వారం ముందే వస్తోన్న గురు
సీనియర్ విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ గురు. తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కిన సాలా ఖద్దూస్కు రీమేక్గా తెరకెక్కిన ఈ సినిమాలో ఒరిజినల్ వర్షన్లో నటించిన రితికా సింగ్ కీలక పాత్రలో నటించింది. సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, చాలా కాలం క్రితమే పూర్తయినా.. రిలీజ్ను మాత్రం వాయిదా వేశారు. ముందుగా జనవరి 26నే సినిమా రిలీజ్ చేయాలని భావించినా.. తరువాత ఏప్రిల్ 7న రిలీజ్ చేయాలని నిర్ణయించారు.
అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను అనుకున్న సమయం కన్నా వారం ముందుగా అంటే మార్చి 31న రిలీజ్ చేయాలని నిర్ణయించారట. ఏప్రిల్ 7న మణిరత్నం, కార్తీల చెలియా రిలీజ్ అవుతుండటంతో అనవసరమైన పోటీ ఎందుకున్న ఆలోచనతో సినిమాను ముందుగానే రిలీజ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం గురు రిలీజ్ ప్రీ పోన్ అయిన విషయాన్ని యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించలేదు. అయితే అభిమానులు మాత్రం ప్రీ పోన్ చేయటమే బెటర్ అని భావిస్తున్నారు.