![Venu Madhav Death Loss To Telugu Film Industry Says Actor Rajasekhar - Sakshi](/styles/webp/s3/article_images/2019/09/25/raja-venu.jpg.webp?itok=Gll3h3DC)
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ మరణం ఇండస్ట్రీకి తీరని లోటని ప్రముఖ కథానాయకుడు, యాంగ్రీ స్టార్ రాజశేఖర్ అన్నారు. వేణుమాధవ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అతనితో తనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. రాజశేఖర్ మాట్లాడుతూ.. ‘‘వేణుమాధవ్ మా కుటుంబానికి ఎంతో సన్నిహిత మిత్రుడు. నన్ను బావా అని, జీవితను అక్క అని పిలిచేవాడు. ప్రతి పండక్కి తప్పకుండా ఫోన్ చేసేవాడు. అంతకు ముందే మెసేజ్ చేసి విష్ చేసేవాడు. మేమంటే తనకు అంత అభిమానం, ప్రేమ. మేమిద్దరం కలిసి సుమారు పది చిత్రాల్లో నటించాం. ‘మనసున్న మారాజు’, ‘రాజ సింహం’, ‘ఒక్కడు చాలు’, ‘గోరింటాకు’ చిత్రాల్లో తన నటనకు, హాస్యానికి మంచి పేరు వచ్చింది. ప్రతి ఒక్కరినీ వరుసలు పెట్టి పిలుస్తూ కుటుంబంలా కలుపుకుని వెళ్లేవారు. అంత మంచి మనిషి ఇంత త్వరగా లోకాన్ని విడిచి వెళతాడని అనుకోలేదు.
‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ (మా) ఎన్నికల సమయంలోనే వేణుమాధవ్‌కి ఆరోగ్యం బాలేదట! కానీ, ఎవరికీ తెలియన్విలేదు. సాటి కళాకారుల కోసం ముందడుగు వేశాడు. ఎన్నికల్లో విజయం సాధించాడు. తర్వాత వ్యక్తిగతంగా కొన్ని కార్యక్రమాలకు హాజరు కాకపోయినా.. ‘మా’కు సంబంధించి ఏం వచ్చినా వెంటనే స్పందించేవాడు. తన అభిప్రాయం చెప్తాడు. గత వారం ఆయన హాస్పిటల్‌లో ఉంటే వెళ్లి కలిశాను. సోమవారం సాయంత్రం డిశార్జ్ అయ్యారు. మళ్లీ సీరియస్ అయిందని మంగళవారం అడ్మిట్ చేశారు. అందరినీ ఎన్నో ఏళ్లుగా నవ్వించి, నవ్వించి ఈ రోజు లోకాన్ని విడిచి వెళ్లి ఏడిపిస్తున్నారు’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment