
సాక్షి, హైదరాబాద్: వివాదాస్పద షార్ట్‌ఫిల్మ్ ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్(జీఎస్టీ)’ తీసిన దర్శకుడు రాం గోపాల్ వర్మను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు శనివారం విచారించారు. ఈ షార్ట్‌ఫిల్మ్‌పై ఓ టీవీ చానల్‌లో చర్చ సందర్భంగా తనను వర్మ దూషించారం టూ సామాజిక కార్యకర్త దేవి సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు వర్మను పిలిచి విచారించారు. శనివారం మధ్యాహ్నం 12 నుంచి 3.30 వరకు సుమారు మూడున్నర గంటల పాటు వర్మకు 25 నుంచి 30 ప్రశ్నలు సంధించి సమాధానం రాబట్టే ప్రయత్నం చేశారు. ‘జీఎస్టీని ఎందుకు తీశారు? ఐటీ చట్టం ప్రకారం మహిళలను అశ్లీలంగా చూపెట్టడం తప్పు. మీ ఫేస్‌బుక్, ట్వీటర్‌లో పోస్టు చేసిన మాల్కోవా ఫొటోలు ఎక్కడివి? దేవితో పోర్న్ సినిమా తీస్తా అనడం ఎంతవరకు కరెక్ట్? భారత చట్టాలు ఈ సినిమాకు వర్తించవని చెప్తున్నారు.. దానికి ఆధారాలేవి..? అమెరికాలో తీశా అక్కడి నుంచే అప్‌లోడ్ చేశా అంటున్నారు.. ఎలా తీశారు?’అని పలు ప్రశ్నలను సంధించారు.
అయితే జీఎస్టీకి కాన్సెప్ట్ మాత్రమే ఇచ్చానని, సినిమా తాను విడుదల చేయలేదని, నేరుగా దర్శకత్వం వహించలేదని వర్మ సమాధానమిచ్చారు. పోలండ్, ఐరోపాలో జరిగిన షార్ట్‌ఫిల్మ్ చిత్రీకరణకు స్కైప్ ద్వారా దర్శకత్వం అందించానన్నారు. సామాజిక కార్యకర్త దేవిని ఉద్రేకంలోనే తిట్టానని వర్మ పోలీసులకు చెప్పారు. పోలండ్, ఐరోపాలో సినిమా తీసినా అందులోని అశ్లీల దృశ్యాలకు భారత చట్టాలే వర్తిస్తాయని, స్కైప్ ద్వారా దర్శకత్వం చేశానని, నేరుగా డైరెక్ట్ చేయలేదని అంటున్నారని, ఫిల్మ్ బై రాంగోపాల్‌వర్మ అని ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. షార్ట్‌ఫిల్మ్ చిత్రీకరణ జరిగిన సమయంలో వర్మ విదేశాలకు ఏమైనా వెళ్లాడా అని తెలుసుకునేందుకు పాస్‌పోర్టులను పరిశీలిస్తామని సీసీఎస్ అదనపు డీసీపీ రఘువీరా తెలిపారు. వర్మ ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకోవడంతో పాటు శుక్రవారం మళ్లీ విచారణకు హాజరుకావాలంటూ సీసీఎస్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment