anuksanam
-
‘అనుక్షణం’ బాటలో ‘భూ’
ఓ చిత్రాన్ని వేలం పాట ద్వారా పంపిణీ చేయడం అనే విధానం ‘అనుక్షణం’తో మొదలైన విషయం తెలిసిందే. ఇప్పుడా ఖాతాలో ‘భూ’ అనే మరో చిత్రం చేరింది. మహేశ్ కత్తి సమర్పణలో స్వీయదర్శకత్వంలో శ్రీ కిశోర్ నిర్మించిన చిత్రం ఇది. ఈ నెల 10న వేలం ఆరంభించనున్నారు. ఈ మధ్యకాలంలో వచ్చిన హారర్ చిత్రాలన్నిటికన్నా భిన్నంగా ఉంటుందని శ్రీ కిశోర్ అన్నారు. మహేశ్ కత్తి మాట్లాడుతూ - ‘‘పంపిణీరంగంలో నియంతృత్వ ధోరణిని అధిగమించాలనే ఉద్దేశంతోనే ఈ వేలం విధానాన్ని అనుసరిస్తున్నాం’’ అని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసేలా ఉండే కామిక్ హారర్ థ్రిల్లర్ ఇదని చిత్రకథానాయిక సుప్రియ తెలిపారు. మంచి పాటలివ్వడానికి కుదిరిందని, రీ-రికార్డింగ్‌కి కూడా స్కోప్ ఉన్న చిత్రమని కె.సి. మౌళి అన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాతలు: రవికాంత్, ఉదయప్రకాశ్. -
నా దృష్టిలో...థియేటర్ అంటే ఓ షాప్!
రామ్‌గోపాల్‌వర్మ ఏం చేసినా సంచలనమే. తాజాగా ఆయన విష్ణుతో చేసిన ‘అనుక్షణం’ రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా వర్మ ఏమన్నారంటే... మాఫియా, హారర్ కథల్ని పక్కనపెట్టి కొత్తగా సైకో కిల్లర్ కథాంశాన్ని ఎంచుకున్నారేంటి? దేశంలో జరిగిన పలు సైకో హత్యలే ఈ సినిమా కథకు ప్రేరణ. ఈ కథ తయారీ కోసం... సైకో హత్యలకు సంబంధించి పలు పుస్తకాలు చదివా. హాలీవుడ్ డాక్యుమెంటరీలు చూశా. పలు కేసుల్లో వాళ్లు హత్యలు చేసిన విధానాలను పోలీసుల సహకారంతో దగ్గరగా పరిశీలించా. ఇలాంటి స్క్రిప్ట్‌తో సినిమా చేయడం నాకిదే ప్రథమం. ఇలాంటి సినిమాల వల్ల ప్రేక్షకులకు క్రైమ్ ఎలా చేయొచ్చో నేర్పినవాళ్లు అవుతారు కదా! సమాజంలో జరుగుతున్న క్రైమ్‌తో పోలిస్తే... తెరపై మేం చూపించే క్రైమ్ చాలా తక్కువ. బయట జరిగే సంఘటనలే నా కథలకు ప్రేరణ. మీ ‘శివ’ సినిమా సమాజంపై ఎంత బలమైన ప్రభావం చూపిందో చెప్పాల్సిన పనిలేదనుకుంటా! అవన్నీ... వట్టి మాటలు. అప్పట్లో కళాశాలల్లో జరుగుతున్న సంఘటనలను బట్టే ఆ సినిమా తీశాను. నేను తెరపై కొత్తగా చూపించిందేం లేదు. కానీ బలమైన మాధ్యమమైన సినిమా ద్వారా క్రైమ్ మరింత చేరువయ్యే ప్రమాదం ఉందిగా? సినిమాలు చూసి నేర్చుకునేంత నీచమైన స్థితిలో జనాలు లేరని నా అభిప్రాయం. మీ నుంచి ఒక చక్కని సందేశాత్మక చిత్రాన్ని మేం ఎప్పుడు ఆశించొచ్చు? నా నుంచి అలాంటి సినిమాలు ఎప్పటికీ రావు. సినిమాలు జనాన్ని ఏ మాత్రం ప్రభావితం చేయవని నేను ఇంతకు ముందే చెప్పాను. ‘అనుక్షణం’కి విష్ణుని హీరోగా ఎందుకు ఎంచుకున్నట్టు? ఈ కథకు విష్ణు యాప్ట్. ఇప్పటివరకూ విష్ణు కామెడీ, యాక్షన్ సినిమాలే చేశాడు. అతనిలో తెలియని కోణం మరొకటుంది. దాన్ని ‘రౌడీ’ షూటింగ్ టైమ్‌లో చూశాను. పూర్తిస్థాయి సీరియస్ కేరక్టర్ తనతో చేయించాలని అప్పుడే అనుకున్నా. నేను అనుకున్నదానికంటే తను బాగా చేశాడు. అలాగే.. ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రను రేవతితో చేయించాను. ఆ పాత్రకు రేవతి లాంటి మంచి నటి చేస్తేనే కరెక్ట్. ఆ పాత్ర ప్రభావం సినిమాపై ఎంత స్థాయిలో ఉంటుందో రేపు తెరపై మీరే చూస్తారు. ఇంతకీ మీ వేలంపాట కాన్సెప్ట్ వర్కవుట్ అయ్యిందనే అనుకుంటున్నారా? కచ్చితంగా. సినీ నిర్మాణంలోకి వచ్చేవారికి ప్రమాదంలేని ప్రయాణం ఈ విధానం. కానీ... ఇక్కడ థియేటర్ల మాఫియా ఎక్కువైందని అందరూ అంటున్నారు కదా? అది తెలీని వాళ్లు అనే మాట. నాకు తెలిసిన దాని ప్రకారం అసలు ఇక్కడ మాఫియానే లేదు. నా దృష్టిలో థియేటర్ అంటే ఒక షాప్. ఆ షాప్‌లో ఏది ఎక్కువగా అమ్ముడు పోతుందో దాన్ని తీసుకొచ్చి పెడతారు. అలాగే ఏ సినిమాకైతే డబ్బులొస్తాయో, ఆ సినిమానే థియేటర్‌కి తెచ్చుకుంటారు. ఇది వ్యాపారం. దీన్ని మాఫియా అనడం ఎంతవరకూ కరెక్ట్ చెప్పండి. ఇంతకూ మీ ‘ఐస్‌క్రీమ్’ చివరి అంకె ఏంటో చెప్పండి? ‘ఐస్‌క్రీమ్-2’ రిలీజ్‌కి రెడీగా ఉంది. ‘ఐస్‌క్రీమ్-3’ త్వరలోనే సెట్స్‌కి వెళ్లనుంది. ఇవి సింపుల్ స్క్రిప్ట్‌తో, సింపుల్ బడ్జెట్‌తో రూపొందే సినిమాలు. ఇలాంటివి థియేటర్లలో ఒక్కరోజు ఆడినా డబ్బులొచ్చేస్తాయి. ఆ ఒక్క రోజు కూడా జనాలు ఎవరూ రానప్పుడు ‘ఐస్‌క్రీమ్’ సిరీస్ ఆగిపోతుంది. లక్ష్మీప్రసన్నపై లఘుచిత్రం తెల్లని పరుపుపై నిద్రిస్తున్న ఓ అమ్మాయి అందమైన పాదాలు ముద్దుముద్దుగా కనిపిస్తున్నాయి. ఇంతకీ ఆ పాదాలు ఎవరివి? అనుకుంటున్నారా! తానెవరో కాదు. మంచు లక్ష్మి. ఆమె దైనందిన జీవితంపై దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ ఓ లఘు చిత్రాన్ని తెరకెక్కించారు. ఆద్యంతం మంచు లక్ష్మి పాదాలపైనే ఈ లఘు చిత్రాన్ని వర్మ రూపొందించడం విశేషం. ఇందులో మోహన్‌బాబు, మంచు విష్ణు కూడా తళుక్కున మెరుస్తారు. వర్మ తెరకెక్కించిన తొలి లఘు చిత్రం ఇదే కావడం విశేషం. త్వరలోనే దీన్ని విడుదల చేయనున్నారు. దీని తర్వాత... వర్మ జీవన విధానాన్ని స్వీయ దర్శకత్వంలో ఓ లఘు చిత్రంగా రూపొందిస్తానని మంచు విష్ణు విలేకరులతో పేర్కొనడం విశేషం. -
వేలం పాటకు రెడీ
‘‘ఈ సినిమా మొత్తం అవుడ్డోర్‌లోనే తీశాం. రెండు గ్రూప్‌లు ఒక చోటకు వెళ్లినపుడు అక్కడేం జరిగింది? వాళ్లనెవరు చంపారన్నది ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్. ‘అనుక్షణం’ తరహాలోనే ఈ చిత్రాన్ని కూడా వేలం పాట పద్ధతిలో విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని రామ్‌గోపాల్‌వర్మ చెప్పారు. ఆయన దర్శకత్వంలో భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించిన ‘ఐస్‌క్రీమ్-2’ చిత్రం ప్రచార చిత్రాన్ని, పాటను హైదరాబాద్‌లో విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘పేరుకే ఇది ఐస్‌క్రీమ్. కానీ చాలా వేడివేడిగా ఉంటుంది. వర్మతో వెంట వెంటనే రెండు సినిమాలు నిర్మించే అవకాశం రావడం నా అదృష్టం’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నటుడు జేడీ చక్రవర్తి, దర్శ కులు వీరశంకర్, మారుతి, కథానాయిక నవీన తదితరులు మాట్లాడారు. -
150 ఏళ్ల క్రితం మనిషినని వర్మ నన్ను విమర్శించారు!
మంచు విష్ణు ఆలోచనా సరళి భిన్నంగా ఉంటుంది. స్టార్‌గా ఎదగడం కంటే, నటునిగా ఎదగడమే గొప్ప అంటారాయన. తెరపై ఎంత ధాటిగా హీరోయిజం పలికిస్తారో, అంతే ధాటిగా సమాజంలో జరిగే చెడుపై కూడా స్పందిస్తారు. పెద్దలను గౌరవించడం, ప్రతిభను ప్రోత్సహించడం, కొత్త దారుల్ని అన్వేషించడం... ఇలా అభినందించదగ్గ అంశాలు విష్ణులో చాలానే కనిపిస్తాయి. రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో ఆయన నటించిన ‘అనుక్షణం’ చిత్రం ఈ నెల 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘సాక్షి’తో విష్ణు ప్రత్యేకంగా ముచ్చటించారు. ‘అనుక్షణం ప్రచార చిత్రాల్లో ‘అమ్మాయిలూ జాగ్రత్త!’ అని క్యాప్షన్ పెట్టారు. ఇంతకూ ఈ సినిమాలో ఏం చెప్పబోతున్నారు? నాకు తెలిసి భారతీయ తెరపై ఇలాంటి కాన్సెప్ట్‌తో సినిమా రాలేదు. పాటల కోసం, కామెడీ కోసం ఈ సినిమాకు రావొద్దు. ఇదొక మంచి ప్రయత్నం. దాని కోసమే రండి. సినిమా కేవలం గంటన్నర మాత్రమే ఉంటుంది. ఇక కథ విషయానికొస్తే... సిటీలో ఓ సైకో కిల్లర్ తిరుగుతుంటాడు. వాణ్ణి పట్టుకోవడమే సినిమా కాన్సెప్ట్. ఇందులో నేను డీజీపీ గౌతమ్ పాత్ర చేశా. స్టార్‌గా కాకుండా, ఒక నటునిగా నాకు గౌరవాన్ని పెంచే సినిమా అవుతుంది. ‘సమాజంలో నేరాలు పెరగడానికి కారణం సినిమాలే’ అని ఈ మధ్య ఓ సర్వే తేల్చింది. ఇలాంటి క్రైమ్ సినిమాల ప్రభావం జనాలపై పడే అవకాశం ఉంది కదా? పనికిమాలిన సర్వేల గురించి నేను అస్సలు మాట్లాడను. వాళ్లెవరండీ సినిమాలను విమర్శించడానికి. ఇంటర్నెట్లో విచ్చలవిడిగా కనిపిస్తున్న పోర్న్ ఫిలిమ్స్‌ని ముందు నిషేధించమనండి. అది చేతకాదు కానీ, సినిమాల గురించి మాట్లాడతారు. నా ఇద్దరు కూతుళ్లు, నా మేనకోడల్ని కలుపుకొని నాకిప్పుడు ముగ్గురు కూతుళ్లు. ముగ్గురు పిల్లల తండ్రిగా చెబుతున్నాను. నా పిల్లలు గర్వపడేలా సినిమాలుంటాయి. ఎదుటివారిపై దుష్ర్పభావాన్ని చూపించే సినిమాలు నా నుంచి రావు. దట్సాల్. మాస్ ఇమేజ్ ఉన్న మీరు ఇలా ప్రయోగాల జోలికి వెళ్లడం కరెక్టేనా? నాకు స్టార్‌గా ఎదగడం కంటే, నటుడిగా ఎదగడమే ఇష్టం. ఒక్కసారి ఆలోచించండి. మా ముందు తరంలో ఎంతమంది హీరోలున్నా... మా నాన్నగారిని, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ గార్లను మాత్రమే జనాలు గుర్తు పెట్టుకున్నారు. కారణం... నటులుగా వాళ్లు చేసిన ప్రయోగాలు అలాంటివి. నేనూ వారి దారిలోనే వెళ్లాలనుకుంటున్నా. వర్మపై అభిమానంతోనా వరుసగా సినిమాలు చేస్తున్నారు? ఒక క్రియేటర్‌గా వర్మగారికి అభిమానులు కానివారెవరు?. మూసలో కొట్టుకుపోతున్న భారతీయ సినిమాకు ఓ దిశను నిర్దేశించిన దర్శకుడాయన. దేశం గర్వించదగ్గ అలాంటి దర్శకునితో పనిచేస్తున్నందుకు గర్విస్తున్నాను. అయితే.. వ్యక్తిగతంగా ఆయన్ను చాలా అంశాల్లో విభేదిస్తా. ఉదాహరణకు ‘వినాయకుడు’పై ఆయన చేసిన కామెంట్లు. ‘మా మనోభావాలను దెబ్బతీసే రీతిలో మాట్లాడటానికి మీరెవరు?’ అని సూటిగానే అడిగాను. ‘ఏం చేస్తారు?’ అని మొండిగా వాదించారు. ‘నువ్వు నూటయాభై ఏళ్ల క్రితం మనిషివి’ అని నన్ను విమర్శించారు. ఇలాంటి వ్యక్తిగత అంశాలను పక్కనపెడితే, దర్శకునిగా మాత్రం ఆయన లెజెండ్. నిర్మాతగా చెప్పండి. ‘రౌడీ’ మీకు లాభాలు తెచ్చిపెట్టిందా? నిర్మాతగా నాకు అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన సినిమా అది. నేనే కాదు, వర్మగారి వల్ల ఏ నిర్మాతా నష్టపోడు. ఆయన జడ్జిమెంట్ ఉన్న దర్శకుడు. ఈ వేలం పాట కాన్సెప్ట్ ఎవరిది? దీనివల్ల ఏమైనా లాభం ఉంటుందంటారా? ఇది వర్మగారి ఆలోచనే. దీని వల్ల నిర్మాతకు లాభం. దానికి ఉదాహరణ నేనే. ఈ సినిమా విషయంలో ఒక నిర్మాతగా పూర్తి సంతృప్తిగా ఉన్నాను. నిర్మాతకు, ఎగ్జిబిటర్లకు లాభం చేకూర్చే విధానం ఇది. అందుకని పంపిణీదారుల సహకారం లేకుండా ముందుకెళ్లలేం. ఆ విధంగా వారికీ లాభమే. మనోజ్ హీరోగా నేను నిర్మిస్తున్న ‘కరెంట్ తీగ’ చిత్రాన్ని కూడా ఇదే విధానంతో అక్టోబర్ 2న విడుదల చేయనున్నాం. దాసరిగారు కూడా ‘ఎర్రబస్సు’ని ఈ రీతిగానే విడుదల చేయనున్నారు. మరికొందరు నిర్మాతలు కూడా ఈ విధానంపై అవగాహన పెంచుకునే పనిలో ఉన్నారు. ‘వేలంపాట విధానం’పై పేటెంట్ హక్కులు మావే. ఇక నుంచి ఈ రీతిగా సినిమాలు విడుదల చేయాలనుకునే ప్రతివారూ మమ్మల్ని సంప్రదించే విడుదల చేయాలి. ఇందుకుగాను ఓ వెబ్‌సైట్‌ని కూడా స్టార్ట్ చేశాం. తెలుగు సినిమా చరిత్రపై ఓ డాక్యుమెంటరీ చేస్తామని చెప్పారు కదా! అది ఏమైంది? స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తాం. ఎవరిపై ఆధారపకుండా నా సొంత ఖర్చుతో ఈ డాక్యుమెంటరీ చేస్తున్నాను. తెలుగు సినిమాను ఉద్ధరించిన ఎందరో మహానుభావులు ఇప్పుడు వెలుగులో లేరు. వారందరినీ బయటకు తేవడమే మా డాక్యుమెంటరీ లక్ష్యం. ఉదాహరణకు చిత్తూరు నాగయ్యగారు. ఆయన తెలుగు సినిమా తొలి సూపర్‌స్టార్. కానీ... ఆయనకు తమిళులు ఇచ్చినంత గౌరవం మనం ఇవ్వలేదు. ఇంకా అలాంటి వారు చాలామంది ఉన్నారు. వారందరికోసమే ఈ డాక్యుమెంటరీ. ఈ డాక్యుమెంటరీ గురించి ఇప్పటివరకూ ఏ ఛానల్వాళ్లూ నన్ను సంప్రదించకపోవడం బాధాకరం. అందుకే యూట్యూబ్‌లో విడుదల చేయాలనుకుంటున్నాను. ‘రావణ’ సినిమా ఎప్పుడు మొదలుపెడుతున్నారు? స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. వచ్చే ఏడాది ఆ సినిమా మొదలవుతుంది. నాన్న టైటిల్‌రోల్ చేసే ఆ పౌరాణిక చిత్రంలో నా రోల్ ఏంటో రాఘవేంద్రరావు అంకుల్ ఖరారు చేయలేదు. చివరిగా ఓ ప్రశ్న. ఓ బాధ్యతగల సినిమా వ్యక్తిగా శ్వేతాబసు ప్రసాద్ అంశంపై మీ స్పందన? నిజంగా దారుణం. తనతో పాటు అదే హోటల్లో దొరికిన ఆ బడాబాబుల పేర్లను మీడియా కానీ, పోలీసులుకానీ ఎందుకు బయటపెట్టలేదు. సినిమా సెలబ్రిటీ అవ్వడమే ఆ అమ్మాయి చేసిన పాపమా? మీడియా, పోలీసులు కూడా ఈ విషయంలో చాలా అత్యుత్సాహం ప్రదర్శించారు. ఎక్కడ తప్పులు జరగడం లేదు చెప్పండి? మీడియాలో తప్పులు జరగవా. పదకొండేళ్ల వయసులోనే బాలనటిగా జాతీయ అవార్డు తీసుకున్న ప్రతిభావంతురాలు తను. ఆమెకు ఇలా జరగడం నిజంగా బాధాకరం. నా తదుపరి చిత్రంలో శ్వేతాబసు ప్రసాద్‌కి మంచి పాత్ర ఇస్తా. - బుర్రా నరసింహ