నా కల నెరవేరింది! | Anushka Shetty Special Interview | Sakshi
Sakshi News home page

నా కల నెరవేరింది!

Published Wed, Nov 20 2013 11:42 PM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM

Anushka Shetty Special Interview

 ఈ జనరేషన్‌లో మోస్ట్ లక్కీయెస్ట్ హీరోయిన్ అంటే అనుష్క పేరే    చెప్పాలి. కొన్ని కొన్ని హైఓల్టేజ్ పెర్‌ఫార్మెన్స్ కేరెక్టర్స్  విషయంలో      డెరైక్టర్స్‌కి  ఫస్ట్ చాయిస్ అండ్ బెస్ట్ చాయిస్ ఆమె. 2013 వత్సరం...  ఆమె కెరీర్‌లో చాలా కీలకమైనది.  ఈ ఏడాది మొదలైన       మూడు  భారీ ప్రాజెక్ట్స్‌లో  ఆమె ముఖ్య తార. ఆ జాబితాలో మొదటిది ‘వర్ణ’.  ఆర్య, అనుష్క జంటగా సెల్వరాఘవన్  దర్శకత్వంలో  ప్రసాద్ వి.  పొట్లూరి నిర్మించిన ఈ చిత్రం  రేపు విడుదల కానుంది. ఈ సినిమాపై  అనుష్క  భారీ అంచనాలే పెట్టుకున్నారు.  ఈ  నేపథ్యంలో అనుష్కతో  ‘సాక్షి’ ప్రత్యేకంగా ముచ్చటించింది.
 
  వర్ణ.. రుద్రమదేవి.. బాహుబలి... ఈ మూడూ మెగా ప్రాజెక్టులే.  ఒకేసారి ఈ మూడు సినిమాలు చేయడం ఎలా అనిపిస్తోంది?
 ముందుగా నిర్మాత శ్యామ్‌ప్రసాద్‌రెడ్డిగారికి థ్యాంక్స్ చెప్పాలి. ఆయన  నన్ను ‘అరుంధతి’కి ఎంపిక చేసినప్పుడు, నేను రెండే రెండు  సినిమాలు చేశాను. పైగా, వాటిలో నావి గ్లామర్ రోల్స్. కానీ, ఓ  నమ్మకంతో ‘అరుంధతి’కి అవకాశం ఇచ్చారు. ఆ సినిమా నేనేంటో  ప్రూవ్  చేసింది. దాంతో, అనుష్కకు నటనకు అవకాశం ఉన్న రోల్స్  ఇవ్వొచ్చని, శక్తిమంతమైన పాత్రలకు కూడా పనికొస్తాననే అభిప్రాయం  చాలామందికి ఏర్పడింది. అందుకే, ఇలా మెగా ప్రాజెక్ట్స్‌కి అవకాశం  వచ్చింది. ఈ మూడు కూడా అద్భుతమైన అవకాశాలు. బాధ్యతను    పెంచిన చిత్రాలు కూడా.
 
  ఈ మూడు చిత్రాల్లో ఏది కష్టం?
  అలా చెప్పలేం. ఏ సినిమా కష్టం దానిదే. కాకపోతే, ‘వర్ణ’తో పోల్చితే  ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ చిత్రాల్లో ఫైట్స్ ఎక్కువ.  ‘వర్ణ’లో నేను  పోరాట యోధురాల్ని కాదు. సందర్భానుసారం కొన్ని ఫైట్స్ చేశాను.  ఆర్య వారియర్ కాబట్టి, తనకు రిస్కీ ఫైట్స్ ఉన్నాయి.
 
  ఈ సినిమాకి మీరే హీరో అని ఆర్య అంటున్నారు..?
 సినిమాలో నేనూ కొన్ని ఫైట్స్ చేశాను కాబట్టి అలా అని ఉంటారు. కానీ, ఆర్య చేసిన పాత్రలు కూడా చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయి. నేను దేవుణ్ణి, వాడు-వీడు చిత్రాల్లో తను ఎంత అద్భుతంగా నటించారో తెలిసిందే. ఈ సినిమాలో కూడా నటనపరంగా ఆర్య విజృంభించారు.
 
 ‘వర్ణ’ అంటే ఏంటి.. ఇందులో మీరు రెండు పాత్రలు చేశారా?
  ఈ సినిమాలో నేను రెండు పాత్రల్లో కనిపిస్తాను. ఒక పాత్ర పేరు వర్ణ. సాదాసీదా అమ్మాయి. ఇంకోటి డాక్టర్ కేరక్టర్. ఒక పాత్ర  సీరియస్‌గా, ఇంకోటి అమాయకంగా ఉంటుంది. రెండు భిన్నమైన పాత్రల్లో వ్యత్యాసం చూపించడానికి శాయశక్తులా కృషి చేశాను.
 
  సో.. ఫ్లాష్‌బ్యాక్ ఉంటుందన్నమాట..
  అదేం లేదు. రెండు విభిన్న ప్రపంచాలలో జరిగే కథ అనుకోవచ్చు. ఓ టిపికల్ లవ్‌స్టోరీతో తీసిన సినిమా. ప్రేమ కోసం ఎంతవరకూ  వెళతామో సినిమా చూస్తే తెలుస్తుంది. నేటి తరానికి తగ్గ కథతోనే సినిమా ఉంటుంది. కథలో కొంచెం ఆధ్యాత్మికత కూడా ఉంటుంది.
 
 సెల్వరాఘవన్ అంటే.. రెండు, మూడేళ్లు సినిమా తీస్తారనే అభిప్రాయం ఉంది. ఈ సినిమా ఒప్పుకునేటప్పుడు మీకా ఆలోచన రాలేదా?
 ఈ సినిమా ఒప్పుకోవడానికి ప్రధాన కారణం కథ. కొన్ని కథలు వదులుకుంటే భవిష్యత్తులో మళ్లీ రాకపోవచ్చు. ఈ సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది. ఇలాంటి సినిమా చేయాలనే నా కల ‘వర్ణ’తో నెరవేరింది. ‘వర్ణ’ అంగీకరించడానికి మరో కారణం సెల్వరాఘవన్. తనో అద్భుతమైన దర్శకుడు. అది అందరికీ తెలిసిన విషయం. కానీ, తెలియని విషయం ఏంటంటే, ఆయన ఎక్స్‌ట్రార్డనరీ పెర్ఫార్మర్. లొకేషన్లో ప్రతి సీన్ యాక్ట్ చేసి, చూపించేవారు. అలాగే, సీన్ చెప్పగానే ‘ఇలా తీస్తారేమో’ అని ఊహించుకునేదాన్ని. కానీ, అందుకు భిన్నంగా ఆయన టేకింగ్ ఉండేది. ఈ సినిమా చేయడంవల్ల నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇక, సినిమా ఆలస్యం అయ్యిందంటే దానికి నేను, ఆర్య కూడా ఒక కారణమే. మేం మిగతా సినిమాలు చేయడంవల్ల డేట్స్ విషయలో కొంచెం ఇబ్బంది ఏర్పడింది. ఓ నటిగానే కాదు.. ఓ ప్రేక్షకురాలిగా కూడా ఇలాంటి సినిమా చూడ్డానికి ఇష్టపడతాను.
 
 చిత్ర నిర్మాతల గురించి?
 సినిమా మీద ఎంతో పేషన్ ఉన్నవాళ్లే ‘వర్ణ’లాంటివి తీయగలుగుతారు. ప్రసాద్‌గారు, వినయ్‌గారు కథని నమ్మి ఈ సినిమా నిర్మించారు. ఏ విషయంలోనూ రాజీపడలేదు. ఈ సినిమాకి వాళ్లు నిర్మాతలు కాబట్టే.. న్యాయం జరిగింది.
 
 ప్రేమ కోసం ఎంత దూరమైనా వెళ్లే కథతో రూపొందిన చిత్రం ‘వర్ణ’ అన్నారు. మరి.. మీరు ప్రేమలో పడితే, దానికోసం ఎంత దూరం అయినా వెళ్లడానికి ట్రై చేస్తారా?
 అంత అవసరం రాదేమో అనుకుంటున్నా. ఎందుకంటే, నేను ప్రేమలో పడితే హ్యాపీగా పెళ్లి చేసుకుంటా. నా లవ్‌స్టోరీకి ఎలాంటి ఇబ్బందులు రావనుకుంటున్నా.
 
 అయితే మీది గ్యారంటీగా లవ్ మ్యారేజే అన్నమాట...
 ఏదీ ముందే చెప్పలేం. నచ్చిన వ్యక్తి తారసపడితే ప్రేమ వివాహం చేసుకుంటా. లేకపోతే పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటా.
 
 అంటే.. ఇప్పటివరకూ ప్రేమలో పడలేదా?
 ఇప్పటికి పడలేదు. భవిష్యత్తులో పడతానేమో తెలియదు. అసలు ఎప్పుడో జరగబోయేవాటి గురించి ఇప్పుడే ఎలా ఊహించగలుగుతాం.
 
 అసలు పెళ్లిపై మీ అభిప్రాయం ఏంటి?
 సదభిప్రాయమే ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement