నా పాత్రను హిందీలో ఆయన చేస్తానన్నారు!
‘‘ఇలానే ఉండాలి.. ఇలాంటి పాత్రలే చేయాలి అని గిరి గీసుకుంటే ఆ క్షణం నుంచి బాధ మొదలవుతుంది. అందుకే, నేను ఏ పాత్ర అయినా చేయాలనుకుంటున్నాను. ఈ చిత్రంలో హీరోగా చేశాను కాబట్టి, తదుపరి కూడా అలానే చేయాలనుకోవడం లేదు’’ అని షఫీ అన్నారు. ఇటీవల విడుదలైన ‘శ్యామ్‌గోపాల్ వర్మ’లో ఆయన టైటిల్ రోల్ చేశారు. ఇప్పటివరకూ చేసిన పాత్రలన్నీ ఒక ఎత్తయితే, ఇందులో చేసిన పాత్ర మరో ఎత్తు అని అందరూ అంటున్నారని షఫీ అన్నారు. ఆయన మాట్లాడుతూ - ‘‘రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా సాగే సినిమా ఇది.
మౌత్ టాక్‌తో రోజు రోజుకీ వసూళ్ళు పెరుగుతున్నాయి. పూర్తి భిన్నమైన చిత్రం చేయాలనే నా ఆకాంక్షను నెరవేర్చిన చిత్రం ఇది. ఈ సినిమా గురించి చెప్పినప్పుడు దర్శకుడు రాకేశ్ శ్రీనివాస్ ‘ఇది రామ్‌గోపాల్‌వర్మ సినిమా కాదు.. శ్యామ్‌గోపాల్‌వర్మ’ అని స్పష్టంగా చెప్పారు. ఆయన్ను నమ్మి ఈ చిత్రం చేశాను. నా కెరీర్‌ని మరో స్థాయికి తీసుకెళ్లిన చిత్రం ఇది. అందుకు నిదర్శనం సినిమా విడుదలైనప్పట్నుంచీ నాకొస్తున్న ఫోన్‌కాల్స్, మెసేజ్‌లు. తెలుగులో నేను చేసిన పాత్రను ఈ చిత్రం హిందీ రీమేక్‌లో చేయడానికి మనోజ్ బాజ్‌పాయ్ అంగీకరించారని మా దర్శకుడు చెప్పారు. అది ఆనందించదగ్గ విషయం’’ అన్నారు.