రజనీకాంత్‌ను కిడ్నాప్ చేయాలనుకున్నాడా?
సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కిడ్నాప్ చేయాలనుకున్నాడా? అవుననే అంటున్నారు సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ. ఆయన చిత్రాల మాదిరిగానే ఆయన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తాయన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కరేదు. రామ్‌గోపాల్‌వర్మలో ధైర్యం ఎక్కువనే చెప్పాలి. వాక్ స్వాతంత్య్రాన్ని వాడుకోవడంలో ఆయనకు ఆయనే సాటి.
కాగా ఆయన ఇటీవల గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ జీవితం ఇతివృత్తంతో కిల్లింగ్ వీరప్పన్ అనే చిత్రాన్ని రూపొందించిన విషయం తెలిసిందే. ఆ చిత్రం ఇప్పుడు హిందీలో రీమేక్ కానుంది. దీన్ని సంతోష్ నిర్మించనున్నారు. ఈ చిత్రం కోసం రామ్‌గోపాల్‌వర్మ చాలా పరిశోధించారు. వీరప్పన్‌ను స్వయంగా ఇంటర్య్వూ చేసిన వారు, పోలీసు అధికారుల నుంచి పలు వాస్తవాలను సేకరించి కథను తయారు చేశారు. వీరప్పన్ కన్నడ సూపర్‌స్టార్ రాజ్‌కుమార్‌ను కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే.
అప్పట్లో ఆ సంఘటన అటు కన్నడ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇటు తమిళనాడు ప్రభుత్వాన్ని తీవ్ర ఒత్తిడికి గురి చేసింది. ముఖ్యంగా పోలీస్ యంత్రాంగానికి పెను సవాల్‌గానే మారింది. అదే భాణీలో మన సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను కిడ్నాప్ చేయాలనుకున్నారట. దీని గురించి రామ్‌గోపాల్‌వర్మ తెలుపుతూ కొత్తగా సంచలనానికి తెర లేపారు. వీరప్పన్ జీవితం ఎంత మర్మమాయమో ఆయన ఎన్‌కౌంటర్ విషయంలోనూ అంతగా నమ్మశక్యం కాని విషయం దాగి ఉందని రామ్‌గోపాల్‌వర్మ పేర్కొన్నట్టు మీడియాలో ప్రచారం అవుతోంది.