్గ అలాంటి దర్శకునితో పనిచేస్తున్నందుకు గర్విస్తున్నాను. అయితే.. వ్యక్తిగతంగా ఆయన్ను చాలా అంశాల్లో విభేదిస్తా. ఉదాహరణకు ‘వినాయకుడు’పై ఆయన చేసిన కామెంట్లు. ‘మా మనోభావాలను దెబ్బతీసే రీతిలో మాట్లాడటానికి మీరెవరు?’ అని సూటిగానే అడిగాను. ‘ఏం చేస్తారు?’ అని మొండిగా వాదించారు. ‘నువ్వు నూటయాభై ఏళ్ల క్రితం మనిషివి’ అని నన్ను విమర్శించారు. ఇలాంటి వ్యక్తిగత అంశాలను పక్కనపెడితే, దర్శకునిగా మాత్రం ఆయన లెజెండ్.

 నిర్మాతగా చెప్పండి. ‘రౌడీ’ మీకు లాభాలు తెచ్చిపెట్టిందా?
 నిర్మాతగా నాకు అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన సినిమా అది. నేనే కాదు, వర్మగారి వల్ల ఏ నిర్మాతా నష్టపోడు. ఆయన జడ్జిమెంట్ ఉన్న దర్శకుడు.

 ఈ వేలం పాట కాన్సెప్ట్ ఎవరిది? దీనివల్ల ఏమైనా లాభం ఉంటుందంటారా?
 ఇది వర్మగారి ఆలోచనే. దీని వల్ల నిర్మాతకు లాభం. దానికి ఉదాహరణ నేనే. ఈ సినిమా విషయంలో ఒక నిర్మాతగా పూర్తి సంతృప్తిగా ఉన్నాను. నిర్మాతకు, ఎగ్జిబిటర్లకు లాభం చేకూర్చే విధానం ఇది. అందుకని పంపిణీదారుల సహకారం లేకుండా ముందుకెళ్లలేం. ఆ విధంగా వారికీ లాభమే. మనోజ్ హీరోగా నేను నిర్మిస్తున్న ‘కరెంట్ తీగ’ చిత్రాన్ని కూడా ఇదే విధానంతో అక్టోబర్ 2న విడుదల చేయనున్నాం. దాసరిగారు కూడా ‘ఎర్రబస్సు’ని ఈ రీతిగానే విడుదల చేయనున్నారు. మరికొందరు నిర్మాతలు కూడా ఈ విధానంపై అవగాహన పెంచుకునే పనిలో ఉన్నారు. ‘వేలంపాట విధానం’పై పేటెంట్ హక్కులు మావే. ఇక నుంచి ఈ రీతిగా సినిమాలు విడుదల చేయాలనుకునే ప్రతివారూ మమ్మల్ని సంప్రదించే విడుదల చేయాలి. ఇందుకుగాను ఓ వెబ్‌సైట్‌ని కూడా స్టార్ట్ చేశాం.

 తెలుగు సినిమా చరిత్రపై ఓ డాక్యుమెంటరీ చేస్తామని చెప్పారు కదా! అది ఏమైంది?
 స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తాం. ఎవరిపై ఆధారపకుండా నా సొంత ఖర్చుతో ఈ డాక్యుమెంటరీ చేస్తున్నాను. తెలుగు సినిమాను ఉద్ధరించిన ఎందరో మహానుభావులు ఇప్పుడు వెలుగులో లేరు. వారందరినీ బయటకు తేవడమే మా డాక్యుమెంటరీ లక్ష్యం. ఉదాహరణకు చిత్తూరు నాగయ్యగారు. ఆయన తెలుగు సినిమా తొలి సూపర్‌స్టార్. కానీ... ఆయనకు తమిళులు ఇచ్చినంత గౌరవం మనం ఇవ్వలేదు. ఇంకా అలాంటి వారు చాలామంది ఉన్నారు. వారందరికోసమే ఈ డాక్యుమెంటరీ. ఈ డాక్యుమెంటరీ గురించి ఇప్పటివరకూ ఏ ఛానల్‌వాళ్లూ నన్ను సంప్రదించకపోవడం బాధాకరం. అందుకే యూట్యూబ్‌లో విడుదల చేయాలనుకుంటున్నాను.

 ‘రావణ’ సినిమా ఎప్పుడు మొదలుపెడుతున్నారు?
 స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. వచ్చే ఏడాది ఆ సినిమా మొదలవుతుంది. నాన్న టైటిల్‌రోల్ చేసే ఆ పౌరాణిక చిత్రంలో నా రోల్ ఏంటో రాఘవేంద్రరావు అంకుల్ ఖరారు చేయలేదు.

 చివరిగా ఓ ప్రశ్న. ఓ బాధ్యతగల సినిమా వ్యక్తిగా శ్వేతాబసు ప్రసాద్ అంశంపై మీ స్పందన?
 నిజంగా దారుణం. తనతో పాటు అదే హోటల్లో దొరికిన ఆ బడాబాబుల పేర్లను మీడియా కానీ, పోలీసులుకానీ ఎందుకు బయటపెట్టలేదు. సినిమా సెలబ్రిటీ అవ్వడమే ఆ అమ్మాయి చేసిన పాపమా? మీడియా, పోలీసులు కూడా ఈ విషయంలో చాలా అత్యుత్సాహం ప్రదర్శించారు. ఎక్కడ తప్పులు జరగడం లేదు చెప్పండి? మీడియాలో తప్పులు జరగవా. పదకొండేళ్ల వయసులోనే బాలనటిగా జాతీయ అవార్డు తీసుకున్న ప్రతిభావంతురాలు తను. ఆమెకు ఇలా జరగడం నిజంగా బాధాకరం. నా తదుపరి చిత్రంలో శ్వేతాబసు ప్రసాద్‌కి మంచి పాత్ర ఇస్తా.
 - బుర్రా నరసింహ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement