
నాగచైతన్య, వెంకటేశ్
మామా అల్లుడు చిల్ అవుతున్నారు. మరి ఉన్నది కాశ్మీర్‌లో కదా. అక్కడ చల్లగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఇద్దరూ వెళ్లి దాదాపు 15 రోజులైంది. మరో 15 రోజుల దాకా అక్కడే చిల్లింగ్. హాలిడే ట్రిప్ అయితే ఇన్ని రోజులు ఉండరు కదా? పని మీదే వెళ్లారు మామా అల్లుళ్లు వెంకటేశ్, నాగచైతన్య. ఈ ఇద్దరూ మామా అల్లుళ్లుగా నటిస్తున్న చిత్రం ‘వెంకీమామ’. కె.ఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
వెంకీ సరసన పాయల్ రాజ్‌పుత్, చైతూ సరసన రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. ఆ మధ్య గోదావరి గట్టున ఉన్న ఓ పల్లెటూరిలో కీలక సన్నివేశాలు చిత్రీరించారు. ఆ తర్వాత దాదాపు నెల రోజులు కాశ్మీర్‌లో షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఈ నెల 13న కాశ్మీర్ షెడ్యూల్ ముగించుకుని టీమ్ హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ 6న డా. డి. రామానాయుడు జయంతి సందర్భంగా ఈ చిత్రం టీజర్‌ను రిలీజ్ చేయాలనుకుంటున్నారని తెలిసింది. సినిమాలో మామా అల్లుళ్ల సందడి ఎలా ఉండబోతోంది ఊహించుకునేలా ఈ టీజర్ ఉంటుందట.
Comments
Please login to add a commentAdd a comment