సినిమా రివ్యూ: వి'వర్ణ' | Varna Movie Review: Sri Raghava fails to add colors | Sakshi
Sakshi News home page

సినిమా రివ్యూ: వి'వర్ణ'

Published Fri, Nov 22 2013 1:54 PM | Last Updated on Sat, Sep 2 2017 12:52 AM

సినిమా రివ్యూ: వి'వర్ణ'

సినిమా రివ్యూ: వి'వర్ణ'

సుమారు 60 కోట్ల వ్యయంతో తమిళంలో రూపొందిన 'ఇరందామ్ ఉల్గమ్' చిత్రం తెలుగులో 'వర్ణ'గా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనుష్క శెట్టి, ఆర్య జంటగా శ్రీరాఘవ దర్శకత్వంలో పీవీపీ బ్యానర్ పై పొట్లూరి వి ప్రసాద్ వర్ణ చిత్రాన్ని నిర్మించారు. షూటింగ్ ప్రారంభానికి ముందే అనేక ఇబ్బందులను ఎదుర్కొంది. ఎట్టకేలకు చిత్ర నిర్మాణాన్ని పూర్తి చేసుకుని 'వర్ణ'గా భారీ అంచనాలతో విడుదలైంది. ఈ చిత్రం ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుందో తెలుసుకునేందుకు ఓ సారి కథలోకి వెళ్తాం.

ఎవరిని ప్రేమించాం, ఎందుకు, ఎలా, ఎన్నాళ్లు ప్రేమించామనేది ముఖ్యం కాదు. ప్రేమిస్తున్నామా అనేదే ముఖ్యమనే పాయింట్ గా 'వర్ణ' రూపొందింది. ఈ పాయింట్ ఆధారంగా చేసుకుని రెండు లోకాల్లో రెండు జంటల మధ్య నడిచిన ప్రేమ కథలను ఈ చిత్రంలో తెరకెక్కించే ప్రయత్నం చేశారు.

మహిళను ఓ బానిసగా, విలాసవస్తువుగా చూసే ఓ కొత్త లోకంలో వర్ణ అనే ఒక బానిసను మహేంద్ర అనే యోధుడు ప్రేమిస్తుంటాడు.  వర్ణ ఇష్టానికి వ్యతిరేకంగా మహేంద్ర బలవంతంగా పెళ్లి చేసుకుంటాడు. అయితే తన ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి జరగడంతో వర్ణ ఆత్మహత్యకు ప్రయత్నం చేస్తుంది. 

ఇక మరో కథలో మధు అనే సోషల్ వర్కర్ ను రమ్య అనే డాక్టర్ ప్రేమిస్తుంది. రమ్య ప్రేమను మధు నిరాకరిస్తాడు. దాంతో రమ్య నిరాశకు లోనవుతుంది. అయితే రమ్య ప్రేమను నిరాకరించిన మధు తర్వాత అర్ధం చేసుకుని ప్రేమించడం ప్రారంభిస్తాడు. ఆ తర్వాత రమ్యను కన్విన్స్ చేసి పెళ్లి చేసుకుందామనుకున్న తరుణంలో రమ్య ప్రమాదంలో మరణిస్తుంది.

వర్ణ ఆత్మహత్య ప్రయత్నం,  రమ్య ఊహించని విధంగా మరణించడం ఇంటర్వెల్ వరకు సాగిన కథ. రెండు ప్రేమ కథలో హీరోయిన్ పాత్రలపై ఓ ట్విస్ట్ తో తొలి భాగం పూర్తి అవుతుంది. అయితే ఆత్మహత్యకు ప్రయత్నించిన వర్ణ పరిస్థితి ఏమిటి? మహేంద్ర ప్రేమను వర్ణ అంగీకరిస్తుందా? రమ్యను కోల్పోయిన మధు ఏమవుతాడు అనే ప్రశ్నలకు చిత్ర రెండవ భాగంలో సమాధానం దొరుకుతాయి. 

రెండు ప్రేమకథలతో ఓ కొత్తగా ప్రజెంట్ చేద్దామనే శ్రీరాఘవ ప్రయత్నం బెడిసి కొట్టిందనే చెప్పవచ్చు. రెండు లవ్ ట్రాక్స్ తో ప్రేక్షకుడిని కన్ ఫ్యూజ్ చేశాడు. దర్శకుడిగా శ్రీ రాఘవ తన కథను సరియైన రీతిలో ప్రజెంట్ చేయకపోవడం ఒక వైఫల్యమైతే.. ఎవరికి అర్ధం కాని పేలవమైన కథ ఎంచుకోవడం మరో మైనస్ పాయింట్. ప్రేక్షకులు ఏ విధంగా సంతృప్తి చెందుతారు అనే ప్రశ్నను దర్శకుడు వేసుకుని ఈ చిత్రాన్ని నిర్మించారా అనే సందేహం వెంటాడుతుంది. రెండు గంటలకు పైగా సాగిన ఈ సినిమాలో రెండు నిమిషాలు కూడా ప్రేక్షకుడ్ని మెప్పించలేకపోయాడని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని చూసే ప్రేక్షకుడికి అనుక్షణం ఓ రకమైన చిత్రహింసకు గురి చేయడమే కాకుండా, పుష్కలంగా అసహనాన్ని దర్శకుడు పంచిపెట్టారు. ఇంతకంటే ఈ చిత్రం గురించి, దర్శకుడి గురించి చెప్పడం సమయం వృధానే.

ఈ చిత్రంలో వర్ణ, రమ్య అనే పాత్రల్లో అనుష్క, మధు బాలకృష్ణ, మహేంద్ర అనే రోల్స్ లో ఆర్య కనిపించారు. విసిగెత్తించే కథలో అనుష్క, ఆర్యలు చేయాల్సిందేమి లేకపోయింది. అనుష్క, ఆర్యలు జంటగా మరో చిత్రంలో నటించారని చెప్పుకోవడానికే తప్ప వీరిద్దరికి ఏమాత్రం ఉపయోగపడదు.  యోధుడిగా ఆర్య సిక్స్ ప్యాక్ కూడా బూడిదలో పోసిన పన్నీరుగానే మిగిలింది. ఈ నాలుగు పాత్రలు తప్ప వర్ణలో రిజిస్టర్ అయ్యే మరో పాత్ర కనిపించదు. అందమైన లోకేషన్లు, రాంజీ కెమెరా పనితనం బాగున్నాయి. హరీస్ జైరాజ్ సంగీతం ఆకట్టుకునే విధంగా లేదు. అనిరుధ్ రవిచంద్రన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అక్కడక్కడ పర్వాలేదనిపించింది. కథలోనే లొసుగులు ఉండటంతో టెక్నిషియన్ల ప్రతిభ కూడా మరుగున పోయిందని ఖచ్చితంగా చెప్పవచ్చు. భారీ బడ్జెట్ తో తలా తోకా లేకుండా రూపొందిన వర్ణ నిరాశపరిచించింది. రెండు కథలతో రెండు లోకాలను చూపించిన దర్శకుడు.. ప్రేక్షకుడికి నరకం లాంటి మరో లోకాన్ని వర్ణ ద్వారా చూపించాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement