రామ్ గోపాల్ వర్మ
ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్ వర్మ వివాదం సృష్టించడం ద్వారా తన చిత్రానికి విపరీతమైన ప్రచారం పొంది మరోసారి విజయం సాధించారు. తన విజయపరంపరలో ఈసారి ఓ అడుగు ముందుకు వేశారు. కనీసం సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టకుండానే, వాల్పోస్టర్ ద్వారానే సంచలనం సృష్టించారు. వివాదాలాకు కేంద్ర బిందువైన రాము తన చిన్ననాటి జీవితానుభవం ఆధారంగా ఓ చిత్రం రూపొందించదలిచారు. తొలుత దానికి సావిత్రి అని పేరు పెట్టారు. ఈ మూవీకి సంబంధించి గీతాంజలి అనే మోడల్తో ఫొటో షూట్ ఒక్కటి మాత్రమే జరిగింది. వెంటనే వాల్పోస్టర్ విడుదల చేశారు. సావిత్రి పేరుతో ఓ టీచర్ అందాలను ఓ కుర్రాడు తొంగి తొంగి చూస్తూ ఉన్న స్టిల్ అది. అంతే ఇక విమర్శలు, వివాదం మొదలు.
చిన్నప్పుడు స్కూల్లో చదువుకునే రోజులలో తమ ఇంగ్లీష్ టీచర్ 'సరస్వతి' అంటే తనకు పిచ్చెక్కిపోయేదని తెలిపారు.ఆ సరస్వతే ఈ 'సావిత్రి' అని వివరించారు. ప్రతి టీనేజర్ జీవితంలో ఒక సావిత్రి ఉంటుందన్నారు. అంతే కాకుండా ఆ వయసులో కూడా చాలా మందికి ఇటువంటి అనుభవాలు ఉండే ఉంటాయని చెప్పారు. టీచరో, పక్కింటి లేదా ఎదురింటి ఆంటీనో, అక్క ఫ్రెండో, ట్యూషన్ టీచరో....ఇలా రకరకాల 'సావిత్రి'లు ఉండే ఉంటారన్నది వర్మ అభిప్రాయం. అందులో నిజంలేకపోలేదు. అలా అందరి జీవితాల్లో తారసపడిన ఆ సావిత్రులందరి పట్ల వారివారి అభిప్రాయాల ఆధారంగా ఈ సినిమా మొదలుపెట్టనున్నట్లు తెలిపారు. అంతటితో ఆగకుండా 'మీ సావిత్రి ఎవరు?' అనే కాంటెస్ట్ కూడా మొదలుపెట్టారు. పాఠకుల అనుభవాలను కూడా తమకు పంపమని కోరారు. 'సావిత్రి' సినిమా టైటిల్ను ఇప్పటికే మరొకరు రిజిష్టర్ చేసుకోవడం వల్ల ఆ పేరును మార్చవలసి వచ్చింది.దాంతో వర్మ తనకు ఇష్టమైన శ్రీదేవి పేరు పెట్టారు. వర్మకు ఆ పేరు ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. శ్రీదేవి-వెంకటేష్లతో వర్మ దర్శకత్వం వహించిన 'క్షణం క్షణం' గొప్ప విజయం కూడా సాధించింది.
సావిత్రి సినిమా పోస్టర్పై రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ స్పందించింది. సినిమా పోస్టర్ను కమిషన్ సుమోటోగా స్వీకరించింది. చిత్ర దర్శకుడు వర్మ, సెన్సార్‌బోర్డు, సిటీ పోలీస్ కమిషనర్ ఎం. మహేందర్‌రెడ్డిలకు నోటీసులు జారీ చేసినట్లు కమిషన్ సభ్యులు అచ్యుతరావు, మమతా రఘువీర్‌లు తెలిపారు. ఆ పోస్టరే కాకుండా, ఆ సినిమాను నిలిపివేయాలన్న డిమాండ్ మొదలైంది. బాలలహక్కుల కమిషన్తోపాటు మహిళా సంఘాలు, పలువురు ఉపాధ్యాయులు కూడా ఈ చిత్రంపై తమ అభ్యంతరం తెలిపారు. మహిళా సంఘాల ప్రతినిధులైతే వర్మకు మానసిక స్థితి సరిగా లేదని తేల్చేశారు. సినిమాలే కాదు వాటిపోస్టర్లను కూడా అశ్లీలంగా, అసభ్యంగా రూపొందించి, వివాదాల ద్వారా ప్రచారం పొందాలనే ఆలోచన సరికాదని హితవు పలికారు.మంచి, చెడుల విచక్షణను, నైతిక విలువలను మరిచిన రాంగోపాల్ వర్మ ఓ సైకోలా వ్యవహరిస్తున్నారని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) విద్యార్థులు మండిపడుతున్నారు. పవిత్రమైన గురుశిష్య సంబంధాలను కించపరుస్తూ వర్మ రూపొందించే చిత్రాన్ని నిషేధించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఈ వివాదాలపై వర్మ స్పందిచారు. ఈ సినిమాపై ఎందుకు అభ్యంతరకరమో చెప్పాలని ప్రశ్నించారు. జీవితంలో ప్రతి ఒక్కరికీ 'క్రష్' ఉంటుందని, ఆ విషయాన్ని ధైర్యంగా చెప్పానని టీచర్ సరస్వతి తనను అభినందించినట్లు తెలిపారు. ఈ సినిమాపై సరస్వతి టీచర్ అభ్యంతరం తెలపలేదన్నారు. తనకున్న భావాలను సినిమా ద్వారా చెప్పే స్వాతంత్ర్యం తనకుందని తనదైన స్టైల్లో చెప్పారు. ఆ తరువాత మామూలుగానే ఈ సినిమా చూడటం, చూడకపోవటం ఎదుటవారి ఇష్టమన్నారు. ఈ విధంగా వర్మ తన సినిమా ప్రారంభం కాకముందే కేవలం పోస్టర్ ద్వారానే వివాదం సృష్టించి విపరీతమైన ప్రచారం పొందారు.ఆలాగే ఈ అంశంపై కొందరిలో ఆలోచనను కూడా రేకెత్తించారు.ఆలోచనలకు జీవం పోయడంలో, సంచనాలు, వివాదాలు సృష్టించడంలో రాము దిట్ట అని మరోసారి నిరూపించారు.
-శిసూర్య