‘వెండితెర విషాద రాగాలు’ ఆవిష్కరణ
‘వెండితెర విషాద రాగాలు’ ఆవిష్కరణ
Published Tue, Dec 10 2013 12:21 AM | Last Updated on Sat, Sep 2 2017 1:25 AM
‘‘ఒకప్పుడు అగ్రతారలుగా వెలుగొంది... చిన్నపాటి కారణాలు, పొరపాట్లతో జీవితాన్ని విషాదభరితం చేసుకున్న వారి గురించి నేటితరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ‘వెండితెర విషాదరాగాలు’ అనే పుస్తకంలో ఆ విషయాలన్నీ రచయిత పసుపులేటి రామారావు ప్రస్తావించారు. ఇలాంటి పుస్తకాలు మరెన్నో రావాలి’’ అని దాసరి నారాయణరావు అన్నారు. సీనియర్ ఫిలిమ్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు రచించిన ‘వెండితెర విషాద రాగాలు’ పుస్తకాన్ని సోమవారం హైదరాబాద్‌లో దాసరి ఆవిష్కరించి,
తొలి ప్రతిని గోపీచంద్‌కు అందించారు. ఈ సందర్భంగా దాసరి మాట్లాడుతూ -‘‘మహానటి సావిత్రి కోమాలోకి వెళ్లింది మొదలు, దహన సంస్కారాలు పూర్తయ్యేవరకూ అన్నీ తెలిసిన వ్యక్తిని నేను. చివరి రోజుల్లో కష్టాలు పడినా గొప్ప జీవితాన్ని గడిపిందామె. ఇలాంటి వాళ్లందరినీ రామారావు చాలా దగ్గర నుంచి చూసి ఈ పుస్తకం రాశాడు’’ అన్నారు. పసుపులేటి రామారావు రాతలో స్పష్టత, స్వచ్ఛత, నిజాయితీ ఉంటాయని నిర్మాత కేఎస్ రామారావు ప్రశంసించారు.
‘‘సినిమా వాళ్లంటే విలాసమైన జీవితమని చాలామంది అనుకుంటుంటారు. వారికీ చీకటి బతుకులుంటాయని తెలిపే పుస్తకమిది’’ అని పరుచూరి గోపాలకృష్ణ చెప్పారు. ఈ పుస్తకంలో ప్రస్తావించిన తారలతో తనకు మంచి అనుబంధముందని, అందుకే ఎక్కువ విషయాలు రాయగలిగానని పసుపులేటి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇంకా గోపీచంద్, రేలంగి నరసింహారావు, భీమనేని, శ్రీకాంత్, అల్లాణి శ్రీధర్, సురేష్ కొండేటి తదితరులు మాట్లాడారు.
Advertisement
Advertisement