వరుణ్ తేజ్
‘తొలిప్రేమ’ షూటింగ్ టైమ్‌లో సంకల్ప్ కలిశాడు. ‘అంతరిక్షం’ సినిమా లైన్ చెప్పక ముందే కొన్ని ఫొటోలు చూపించాడు. ఆ తర్వాత ‘అంతరిక్షం’ నేపథ్యంలో సినిమా అనుకుంటున్నా అని స్టోరీ చెప్పాడు. కొత్తగా ట్రై చేద్దామనుకుంటున్న నేను కథ వినగానే చాలా ఎగై్జట్ అయ్యాను’’ అని వరుణ్ తేజ్ అన్నారు. ‘ఘాజీ’ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా, లావణ్యా త్రిపాఠి, అదితీరావు హైదరీ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘అంతరిక్షం 9000 కెఎంపిహెచ్’. క్రిష్ జాగర్లమూడి సమర్పణలో సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌రెడ్డి నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ పంచుకున్న విశేషాలు.
► ‘అంతరిక్షం’ పూర్తి కథ రెడీ చేయడానికి, స్క్రీన్‌ప్లేకి సంకల్ప్ టైమ్ తీసుకున్నాడు. బెంగళూరులోని ఇస్రో మాజీ శాస్త్రవేత్తలను కలిసి వివరాలు సేకరించాడు. ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నప్పుడు లోపల చిన్న భయం ఉండేది. తెలుగు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారా? అని. అయితే ప్రస్తుతం ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారు. తప్పకుండా వారికి నచ్చు తుందనే నమ్మకంతో చేశా.
► ఇదొక వ్యోమగామి కథ. సినిమాలో కథ, ఎమోషన్స్ చాలా బాగున్నా దానికి అంతరిక్షం నేపథ్యం జోడించడం ఇందులో హైలైట్. సెకండ్ హాఫ్ మొత్తం స్పేస్ నేపథ్యంలోనే ఉంటుంది. వాస్తవ సంఘటనను స్ఫూర్తిగా తీసుకుని సంకల్ప్ హీరో పాత్ర సృష్టించాడు. ఇందులో దేవ్ అనే సైంటిస్ట్‌గా కనిపిస్తా. దేశానికి గొప్ప పేరు తీసుకురావాలనే అతని కల ఎలా నెరవేరిందన్నదే కథ. ఈ పాత్ర చేయడానికి నాకెలాంటి రిఫరెన్స్‌లు లేవు. స్పేస్ నేపథ్యంలోని కొన్ని హాలీవుడ్ సినిమాలు చూశా. తమిళ ‘టిక్ టిక్ టిక్’ సినిమా కూడా బాగుంది. ఆ సినిమా దర్శక, నిర్మాతల సూచనలు కూడా తీసుకున్నాం.
► వ్యోమగామి సూట్ వేసుకోవడానికే చాలా టైమ్ పట్టేది. సూట్, హెల్మెట్‌తో పాటు బ్యాక్ ప్యాక్ అన్నీ కలిపి దాదాపు 15 కిలోల బరువు ఉండేవి. ఆ సూట్ వేసుకున్నప్పుడు రెండు మూడు రోజులు ఇబ్బందిగా అనిపించింది. ఆ తర్వాత అలవాటైపోయింది. ఇప్పటి వరకూ నేను చేయని సరికొత్త పాత్ర ఇది. నటుడిగా నాకు సవాల్‌గా అనిపించింది. ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి పంచుతుంది.
► జీరో గ్రావిటీ ఎఫెక్ట్ కోసం వ్యాక్యూమ్ రూమ్స్ రెంట్‌కి తీసుకుని షూటింగ్ చేసుకోవచ్చు. హాలీవుడ్ సినిమాల్లాగా ఒక సర్టెన్ హైట్‌కి వెళ్లి చిత్రీకరించుకోవచ్చు. అలా చేయాలంటే బడ్జెట్ 400 నుండి 500 కోట్లు అవుతుంది. మా సినిమా బడ్జెట్ దాదాపు 25 కోట్లు. మాకున్న బడ్జెట్‌లో కంప్యూటర్ గ్రాఫిక్స్ వర్క్‌తో మంచి ఔట్‌పుట్ తెచ్చాం. షూటింగ్‌లో ఎక్కువ రోజులు తాడుతో గాల్లో వేలాడటం కోసం ముందుగానే ప్రాక్టీస్ చేశాం.
► తెలుగులో వస్తున్న మొదటి స్పేస్ థ్రిల్లర్ సినిమా ‘అంతరిక్షం’ కావడంతో అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచి మారింది. పోస్టర్లు, ట్రైలర్ చూసి సినిమాకు వెళ్లాలా? వద్దా? అని ఆలోచిస్తున్నారు. మా సినిమా వారికి మంచి విజువల్ వండర్‌లా అనిపిస్తుంది. అంతరిక్షం అంటే ఏంటి? ఎలా ఉంటుంది? అని బి,సి తరగతుల ప్రేక్షకులకు కూడా అర్థమయ్యేలా మా సినిమా ఉంటుంది.
► ఈ సినిమాలో పరిస్థితులే విలన్. టీమ్ ఆఫ్ ఆస్ట్రోనాట్స్ వాటిని ఎలా ఎదుర్కొన్నారన్నదే కథాంశం. మన లైఫ్ ఇంత ఈజీ అయిందంటే అది స్పేస్ రీసెర్చ్ వల్లే. నేను ప్రయోగాలు చేస్తున్నానని అనుకోవడం లేదు. రొటీన్ సినిమాల్లా కాకుండా సరికొత్త పాయింట్‌తో నా సినిమాలు ఉండాలనుకుంటా.
► సింపుల్‌గా సినిమా చేసేసి డబ్బులు సంపాదిద్దాం అనే ఆలోచన రాజీవ్‌రెడ్డిగారికి లేదు. వైవిధ్యమైన సినిమాలు చేయాలని ఆలోచిస్తారు. క్రిష్‌గారు కూడా అంతే. ఇందులో లావణ్య త్రిపాఠి టీచర్‌గా కనిపిస్తుంది. సినిమాలో నా పాత్రకి, అదితి పాత్రకి మధ్య లవ్ యాంగిల్ ఏం ఉండదు.
‘ఎఫ్ 2’ సినిమాలో వెంకటేశ్‌గారు, రాజేంద్రప్రసాద్‌గారితో పనిచేయడం వెరీ హ్యాపీ. వాళ్లు సింగిల్ టేక్‌లో సీన్ చేసేసేవారు. నేను ఒక్కోసారి రెండు మూడు టేక్‌లు తీసుకునేవాడిని. నా తర్వాతి సినిమా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఉంటుంది. స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో అల్లు అరవింద్‌గారి తనయుడు అల్లు వెంకటేశ్ నిర్మిస్తారు. ఆ చిత్రం తర్వాత సాగర్ చంద్ర దర్శకత్వంలో చేస్తా. హరీష్ శంకర్‌గారు ఓ సినిమా రీమేక్ గురించి చర్చించారు. ఇంకా ఫైనల్ కాలేదు. నా సినిమా కథలన్నీ నాన్నగారు (నాగబాబు) వినరు. చెల్లి నిహారిక నటించిన ‘సూర్యకాంతం’ సినిమా కథ నాకు తెలుసు. ప్రణీత్ యంగ్ డైరెక్టర్. వారిని ప్రోత్సహిద్దామనే ఆ సినిమాకి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నా.
Comments
Please login to add a commentAdd a comment